iDreamPost
android-app
ios-app

Radha krishna – సీఐడీ అధికారులు రాధాకృష్ణను బతిమిలాడారంట

  • Published Dec 11, 2021 | 2:57 AM Updated Updated Mar 11, 2022 | 10:32 PM
Radha krishna – సీఐడీ అధికారులు రాధాకృష్ణను బతిమిలాడారంట

అవినీతి కేసులు నమోదయినప్పుడు ఆయా అధికారులపై విచారణ జరుగుతుంది. ఉన్నతాధికారులయినా సామాన్య ఉద్యోగులకయినా చట్టప్రకారం వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే చంద్రబాబు హయాంలో చక్రం తిప్పిన కొందరు కేసులు నమోదయిన సందర్భాల్లో వ్యవహరిస్తున్న తీరు విడ్డూరంగా ఉంటుంది. గతంలో ఏసీబీ కేసుల్లో ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు రమేష్ హాస్పిటల్ లో నడిపిన ప్రహసనం అందరికీ తెలిసిందే. తాజాగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ వంతు వచ్చింది.

శుక్రవారం సీఐడీ అధికారులు హైదరాబాద్ లోని లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లడం, అక్కడ ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ ప్రత్యక్షంగా నడిపిన వ్యవహారం కెమెరాల సాక్షిగా అందరూ గుర్తించారు. ఇన్నాళ్లు చంద్రబాబు అండ్ కో మీద ఈగ వాలకుండా అన్నింటినీ వక్రీకరించి పాఠకులను పక్కదారి పట్టించిన పచ్చమీడియా యాజమాన్యం ఇప్పుడు ప్రత్యక్షంగా ఎంట్రీ ఇచ్చినట్టు కనిపించింది. నేరుగా అవినీతి కేసుల విచారణ ప్రక్రియను అడ్డుకునే యత్నం చేయడం విడ్డూరంగా మారింది. అందరికీ నీతులు చెప్పే రాధాకృష్ణ కేసు విచారణను పక్కదారి పట్టించేందుకు పూనుకోవడం అతడి అసలు రూపాన్ని చాటిచెప్పింది.

కట్ చేస్తే ఏబీఎన్ రాధాకృష్ణ నేరుగా సీఐడీ అధికారుల విచారణ సందర్భంగా లక్ష్మీనారాయణ ఇంటి దగ్గర నడిపిన వ్యవహారాన్నిసర్దిచెప్పుకున్న తీరు మరింత విస్మయకరంగా కనిపిస్తోంది. ఏబీఎన్, ఆంద్రజ్యోతి లో వచ్చిన కథనాల ప్రకారం లక్ష్మీ నారాయణ ఇంటికి వెళ్లేసరికి సరిగ్గా సీఐడీ అధికారులు అక్కడ ఉన్నారట. ఇంతకీ సీఐడీ అక్కడ విచారణకు వచ్చింది కాబట్టి తాను వెళ్లానని చెప్పుకోవడానికి బదులుగా సరిగ్గా ఆయన వెళ్లేసరికి సీఐడీ అక్కడ ఉందంటూ నిస్సిగ్గుగా చెప్పుకున్నారు. బహుశా రాధాకృష్ణ వస్తున్నారు కాబట్టి సీఐడీ అక్కడ ఉందనే రీతిలో అడ్డగోలుగా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది.

అంతటితో సరిపెట్టకుండా సీఐడీ అధికారులే రాధాకృష్ణను అక్కడ ఉండమని చెప్పిందట. విచారణ సజావుగా సాగేందుకు ఆయన్ని ఉండాలని పదే పదే కోరారట. ఆయన ఉంటే విచారణ స్మూత్ గా సాగుతుందని రిక్వెస్ట్ చేశారట. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అనుకుంటే తప్ప ఇంగితం ఉన్నవారెవరైనా ఇలా చెప్పుకోవడం విన్నామా.. సీఐడీ విచారణ సాగుతుంటే సంబంధం లేని రాధాకృష్ణను ఉండాలని విచారణాధికారులు కోరడం ఏమిటో ఎవరికీ అంతుబట్టదు. అయినా రాధాకృష్ణ రాతల తీరుకి హద్దూ అదుపూ ఉండదని మరోసారి తేటతెల్లమయ్యింది.

అంతటితో అయిపోలేదు.. సీఐడీ అధికారులు అవినీతి ఆరోపణలతో లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకుంటున్నట్టు చెప్పగానే ఆయన కుప్పకూలిపోయారట. ఆ వెంటనే ఆయన్ని ఆస్పత్రిలో చేర్చమని చెప్పేసి రాధాకృష్ణ వచ్చేశారట. ఇలా సమర్థించుకోవడం కేవలం ఏబీఎన్ రాధాకృష్ణకు మాత్రమే సాధ్యమేమో అన్న చందంగా ఉందంటే చిత్రమేమీ కాదు. అయినా విచారణ సాగుతుండగా అక్కడికి వెళ్లడం, విజువల్స్ సాక్షిగా బుక్ అయిన పచ్చమీడియా యజమాని దానిని కప్పిపుచ్చడానికి అల్లుతున్న కథలు భలే ఆసక్తిగా ఉన్నాయంటే విశేషం లేదేమో. 

Also Read : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం.. సీఐడీ నోటీసులు.. ఆస్పత్రిలో చేరిన లక్ష్మీనారాయణ