iDreamPost
android-app
ios-app

పంజాబ్ కాంగ్రెసులో మళ్లీ కాక

  • Published Aug 25, 2021 | 11:35 AM Updated Updated Aug 25, 2021 | 11:35 AM
పంజాబ్ కాంగ్రెసులో మళ్లీ కాక

రాజీ ఫార్ములా కుదిర్చి, రెండు వర్గాల మధ్య సర్దుబాటు చేసి నెలైనా గడవలేదు. హమ్మయ్యా అని కాంగ్రెస్ అధిష్టానం ఊపిరి పీల్చుకున్నంతలోనే మళ్లీ సెగ రాజుకుంది. పంజాబ్ కాంగ్రెస్లో మళ్లీ అసమ్మతి జ్వాల రేగింది. అధిష్టానాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా నలుగురు మంత్రులతో సహా 34 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమై ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగుపై అసమ్మతి ప్రకటించారు. సీఎం మార్పు కోరుతూ ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని కలవాలని నిర్ణయించారు. దీని వెనుక పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సిద్దూ హస్తం ఉందని సీఎం వర్గీయులు ఆరోపిస్తున్నారు. అసమ్మతివాదుల తీరుపై వారు మండి పడుతున్నారు.

నెల క్రితమే రాజీ.. అంతలోనే పేచీ

కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో పంజాబ్ ఒకటి. 2017 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెసును.. కొన్ని నెలల్లోనే మళ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సిన తరుణంలో అంతర్గత కుమ్ములాటలు సంకట స్థితిలోకి నెట్టేస్తున్నాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం అమరీందర్, అప్పట్లో మంత్రిగా ఉన్న నవజ్యోత్ సిద్ధుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. సిద్ధూ నుంచి కొన్ని శాఖలు తప్పించడంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి అసమ్మతిని ఎగదోయడం ప్రారంభించారు. దానికి 2015 నాటి గురు గ్రంథ సాహిబ్ కేసును సాకుగా వాడుకున్నారు. ఆయనకు మరికొందరు ఎమ్మెల్యేలు తోడయ్యారు. ఇరువర్గాలు ఆరోపణలు ప్రత్యారోపణలతో రచ్చకెక్కడంతో కాంగ్రెస్ పరువు పోయింది. ఆలస్యంగా కళ్లు తెరిచి పార్టీ హైకమాండ్ రెండు నెలల పాటు అటు చండీగఢ్ లోనూ, ఇటు ఢిల్లీలోనూ ఇరువర్గాలతో సుదీర్ఘ మంతనాలు జరిపి ఎట్టకేలకు రాజీ కుదిర్చింది. ఆ రాజీ ఫార్ములా ప్రకారం గత నెలలో అసమ్మతి నేత నవజ్యోత్ సిద్ధూను పీసీసీ అధ్యక్షుడిగా నియమించారు. అక్కడితో సమస్య పరిష్కారం అయ్యిందని అనుకున్నారు. కానీ అది పరిష్కారం కాలేదని, ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉందని తాజా పరిణామాలతో స్పష్టమైంది.

ముఖ్యమంత్రిని మార్చాల్సిందే

అసంతృప్త ఎమ్మెల్యేలు మళ్లీ సీఎం అమరీందర్ పై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆయనపై తమకు విశ్వాసం లేదని.. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అసలు పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. సీఎంకు వ్యతిరేకంగా నలుగురు మంత్రులతో సహా 34 మంది ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించి అసమ్మతి స్వరం వినిపించారు. రాష్ట్ర మంత్రి రాజిందర్ బజ్వా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం అమరీందర్ పై పలు ఆరోపణలు చేశారు. గురి గ్రంథ సాహిబ్ ను అపవిత్రం చేసిన వారిపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని, డ్రగ్స్ రాకెట్లో పెద్ద చేపలను విడిచి పెట్టారని, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నీ పార్టీ అధిష్టానానికి వివరించాలని నిర్ణయించారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి చరణ్ జిత్ సింగ్ చిన్నీ మాట్లాడుతూ తమకు కెప్టెన్ పై నమ్మకం పోయిందని వ్యాఖ్యానించారు. పార్టీ క్యాడర్ లోనూ తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. సమావేశానికి నేతృత్వం వహించిన మంత్రి రాజిందర్ బజ్వా మాట్లాడుతూ ఈ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళితే పార్టీకి మనుగడ ఉండదన్నారు. అందువల్ల హైకమాండ్ కఠిన చర్యలు తీసుకోవాలని, ముఖ్యమంత్రిని మార్చాలని కోరారు. ఈ విషయాలన్నింటినే హైకమాండుకు వివరించేందుకు ఐదుగురు సభ్యులతో ఓ బృందాన్ని అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు. తృప్త్ బజ్వా, ఎస్.ఎస్. రణదవే, సుఖ్బిందర్ సింగ్ సర్కారియా, చరణ్ జిత్ సింగ్ చున్నీ, పర్గత్ సింగ్ ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ పాల్గొనకపోయినా.. ఆయన మద్దతు ఉందని సీఎం అనుకూల వర్గీయులు ఆరోపిస్తున్నారు

Also Read : నిన్న పంజాబ్‌.. నేడు ఛత్తీష్‌గఢ్‌.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పులు