iDreamPost
iDreamPost
అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న క్రేజీ పాన్ ఇండియా సినిమా పుష్పలో విలన్ గా నిన్న మలయాళీ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ ని ప్రకటించడం ఒకరకంగా చెప్పాలంటే అందరినీ షాక్ కి గురి చేసింది. విజయ్ సేతుపతి కాల్ షీట్స్ సమస్య వల్ల పుష్పను వదులుకున్నాక దీన్ని అంతే స్థాయిలో మెప్పించగలిగే నటుడు ఎవరు దొరుకుతారా అనే చర్చ టాలీవుడ్ లో గట్టిగానే జరిగింది. ఒకదశలో బాబీ సింహ, సునీల్ అని ఏవేవో పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. సునీల్ శెట్టి కూడా అన్నారు. కానీ అవేవి నిజం కాదని తేలిపోయింది. ఊహించని పేరు తెరమీదకు రావడంతో పుష్ప రేంజ్ అమాంతం పెరిగిపోయింది.
ఇక్కడ సుకుమార్ అనూహ్యమైన తెలివితేటలు కనిపిస్తున్నాయి. కేరళలో బన్నీకి ఎంత ఫాలోయింగ్ ఉందో చూస్తున్నాం కదా. దాన్ని ఇంకా బలోపేతం చేసేలా అల్లు కాంపౌండ్ ప్రణాళికలు వేసుకుంటోంది. ఇప్పుడు మైత్రి కూడా తోడయ్యింది. అందులో భాగంగానే మలయాళంలో చాలా ఫేమ్ ఉన్న ఫహద్ ని లైన్ లోకి తీసుకున్నారు. దీని వల్ల ఆ రాష్ట్రంలో పుష్ప బిజినెస్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఫహద్ కు విడిగా ఉన్న అభిమానులు సైతం పుష్ప మీద ఆసక్తి చూపిస్తారు. ఒకవేళ సినిమా హిట్ అయితే వసూళ్ల సునామి ఖాయం. పైకి కనిపించదు కానీ అక్కడ బ్లాక్ బస్టర్ల రేంజ్ 50 నుంచి 100 కోట్ల మధ్యలో ఉంది.
ఎలాగూ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి ఇలా క్యాస్టింగ్ రిచ్ గా సెట్ చేసుకుంటే బిజినెస్ కూడా అంతే క్రేజీగా జరుగుతుంది. ఆగస్ట్ 13 రిలీజ్ డేట్ ముందే చెప్పేశారు కనక దాన్ని మీట్ అయ్యేందుకు సుకుమార్ టీమ్ ఇప్పటికే వేగం పెంచింది. ఇంకా చాలా భాగం పెండింగ్ ఉంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. బన్నీతో పాటు హీరోయిన్ రష్మిక మందన్న ప్రత్యేకంగా చిత్తూరు స్లాంగ్ నేర్చుకోవడం విశేషం. అడవిలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న పుష్పలో ఫహద్ పాత్ర ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అప్పుడే అభిమానుల్లో మొదలైపోయింది.