iDreamPost
iDreamPost
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బాలీవుడ్ మెల్లగా కొత్త సినిమాల విడుదల ప్రకటనల వేగం పెంచింది. వారానికి రెండు మూడు ఉండేలా ప్లానింగ్ చేసుకుంటోంది. దాదాపు డిసెంబర్ దాకా క్యాలెండర్ సెట్ అయిపోయింది. నిన్న సల్మాన్ ఖాన్ రాధే డేట్ కూడా అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేవు. మే 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దబాంగ్ కి డిఫరెంట్ టైపు సీక్వెల్ గా చెప్పబడుతున్న ఈ రాధేకు మన ప్రభుదేవానే దర్శకుడు. ఈ ఇద్దరి కాంబోలో లాస్ట్ లో వచ్చిన దబాంగ్ 3 ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా సల్లు భాయ్ మరో ఆఫర్ ఇచ్చాడు.
ఇదిలా ఉండగా అదే రోజు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య కూడా రిలీజ్ ఎప్పుడో ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ రాధే క్లాష్ వల్ల ఇక్కడ వచ్చే నష్టం పెద్దగా ఉండదు కానీ నార్త్ లోనూ ఆచార్యను పెద్దగా రిలీజ్ చేయాలనుకున్న ప్రొడ్యూసర్ ప్లానింగ్ కు బ్రేక్ పడుతుంది. ఎందుకంటే ఆ రోజు నార్త్ మొత్తం రాధే నామస్మరణ తప్ప ఇంకేమి ఉండదు. అందులోనూ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ. అందుకే అంచనాలు చాలా భారీగా ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల వరకు ఆచార్యకు రాధే వల్ల వచ్చే ఎఫెక్ట్ పెద్దగా ఉండదు. కొద్దోగొప్పో మల్టీ ప్లెక్సుల కౌంట్ విషయంలో కొంచెం ఇబ్బంది తప్ప ఇంకేమి జరగదు.
రాధేకు సంబంధించి మరో ఆసక్తికరమైన టాక్ ఉంది. దీని పూర్తి హక్కులు సొంతం చేసుకున్న జీ స్టూడియోస్ కేవలం రెండు లేదా మూడు వారాల వ్యవధిలో పే పర్ వ్యూ మోడల్ లో జీ ప్లెక్స్ ద్వారా ఓటిటి రిలీజ్ చేసే ఆలోచనలో ఉందట. అయితే ఇది వచ్చిన టాక్ ని బట్టి రిజల్ట్ ని బట్టి డిసైడ్ అవుతారని తెలిసింది. ఒకవేళ తేడా కొట్టి డిజాస్టర్ అయితే మాత్రం వీలైనంత త్వరగా డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారు. ఎవడి చోటుకు వాడే రాజు అన్నట్టు అక్కడ రాధే ఇక్కడ ఆచార్య వల్ల ఒకళ్ళ మీద మరొకరి ప్రభావం అంతగా ఉండదనే చెప్పాలి. రాధే తెలుగులోనూ డబ్బింగ్ చేయబోతుండటం గమనార్హం.