iDreamPost
android-app
ios-app

మళ్లీ యువరాజుకే పగ్గాలు

మళ్లీ యువరాజుకే పగ్గాలు

కాంగ్రెస్ పార్టీ తిరిగి బలపడేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్లుంది. వరుస వైఫల్యాలతో చతికిల పడ్డ కాంగ్రెస్ కి అంతర్గత కుమ్ములాటలు అదనపు భారంగా మారాయి. సంస్థాగత మార్పులు అవసరమంటూ సీనియర్ నేతలు రాసిన లేఖతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. పార్టీలో ప్రక్షాళన అవసరమంటూ ఆగస్టులో 23 మంది సీనియర్ నేతలు సోనియాగాంధీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో జన్‌పథ్‌లో జరిగిన సమావేశం పార్టీకి పూర్వ వైభవం తేవడంపై లోతైన చర్చ జరిపింది. సమర్థవంతమైన నాయకత్వ అవసరాన్ని చర్చించిన సమావేశం ఏఐసీసీ పగ్గాలు తిరిగి యువరాజుకే అప్పగించాలని నిర్ణయించింది.

సోనియాగాంధీ నివాసం టెన్ జన్‌పథ్‌లో జరిగిన సమావేశంలో సోనియా గాంధీతోపాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీనియర్ నేతలు మన్మోహన్ సింగ్, పి.చిదంబరం, గులామ్ నబీ ఆజాద్, కపిల్ సిబల్, మనీష్ తివారీ, శశి థరూర్, వీరప్ప మొయిలీ తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సంధానకర్తగా వ్యవహరించారు. నాలుగు గంటలపాటు సుదీర్ఘ సమావేశంలో పార్టీ ప్రస్థుత పరిస్థితిపై చర్చించారు. పార్టీని బలోపేతం చేసేందుకు అవకాశమున్న మార్గాలు, లోతైన సమీక్ష అవసరాన్ని సమావేశం చర్చించింది.

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఏఐసీసీ బాధ్యతల నుంచి రాహుల్ గాంధీ తప్పుకోవడంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చుక్కానిలేని నావలా మారింది. ఈ దశలో పార్టీకి చురుకైన నాయకత్వం అవసరని భావించిన సమావేశం తిరిగి ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీకే అప్పగించాలని అభిప్రాయపడింది. సీనియర్ల అభిప్రాయాన్ని అంగీకరిస్తూ పార్టీ బాధ్యతలు చేపట్టడానికి రాహుల్ గాంధీ ఒప్పుకున్నారని ఆ పార్టీ నేత పవన్ బన్సల్ వెల్లడించారు. పార్టీ అధ్యక్ష పదవితో సహా, సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.

135 ఏళ్ల చరిత్రగల కాంగ్రెస్ పార్టీ కొన్నేళ్లుగా అన్ని ఎన్నికల్లోనూ వైఫల్యాలను చవిచూస్తోంది. కేంద్రంతో పాటు పలు రాష్ట్రాల్లోనూ అధికారాన్ని కోల్పోవడంతో సంస్థాగతంగా కూడా సమస్యలు తీవ్రమయ్యాయి. పార్టీ ప్రధాన బాధ్యతల నుంచి రాహుల్ తప్పుకోవడంతో ఒకింత నైరాశ్యం నెలకొంది. వరుస వైఫల్యాలు, నాయకత్వ కొరత లాంటి సమస్యలతో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి బలోపేతమవ్వడం వైపు దృష్టిసారించినట్లు అర్థమవుతోంది. రాహుల్ గాంధీకి తిరిగి బాధ్యతలు అప్పగించడం ద్వారా సంస్థాగతంగా పార్టీ నేతల్లో ఉన్న ససమ్మతికి సైతం చెక్ పెట్టడం సాధ్యమవుతుందని సీనియర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి పార్టీ పగ్గాలను యువరాజుకే అప్పగించాలని నిర్ణయించారు. మొత్తానికి ఈ సారైనా రాహుల్ గాంధీ సక్సెస్ అవుతారో లేదో చూడాలి.