విశాఖపట్నం అంటేనే అందరికీ భూ కుంభకోణాలు గుర్తుకు వస్తాయి. దీనికి తోడు మరిన్ని స్కాంలకు విశాఖ అడ్డాగా మారుతోంది. ఇటీవల ఇక్కడ దొంగ నోట్ల ముద్రణ వ్యవహారాన్ని పోలీసులు గుర్తించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా విశాఖ కేంద్రంగా జరుగుతున్న మరో భారీ కుంభకోణం బయటపడింది.
విశాఖకు చెందిన ఓ న్యాయవాది కుటుంబం ఈ దొంగపాసుల సాయంతో ఏపీ ఏసీ ఎక్స్ ప్రెస్ లో విశాఖ నుంచి దిల్లీ ప్రయాణిస్తున్న క్రమంలో ఈ మధ్యే ఖమ్మం రైల్వే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దొంగ పాసులకు సంబంధించి విచారణ జరపగా పలు కీలక విషయాలు బయటకు వచ్చాయి.
ప్రస్తుతం నగరంలో డాబాగార్డెన్స్ లోని ఓ స్క్రీన్ ప్రింటర్స్ ను అధికారులు గుర్తించారు. ఈ అంశం పై లోతైన దర్యాప్తు చేస్తే ఇంకా ఇలాంటి కేంద్రాలు ఎన్ని ఉన్నాయనే విషయాలు బయటపడతాయో తెలుస్తుంది. రైల్వే ఉద్యోగులు వాడే ఉచిత పాస్ లను అక్రమంగా ముద్రించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ కుంభకోణంలో సూత్రధారులు ప్రస్తుతం పరారిలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టేందుకు పోలీసులు వేగంగా విచారణ చేపడుతున్నారు.