iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్మోహనరెడ్డి, కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నారని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కనిపెట్టేశారు. అదేమి చిత్రమో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తుల మెదడు ఏమి ఆలోచిస్తుంది అన్నది వారి కంటే ముందు రాధాకృష్ణకే తెలిసిపోతుంది. ఆ ప్రకారం కనిపెట్టిన విషయాన్నే ఈ వారం కొత్త పలుకుగా మనకు అందించారు. దీన్ని మనకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి చాలా శ్రమించారు. అందుకోసం కొన్ని ఉదాహరణలు, ఉపమానాలు కూడా తనదైన శైలిలో ఉటంకించారు.
కారణం ఇదేనట..
ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఆయన విశ్లేషణ ఇలా సాగింది. రాష్ట్రంలోని ప్రజలకు ముఖ్యంగా మధ్య తరగతి వారికి జగన్మోహనరెడ్డి పరిపాలనపై తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. ఇది రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ అసంతృప్తి అన్ని వర్గాలకు విస్తరించక ముందే ఎన్నికలకు వెళ్లితే గెలవడం సులభం అని లేదంటే ఓడిపోతామని ముఖ్యమంత్రి అనుకుంటున్నారట. ప్రశాంతకిషోర్ వచ్చి రాష్ట్రంలో సర్వే చేసి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న అంశాన్ని నిర్దారిస్తే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయమని అని సూత్రీ కరించారు. దీనికితోడు తనపై ఉన్న ఈడీ కేసుల్లొ వచ్చే ఏడాది తీర్పు వస్తుంది కనుక ముందస్తు ఎన్నికలకు వెళ్లడం మేలని జగన్మోహనరెడ్డి భావిస్తున్నారట.
Also Read : బాలాపూర్ లడ్డు.. జగన్‌కు గిఫ్ట్‌ఇచ్చిన ఎమ్మెల్సీ
అన్నీ అభాండాలే..
తాను ముఖ్యమంత్రిగా ఉన్నాను కనుక అంతా నా ఇష్టం అన్నట్టు జగన్ వ్యవహరిస్తున్నారని, గతంలో రాజశేఖరరెడ్డి ఇలా వ్యవహ రించడం వల్లే ఆయన కుమారుడు ఇప్పుడు కేసుల్లో ఇరుక్కున్నారని విశ్లేషించారు. విశాఖపట్నంలో భారీగా ఆస్తులు చేతులు మారాయని, చీకటి దందాలు పెరిగిపోయాయని ఆవేదన చెందారు. ఇలా కూడబెట్టుకుంటున్న ఆస్తులను ఏమి చేసుకుంటారని ఆశ్చర్య పోయారు. ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడి ఇంటిపై దండయాత్ర చేయడం దారుణమని, భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రభుత్వం మారితే ఆయనపైనా కేసులు పెడతారన్న సంగతి గుర్తించాలని హెచ్చరించారు. ఇలా రకరకాల అంశాలను ఉటంకిస్తూ 2024లో జరగాల్సిన ఎన్నికల వరకు ఆగకుండా జగన్మోహనరెడ్డి ముందస్తుకు వెళతారని నిర్థారించేశారు.
ఆయన రాశారు కనుక మనం నమ్మాలంతే!
ఈడీ కేసుల్లో వచ్చే ఏడాది తీర్పు వస్తుంది కనుక ముందస్తుకు వెళ్లాలనుకోవడం ఏమిటి అనే ప్రశ్న మనకు రాకూడదు. విశాఖలో భారీగా ఆస్తులు చేతులు మారడం ఏమిటి? ఎవరి చేతుల నుంచి ఎవరి చేతుల్లోకి మారాయి? ఎంత మొత్తంలో మారాయి? వంటి సందేహాలు పాఠకులకు అస్సలు కలుగకూడదు. రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖలో చీకటి దందాలు పెరిగిపోయాయంటే మనం నమ్మితీరాలి. ఆదంతా చేయి స్తున్నది జగన్ అని మనం అనుకోవాలి. ఎందుకంటే అక్కడ రాసింది రాధాకృష్ణ. ఆయన రాతే ఓ శాసనం. ఆయన పదేపదే అదే విషయాలను పనిగట్టుకొని మరీ రాస్తున్నారు కాబట్టి అందులో నిజం ఉండి తీరు తుంది.
Also Read : వైఎస్సార్ రాజనీతిజ్ఞతకు ఈ సముద్రతీరం ఓ ఉదాహరణ
న్యాయస్థానాలపైనా..
జగన్ బెయిల్ రద్దు కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్ను కోర్టు కొట్టి వెసినం దుకు సంతోష పడి ఉంటారని, రేపు ఈడీ కేసుల్లో జగన్ కు శిక్ష పడినప్పుడు కూడా ఇలాగే స్వాగతించాలని ఒక సలహా విసిరారు. అంటే ఈడీ కేసుల్లో జగన్మోహనరెడ్డికి శిక్ష పడుతుంది అని మనం ఫిక్స్ అయిపోవాలన్న మాట. పైగా ప్రజా ప్రయోజనాలు ముడిపడి ఉన్న అంశాలలో న్యాయస్థానాలు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తా యని పేర్కొన్నారు. అంటే మిగిలిన అంశాలలో న్యాయస్థానాలు పక్షపాతంగా వ్యవహరిస్తాయని మనం అనుకోవాలన్న మాట.
పెరుగుతున్న పరిణితి.
రాధాకృష్ణ కొత్త పలుకు రచనలో వారం వారం ఆయన పరిణితి పెరుగుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు. గతంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ముఖాముఖీ భేటీలో ఏమి మాట్లాడుకున్నారో పూసగుచ్చినట్టు రాసేవారు. ఇప్పడు ఏకంగా ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏమి ఆలోచన చేస్తున్నారో కూడా మనకు తెలియజేస్తున్నారు. పైగా భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ముందే చెప్పేస్తూ మనలను అప్రమత్తం చేస్తున్నారు. అప్పటిలో బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఇలా చెప్పేవారని మనకు తెలిసిందే. ఇప్పుడు రాధాకృష్ణ ఇలా కొత్తపలుకులో మనకు భవిష్యత్తు దర్శనం చేయిస్తున్నారు. ఇది తెలుగు పాఠకుల భాగ్యం కాక మరేమిటీ?
Also Read : టీడీపీ బూతు పంచాంగం – రాజకీయ ప్రణాళికలో భాగమేనా?