iDreamPost
iDreamPost
‘పార్టీలో చాలా కాలంగా వేధింపులకు గురయ్యాను. ఇప్పటి వరకు జరిగింది చాలు.. అంతర్గత కుమ్ములాటలతో అలసిపోయాను.. అందుకే పదవికి రాజీనామా చేశాను’.. అని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో చాలా కాలంగా కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాటలకు ముగింపు పలుకుతూ ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితం తన కుమారుడు రణీందర్ సింగ్‌తో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్‌కు రాజీనామా సమర్పించారు. దీంతో పంజాబ్ కాంగ్రెస్ రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. సీఎల్ఫీ అత్యవసర సమావేశానికి అరగంట ముందే కెప్టెన్ రాజీనామా చేయడంతో కొత్త సీఎం ఎవరు అవుతారన్న చర్చ మొదలైంది.
రోజంతా హైడ్రామా
శుక్రవారం రాత్రి నుంచి రాష్ట్ర కాంగ్రెస్‌లో పరిణామాలు శరవేగంగా మారుతూ వచ్చాయి. సుమారు 40 మంది ఎమ్మెల్యేలు ఏఐసీసీకి రాసిన లేఖలో సీఎం అమరీందర్‌పై తమకు నమ్మకం లేదని ప్రకటించారు. 2017 ఎన్నికల్లో పార్టీ ప్రకటించిన 18 అంశాల ప్రణాళిక అమలులో అమరీందర్ విఫలమయ్యారని, వచ్చే ఎన్నికలను ఆయన నేతృత్వంలో ఎదుర్కోవడం కష్టమని.. ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దాంతో పార్టీ పంజాబ్ వ్యవహారాల ఇంఛార్జి హరీష్ రావత్ శనివారం సాయంత్రం సీఎల్ఫీ అత్యవసర సమావేశానికి ఏర్పాట్లు చేయాలని పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సిద్ధూకు సూచించారు.
దీంతో శనివారం ఉదయం నుంచి కాంగ్రెస్‌లో హై డ్రామా నెలకొంది. ఒకవైపు సీఎల్ఫీ సమావేశానికి ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు సీఎం అమరీందర్ తన ముఖ్య అనుచరులైన 12 మంది ఎమ్మెల్యేలతో తన నివాసం రహస్య మంతనాలు జరిపారు. ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తారని అప్పటినుంచే ప్రచారం మొదలైంది. వేధింపులు ఇక భరించలేనని అమరీందర్ పార్టీలో తన స్నేహితులైన కమల్ నాథ్, మనీష్ తివారీలతో అనడం ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. చివరికి ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ సీఎల్ఫీ సమావేశానికి ముందే కెప్టెన్ రాజీనామా చేశారు.
Also Read : కెప్టెన్ అమరీందర్ సింగ్ పదవికి ఎసరు?
ఏడాదికిపైగా విభేదాలు
పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే నవజ్యోత్ సిద్ధూ, అమరీందర్ మధ్య విభేదాలు రాజుకున్నాయి. తన శాఖల్లో సీఎం కోత పెట్టినందుకు నిరసనగా సిద్ధూ మంత్రి పదవికి రాజీనామా చేసి అసమ్మతివాదిగా మారారు. అమరీందర్ కు వ్యతిరేకంగా అసమ్మతివర్గాన్ని కూడగట్టారు. దాంతో అధిష్టానం రంగంలోకి దిగి సిద్ధూ, అమరీందర్ తోపాటు ఎమ్మెల్యేలు, మంత్రులతో సుమారు రెండు నెలలు చర్చోపచర్చలు జరిపి రాజీ సూత్రం రూపొందించింది. దాని ప్రకారం గత నెలలో సిద్ధూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించారు. ఆ ముచ్చట కొద్దిరోజులకే తీరిపోయింది. గత నెల చివరిలో నలుగురు మంత్రుల ఆధ్వర్యంలో 25 మంది ఎమ్మెల్యేలు సమావేశమై సీఎం అమీరందర్ పై తమకు విశ్వాసం లేదని బహిరంగంగా ప్రకటించారు. నలుగురు సభ్యుల బృందం ఢిల్లీ వెళ్లి సోనియాకు కూడా ఫిర్యాదు చేసింది. అయితే దీని వెనుక పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ ఉన్నారని అప్పట్లో అమరీందర్ వర్గం ఆరోపించింది.
అనుచరులతో చర్చించి భవిష్యత్తు ప్రణాళిక
రాజీనామా చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడిన అమరీందర్ పార్టీలో చాలా కాలం నించి వేధింపులు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్గత కలహాలతో విసిగిపోయాను. ఇప్పటికే చాలా జరిగాయని అన్నారు. తనపై ఫిర్యాదులు చేయడం ఇది మూడోసారి అని వ్యాఖ్యానించారు. తన రాజీనామా విషయాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి తెలియజేశానని చెప్పారు. తన అనుచరులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ చేపడతానని అన్నారు.
కెప్టెన్ కు బీజేపీ ఆఫర్!
కాగా సీఎం పదవికి రాజీనామా చేరిన అమరీందర్ కు బీజేపీ నుంచి ఆహ్వానం అందుతోంది. బీజేపీకి చెందిన మాస్టర్ మోహన్ లాల్ కాంగ్రెస్ పరిణామాలపై స్పందిస్తూ.. బీజేపీలోకి వచ్చి పార్టీకి నాయకత్వం వహించాలని కెప్టెన్ కు సూచించడం విశేషం.
కొత్త సీఎం ఎంపిక బాధ్యత అధిష్టానానికి..
సీఎల్పీ సమావేశం ప్రారంభానికి ముందే అమరిందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో మీటింగ్ సాదాసీదాగా జరిగింది. సమావేశమైన ఎమ్మెల్యేలు.. కొత్త సీఎంను ఎంపిక చేసే బాధ్యతను పార్టీ అధిష్టానానికి అప్పగిస్తూ తీర్మానం చేశారు.
Also Read : ముఖ్యమంత్రులతో జాతీయ పార్టీల బంతులాట