iDreamPost
iDreamPost
సెలబ్రిటీ నుంచి సామాన్యుడి దాకా ఖర్చుకు రాజీ పడని వైద్య రంగంలోని లొసుగులను ఆధారంగా చేసుకుని వచ్చిన సినిమాలు తక్కువ. అప్పుడెప్పుడో వెంకటేష్ గణేష్ అవార్డులు రివార్డులతో పాటు మంచి కలెక్షన్లు కూడా తెచ్చింది కానీ మళ్ళీ అలాంటి సబ్జెక్టుని ఎవరూ టచ్ చేయలేకపోయారు. చిరంజీవి టాగూర్ లో ఒక ఎపిసోడ్ పెట్టారు తప్ప మూవీ అంతా ఆ కాన్సెప్ట్ మీదే ఉండదు. తాజా అప్ డేట్ ప్రకారం యాంగ్రీ మెన్ రాజశేఖర్ త్వరలో ఈ జానర్ లో ఓ చిత్రం చేయబోతున్నట్టు సమాచారం. ఇటీవలే కరోనా బారిన పడి కోలుకుని తిరిగి ఆరోగ్యవంతుడైన ఈ సీనియర్ హీరో చేయబోతున్నది స్ట్రెయిట్ సబ్జెక్టు కాదు.
మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ రీమేక్ కోసం రెడీ అవుతున్నట్టు ఫిలిం నగర్ టాక్. నాలుగు నెలల క్రితమే ఐడ్రీం ఇది జరిగే అవకాశాన్ని చూచాయగా తెలిపింది. ఆ సినిమా మీద ఎక్స్ క్లూజివ్ రివ్యూ కూడా అందించింది. ఇప్పుడు అదే నిజం కాబోతోందని తెలిసింది. నీలకంట దర్శకుడిగా వ్యహరించబోతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారి అమ్మాయి మంజులతో రెండే పాత్రలతో షో చేసి అందరి మెప్పు పొందిన నీలకంట ఆ తర్వాత మిస్సమ్మ లాంటి ఒకటి రెండు హిట్లు కొట్టారు తప్ప గొప్ప విజయం దక్కలేదు. క్వీన్ రీమేక్ తమన్నాతో దటీజ్ మహాలక్ష్మి చేస్తూ పూర్తి కాకుండానే వదిలేశారు.
బాలన్స్ పార్ట్ ని టైటిల్ కార్డులో పేరు వేయకూడదన్న కండిషన్ మీద అ! ఫేం ప్రశాంత్ వర్మ పూర్తి చేశాడు. ఎపుడు విడుదలవుతుందో ఎవరికీ తెలియదు. ఇదిలా ఉండగా జోసెఫ్ రీమేక్ ని పెద్ద నిర్మాణ సంస్థనే చేపట్టబోతున్నట్టు సమాచారం. మనుషుల అవయవాలతో వ్యాపారం చేయడం కోసం అమాయకుల ప్రాణాలు తీసేందుకు తెగించిన ఓ కార్పోరేట్ హాస్పిటల్ బ్యాక్ డ్రాప్ లో జోసెఫ్ సాగుతుంది. ఒరిజినల్ వర్షన్ హిట్ అయినప్పటికీ టేకింగ్ చాలా స్లోగా ఉంటుంది. మరి మన ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టు మార్పులు చేర్పులు చేశారో లేదో వేచి చూడాలి. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రావొచ్చు