iDreamPost
android-app
ios-app

రఘురామరాజు రెండో కోణం ఆలోచించలేదా..?

రఘురామరాజు రెండో కోణం ఆలోచించలేదా..?

పోలీసులు ఓ వ్యక్తిని అకారణంగా అరెస్ట్‌ చేయరు. సదరు కారణం సరైనదా..? కాదా..? అనేది న్యాయస్థానాల్లో తేలుతుంది. తనపై అన్యాయంగా పోలీసులు కేసు పెట్టారని, విచారణ సమయంలో కొట్టారని, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని ఎవరైనా చెబితే.. ఎవరైనా సరే ముందు అడిగే ప్రశ్న ఏం తప్పు చేశావని కేసు పెట్టారు..? ఏం చేస్తే కొట్టారు..? థర్డ్‌ డిగ్రీ ప్రయోగించే తప్పు నువ్వు ఏం చేశావ్‌..? అనే ప్రశ్నలు ఎదురవుతాయి. ఈ ప్రశ్నలన్నింటీకి కూడా పోలీసులపై ఆరోపణలు చేసిన వ్యక్తి సమాధానం చెప్పుకోక తప్పదు. ఇవేమీ చెప్పకుండా.. తనను కొట్టారని చెబితే.. ఎవరూ విశ్వసించరు.

ప్రస్తుతం ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యవహారం కూడా పైన పేర్కొన్న మాదిరిగానే ఉంది. అరెస్ట్‌ తర్వాత జరిగిన పరిణామాలను వివరిస్తూ రఘురామరాజు దేశంలోని ఎంపీలందరికీ లేఖలు రాశారు. రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో పార్టీలకు అతీతంగా తనకు మద్ధతుగా నిలబడాలని కోరారు. తాజాగా పార్లమెంటరీ ప్రజా ఫిర్యాదుల కమిటీ చైర్మన్, బీజేపీ ఎంపీ భూపేంద్ర యాదవ్‌తో రఘురామరాజు భేటీ అయ్యారు. అరెస్ట్‌ తర్వాత జరిగిన పరిణామాలను వివరిస్తూ.. తనను పోలీసులు అన్యాయంగా కొట్టారని, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని చెప్పుకున్నారు. ఈ నెల 25వ తేదీన జరిగే పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఈ విషయం చర్చించాలని కోరారు.

రఘురామ రాజు ఎంపీలకు లేఖ రాయడం, పార్లమెంటరీ ప్రజా ఫిర్యాదు కమిటీ చైర్మన్‌ను కలసి ఫిర్యాదు చేయడం వరకూ బాగానే ఉంది. అయితే తన ఫిర్యాదును, లేఖలో పేర్కన్న అంశాలను ఆయా ఎంపీలు ఎంత వరకు విశ్వసిస్తారనే అంశాన్ని రఘురామరాజు విస్మరించారు. కరుడుగట్టిన నేరస్తులపై కూడా పోలీసులు సాధారణంగా థర్డ్‌ డిగ్రీ ప్రయోగించరు. అలాంటిది పార్లమెంట్‌లో తమ ప్రతినిధిగా ప్రజలు ఎన్నుకున్న ఓ ఎంపీపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తారా..? అనే సందేహం రఘురామ రాజు లేఖ అందుకున్న ప్రతి ఎంపీలో తలెత్తకమానదు. అరెస్ట్‌ తర్వాత పరిణామాలనే వివరిస్తే.. అసలు అరెస్ట్‌ జరగడానికి ముందు పరిణామాలను ఆయా ఎంపీలు తప్పక విచారించి ఉంటారు.

ఏ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారో.. ఆ పార్టీపై, ఆ పార్టీ ప్రభుత్వంపై, ఆ పార్టీ నాయకుడు, ప్రభుత్వాధినేతపై నిత్యం విమర్శలు, వెకిలి మాటలు, చేష్టలను ఎంపీలు తెలుసుకుని ఉంటారు. సాటి ఎంపీ ఇలా ప్రవర్తించారా..? అని వారందరూ తప్పక అనుకుని ఉంటారు. తన పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు రఘురామరాజు మారారన్న ప్రశ్న ఆ లేఖను అందుకున్న ప్రతి ఎంపీకి కలిగి ఉంటుంది. త్వరలో జరగబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో ఎంపీల వద్దకు వెళ్లి మద్ధతు అడిగితే.. వారు అడిగే ఈ ప్రశ్నలకు రఘురామ రాజు సమాధానం చెపాల్సి ఉంటుంది. వారి సందేహాలు నివృత్తి చేయాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. మరి తన చర్యలను రఘురామకృష్ణం రాజు ఎలా సమర్థించుకుంటారో చూడాలి.

Also Read : నారా లోకేష్ సింహంలా ఎప్పుడు మారారు..?