iDreamPost
iDreamPost
ముఖ్యమంత్రి ఎవరైనా సెగ పెట్టడమే ధ్యేయమన్నట్లు వ్యవహరిస్తున్న పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సిద్ధూ తాజాగా చేసిన ఆరోపణలతో ఉన్నతాధికారులకు కూడా టార్గెట్ గా మారారు. ఎన్నడూ.. ఎక్కడా లేనివిధంగా ఆ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ ఏపీఎస్ డియోల్ పీసీసీ నేత సిద్ధూపై తీవ్రంగా ధ్వజమెత్తారు. సిద్ధూ తనపై చేసిన ఆరోపణలకు ఘాటుగా బదులిచ్చారు. ప్రభుత్వ, ఏజీ కార్యాలయ విధుల్లోకి ఆయన చొరబడుతున్నారని ఆరోపించారు. దీంతో పంజాబు కాంగ్రెసు వివాదాలు ప్రభుత్వ యంత్రాంగానికి కూడా పాకినట్లు అయ్యింది. సిద్ధూ, ఏజీ పరస్పర విమర్శలపై సీఎం చరణ్ జిత్ చన్నీ మౌనంగా ఉన్నప్పటికీ ఏజీ వెనుక ఆయన ఉన్నారని అర్థమవుతోంది.
సిద్ధూ షరతులు.. ఆరోపణలు
అంతకు ముందు నవజ్యోత్ సిద్ధూ పీసీసీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటిస్తూనే ఒక మెలిక పెట్టారు. తాను కోరినట్లు రాష్ట్ర ఏజీ డియోల్, డీజీపీ ఇక్బాల్ ప్రీత్ సింగ్ సహోతాలను ఆ పదవుల నుంచి తప్పించే వరకు రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో అడుగు పెట్టబోనని స్పష్టం చేశారు. 2015 లో బుర్జ్ జవహర్ సింగ్ వాలా గురుద్వారా ప్రాంగణంలో సిక్కుల ఊచకోత.. దానిపై నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై పోలీసు కాల్పుల ఘటనలో నిందితులను ప్రస్తుత డీజీపీ సహోతా కాపాడుకొచ్చారని ఆరోపించారు. అలాగే ఆనాడు పోలీసు కాల్పుల ఘటనపై నమోదైన కేసులో అప్పటి డీజీపీ సుమేద్ సింగ్ సైనీకి మద్దతుగా ప్రస్తుత ఏజీ డియోల్ హైకోర్టులో వాదించారని ఆరోపించారు. ఆ కేసులో బాధితులకు న్యాయం చేయకుండా ప్రభుత్వం ప్రజల సెంటిమెంటును దెబ్బతీస్తోందని సిద్దూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అలాగే రాష్ట్రంలో ఇటీవల వెలుగు చూసిన డ్రగ్స్ కేసుకు సంబంధించి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం తొక్కిపెడుతోందని ఆరోపించారు.
ఏజీ రాజకీయ ఆరోపణలు
సిద్ధూ ఆరోపణలపై ముఖ్యమంత్రి చరణ్ జిత్ చన్నీ స్పందించలేదు. కానీ అడ్వొకేట్ జనరల్ ఏపీఎస్ డియోల్ తీవ్రంగా స్పందించారు. సిద్ధూపై ప్రత్యారోపణలు సంధించారు. ప్రభుత్వ వ్యవస్థలోకి, ఏజీ కార్యాలయ వ్యవహారాల్లో కి సిద్ధూ చొరబడుతూ.. వాటి విధులకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు. డ్రగ్స్, సిక్కుల ఊచకోత కేసులను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. పార్టీలో పైచేయి సాధించేందుకు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని విమర్శించారు.
రాజీనామా వదంతులు
కాగా ఏజీ, డీజీపీలను తప్పించాలని వారిని నియమించినప్పటి నుంచీ సిద్ధూ డిమాండ్ చేస్తున్నారు. దాని కోసమే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నెల ఒకటో తేదీన ఏజీ డియోల్ తన పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. వాటిని ఆయన ఖండించినా.. ఆ మరుసటి రోజే సీఎంకు పంపిన రాజీనామా వెలుగులోకి వచ్చింది. అయితే రాజీనామాను సీఎం చన్నీ ఇప్పటివరకు ఆమోదించక పోవడంతో పదవిలో కొనసాగుతున్నారు. గతంలో అమరీందర్ సింగును ఇబ్బంది పెట్టి సాగనంపిన సిద్ధూ.. ఆయన స్థానంలో వచ్చిన చన్నీని కూడా నిద్రపోనివ్వడం లేదు. దాంతో సీఎం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అందుకే సిద్ధూ చేసిన తాజా ఆరోపణలపై తాను స్పందించకుండా నేరుగా ఏజీతోనే ప్రత్యారోపణలు చేయించారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.