iDreamPost
android-app
ios-app

“Vicarious Liability” అంటే ఏమిటో రాధాకృష్ణ తెలుసుకోవాలి!

“Vicarious Liability” అంటే ఏమిటో రాధాకృష్ణ తెలుసుకోవాలి!

ఏదైనా పొరపాటు జరిగినప్పుడు, ఆ పొరపాటుకు కారణమైన వ్యక్తి మనకు కావలసిన వాడైనప్పుడు అతనిని వెనకేసుకు రావడం సహజం. అయితే కొంతమందిని ఇలా వెనకేసుకు రావడం సామాన్య వ్యక్తులకు తేలిక కానీ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వారికి వీలు కాదు. అందులోనూ జరిగిన తప్పు చిన్నది కానప్పుడు, తప్పు జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు గుడ్డిగా సమర్ధించడం సరైన పని అనిపించదు.

విజయవాడ స్వర్ణా ప్యాలస్ అగ్నిప్రమాదంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పరిస్థితి ఇలాంటిదే. అయితే తన సంపాదకీయంలో రాధాకృష్ణ ఏమాత్రం ఆలోచించకుండా రమేష్ హాస్పిటల్ అధినేతని వెనకేసుకు రావడమే కాకుండా, అతని మీద ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా అతని సామాజిక వర్గం మీద కక్ష తీర్చుకున్నట్టే అని తేల్చేశాడు.

వైద్యులే ఛీకొడుతున్నారు

రమేష్ హాస్పిటల్ మీద ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వైద్యులను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయని రాధాకృష్ణ తీర్పు చెప్పాడు. కరోనా రిపోర్టు నెగిటివ్ వచ్చిన వారికి కూడా పాజిటివ్ అని చెప్పి, అడ్మిట్ చేసుకుని లక్షలు ఖర్చు పెట్టించడం వైద్యులు తమ వాట్సాప్ గ్రూపులో షేర్ చేసుకుని, వైద్య రంగానికి రమేష్ హాస్పిటల్ మచ్చ తెస్తోందన్న విషయం రాధాకృష్ణ దృష్టికి రాలేదో, వచ్చినా అలాంటివి అతను పట్టించుకోడో తెలియదు.

పాజిటివ్ వచ్చిన రోగుల సీటి స్కాన్లు తమ కంప్యూటర్లలో సేవ్ చేసుకుని, నెగిటివ్ వచ్చిన పేషంట్ల పేర్లు ఆ స్కాన్ల మీద వేసి, ఊపిరితిత్తులు కూడా దెబ్బ తిన్నాయి అని భయపెట్టి అడ్మిట్ చేసుకుని ఏ జబ్బు లేనివారి దగ్గర నుంచి లక్షలు గుంజిన విషయం కూడా రాధాకృష్ణకు తెలియదనుకోవాలి.

అమరావతిలో హైదరాబాద్ ఆసుపత్రులు

రాధాకృష్ణకు బాగా ఇష్టమైన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు మానసపుత్రిక అయిన అమరావతికి ఎలివేషన్ ఇవ్వడానికి ఈ సంఘటన కూడా పనికొచ్చింది రాధాకృష్ణకి. మూడు రాజధానులు అనకుండా అమరావతి ఒక్కటే రాజధాని అని జగన్ చెప్పి ఉంటే హైదరాబాదులో ఉన్న కార్పొరేట్ ఆసుపత్రలన్నీ అక్కడికి తరలివచ్చి ఉండేవి కదా అన్న రాధాకృష్ణ, అయిదేళ్ళు అమరావతి జపం చేసి, ప్రపంచ స్థాయి రాజధాని కడుతున్నామహో అని టాంటాం చేసిన చంద్రబాబు అయిదేళ్ళ పాలనలో హైదరాబాద్ నుంచి ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ అమరావతికి వచ్చాయో చెప్పగలడా?

రమేష్ కుమార్ కేమీ సంబంధం లేదా?

లీజుకు తీసుకున్న హోటల్లో అగ్నిప్రమాదం జరిగితే రమేష్ కుమార్ ని అరెస్టు చేయాలనుకోవడం ఏమిటో తెలియదు అని అమాయకత్వం ఒలకబోసిన రాధాకృష్ణకు వైకేరియస్ లయబిలిటీ అన్న కాన్సెప్ట్ తెలియదా లేక కన్వీనియెంటుగా మరిచిపోయారా?

హాస్పిటల్ లో ఉన్న పేషంటుకి నర్సు పొరపాటున ఒక ఇంజక్షన్ బదులు మరో ఇంజక్షన్ ఇచ్చి పేషంటు చనిపోతే తప్పు మొత్తం నర్సు మీద వేసి వదిలించుకోవడానికి వీలు కాదు. హాస్పిటల్ నడిపే వైద్యుడి మీద కూడా ఆ బాధ్యత ఉంటుంది. నర్సుతో పాటు ఆ వైద్యుడు కూడా శిక్షార్హుడే అని చట్టం చెప్తుంది. అలాగే ఆపరేషన్ చేసే సమయంలో పక్కన అసిస్టెన్స్ చేస్తున్న నర్సో, అసిస్టెంట్ సర్జనో చేసిన పొరపాటు వల్ల పేషంటుకి హాని జరిగితే బాధ్యత మొత్తం ఆపరేషన్ చేసిన వైద్యుడే వహించాలి. దీనినే vicarious liability అని చట్టం పరిభాషలో పిలుస్తారు.

ఇప్పుడు ప్రమాదం జరిగింది స్వర్ణా ప్యాలస్ లో కాబట్టి ఆ హోటల్ యజమాని మీదనో, షార్ట్ సర్క్యూట్ జరగడానికి కారణమైన కరెంటు వైర్లు తయారు చేసిన కంపెనీ మీదనో, వైరింగ్ చేసిన ఎలక్ట్రీషియన్ మీదనో, నిప్పు రవ్వలు పడి మండిన శానిటైజర్ తయారు చేసిన కంపెనీ మీదనో కేసు మొత్తం తోసేసి రమేష్ కుమార్ తప్పించుకోవడానికి ఇక్కడ వీలు లేకుండా పోయింది.

చట్టందేముంది, మనం ఏం చెప్తే అదే చట్టం అనుకోవడానికి ప్రభుత్వం తన చేతిలో లేదని రాధాకృష్ణ గమనించాలి. కోర్టులో చూసుకుందాం అనుకుంటే అది వేరే సంగతి. అంతకన్నా ముందు రమేష్ కుమార్ అరెస్టు జరగడమో, లేదంటే ముందస్తు బెయిల్ తెచ్చుకోవడమో ఏదో చేయాలి కానీ, తూఛ్, మావాడి మీద కేసే లేదు పోండి అంటే చెల్లదు!!