అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదు నెలలు ఉన్న పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వర్గపోరుతో కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవి కోల్పోవడం, కొత్త సీఎంగా చన్నీ బాధ్యతలు చేపట్టడం చకచకగా జరిగిపోయాయి. అమరీందర్‌తో వర్గపోరును నడిపిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇటీవల చేపట్టిన పీసీసీ పదవికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వచ్చే ఎన్నికల్లో సిద్ధూ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో.. సిద్దూ తాజా నిర్ణయం ఆ పార్టీని కలవరపాటుకు గురిచేస్తోంది.
సిద్ధూ వ్యవహారం ఒకలా ఉంటే.. మరో వైపు మాజీ సీఎం అమరీందర్ సింగ్ వ్యవహారం కాంగ్రెస్ పరిస్థితిని పెనం మీద నుంచి పొయ్యిలో పడేసే మాదిరిగా తయారైంది. ముఖ్యమంత్రి పదవి కోల్పోయినప్పటి నుంచీ పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న అమరీందర్ సింగ్.. రెండు రోజుల నుంచి జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేసేలా బీజేపీ ముఖ్యనేత, హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ పరిణామంతో కాంగ్రెస్ పార్టీకి అమరీందర్ సింగ్ గుడ్‌బై చెప్పి.. కమలం పార్టీలో చేరతారనే ఊహాగానాలకు బలం చేకూరింది. బీజేపీ అమరీందర్ సింగ్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటుందనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. పార్టీ మార్పు, తనకు గల ప్రాధాన్యతపైనే అమరిందర్ సింగ్ హోం మంత్రి అమిత్ షాతో చర్చిస్తున్నారని సమాచారం.
రెండేళ్ల నుంచి అమరీందర్ సింగ్, సిద్ధూల మధ్య ఉన్న వర్గపోరు.. ఇటీవల సిద్దూ పీసీసీ పగ్గాలు చేపట్టడంతో తారాస్థాయికి చేరుకుంది. అమరిందర్ సింగ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలంటూ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం కావడంతో అమరీందర్ సింగ్ తీవ్ర అవమానంగా భావించారు. ఇదే విషయాన్ని చెబుతూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సిద్ధూ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సిద్ధూ సీఎం అవడం దేశానికి, పంజాబ్‌కు ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధూను ముఖ్యమంత్రిని కాబోనివ్వనని శపథం చేశారు. ఈ పరిణామాలకు కొనసాగింపుగానే తాజాగా అమరీందర్ సింగ్.. హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
Also Read : పీసీసీ చీఫ్ సిద్ధూ రాజీనామా – బీజేపీ పెద్దలతో భేటీకి మాజీ సీఎం అమరీందర్