గ్రేటర్ వార్ లో రాజుకున్న నిప్పు ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేదు. బల్దియా బరిలో ఢీ అంటే ఢీ అని తలపడిన అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మాటలకే పరిమితం కాలేదు. పరస్పర దాడులకూ దిగాయి. నెక్లెస్ రోడ్డులో బీజేపీ చీఫ్ బండి సంజయ్ కాన్వాయ్ పై గులాబి దళం దాడి చేస్తే, కూకట్ పల్లిలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాహనంపై బీజేపీ కార్యకర్తలు ప్రతి దాడికి దిగారు. పోలింగ్ సమయంలో ఉద్రిక్తతలకు కారణమైన ఈ ఘటన ఇప్పుడు కొత్త వివాదానికి కారణమైంది.
మంత్రి పువ్వాడ, కారులో డబ్బులు పంపిణీ చేస్తుండగా అడ్డుకున్నామని బీజేపీ వాదిస్తుండగా, ఓటమి భయంతోనే బీజేపీ నేతలు తనను చంపడానికి ప్రయత్నించారని పువ్వాడ ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీల మాటల యుద్ధంలోకి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఎంటరై కొత్త వివాదానికి తెరతీశారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో స్థానికేతరులెవరూ నగరంలో ఉండొద్దని అధికారులు ఆదేశాలు జారీచేసినా మంత్రి పువ్వాడ అజయ్ హైదరాబాద్ లో ఎందుకున్నారంటూ ప్రశ్నించారు. నిబంధనలు ఉల్లంఘించిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని, ఆయనను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యం ఉన్న పువ్వాడ అజయ్ పై నారాయణ విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. నారాయణ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పువ్వాడ అదే స్థాయిలో రిప్లై ఇచ్చారు. బీజేపీ తనపై చేసిన దాడిని చికెన్ నారాయణ సమర్ధిస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తానూ కమ్యూనిస్టు బిడ్డనేనని, ఇటువంటి దాడులకు భయపడనని వ్యాఖ్యానించారు. అజయ్ వ్యాఖ్యలకు స్పందించిన నారాయణ మగ్దుం భవన్ దయాదాక్షిణ్యాల వల్లే నువ్వు ఆ స్థానం లో ఉన్నావని అన్నారు. బీజేపీ నేతలు కారుకు అడ్డుపడ్డప్పుడు మంత్రి వాహనం ఆపకుండా వెళ్లాడని, వాహనం కింద పడి కార్యకర్త చనిపోయి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
సీపీఐ నారాయణ వ్యాఖ్యలకు ఘాటగా స్పందించారు మంత్రి పువ్వాడ. ‘‘నారాయణ జాతకం నాకు తెలుసు. నేను నోరువిప్పితే ఆయన బజారున పడతారు. నారాయణ మా నాన్న నుంచి సాయం పొంది మా నాన్నను మోసం చేశారు’’ అని వ్యాఖ్యానించారు. మంత్రి పువ్వాడ, నారాయణల మధ్య సాగుతున్న ఈ మాటల యుద్ధానికి గ్రేటర్ ఎన్నికలే నేపథ్యమైనా ఈ పంచాయితీ మాత్రం ఇవ్వాల్టిది కాదంటున్నారు విశ్లేషకులు.
పువ్వాడ అజయ్ తండ్రి నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో సీనియర్ కమ్యూనిస్టు నేత. సీపీఐలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న నాగేశ్వరరావుకు జిల్లాలో మంచి పట్టుంది. గతంలో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి సీపీఐ తరుపున ప్రాతినిథ్యం వహించారాయన. 2014లో ఖమ్మం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున ఎన్నికల బరిలోకి పువ్వాడ అజయ్ తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీపీఐకి మిత్రబంధం ఉండడంతో తండ్రికి ఉన్నా మంచిపేరుతో అజయ్ సునాయాసంగా విజయ తీరాన్ని చేరుకోగలిగారు. కానీ… 2018లో పువ్వాడ అజయ్ టీఆర్ఎస్ తరుపున బరిలోకి దిగడంతో ప్రజా కూటమిలో ఉన్న సీపీఐ ఆయనకు సహకరించలేదు. ఆ విషయంలో సీపీఐ నాయకత్వం పట్ల, ప్రధానంగా సీపీఐ కార్యదర్శి హోదాలో ఉన్న నారాయణ పట్ల అజయ్ కి ఆగ్రహం ఉందనేది కొందరి వాదన. మొత్తానికి… బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మొదలైన యుద్ధం ఇప్పుడు సీపీఐ, టీఆర్ఎస్ వార్ గా మారింది.