iDreamPost
android-app
ios-app

రంగస్వామే మా నాయకుడు ,సీఎంని మాత్రం అమిత్ షా నిర్ణయిస్తాడు అంటున్న బీజేపీ

రంగస్వామే మా నాయకుడు ,సీఎంని మాత్రం అమిత్  షా నిర్ణయిస్తాడు అంటున్న బీజేపీ

నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత రాష్ట్రమైన పుదుచ్చేరి ఎన్నికలను భారతీయ జనతా పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎన్నికలకు ముందే అక్కడి రాజకీయాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యేల రాజీనామాలతో గత ప్రభుత్వం మైనార్టీలో పడిపోవడం, గవర్నర్‌ కిరణ్‌బేడీ మారడం, కొత్త గవర్నర్‌ బల నిరూపణకు ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం, ప్రభుత్వం కూలిపోవడం వంటి ఘటనలు కలకలం రేపాయి. వీటి వెనుక బీజేపీ రాజకీయాలు ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం కూలిన వెంటనే నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ఎన్నికల సంగ్రామం మొదలైంది.

ఎన్నికల సంగ్రామంలో మొదటి నుంచీ బీజేపీ ఆధిపత్యం దిశగా ప్రయత్నం చేస్తోంది. విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చినప్పటికీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేమని చెప్పిన కేంద్రం, తాజాగా పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది. ఏదో ఒకలా అక్కడ అధికారంలోకి రావడమే పరమావధిగా ముందుకెళ్తున్న క్రమంలో ఎన్‌డీఏ కూటమిలో ముసలం పుట్టే అవకాశాలు కనిపించడం బీజేపీని గందరగోళంలో పడేస్తున్నాయి. కూటమికి నేతృత్వం వహిస్తున్న తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ నేతలు ప్రకటించకపోవడాన్ని మాజీ ముఖ్యమంత్రి, ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత ఎన్‌.రంగస్వామి తీవ్రంగా పరిగణించడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

రంగస్వామి కూటమికి నేతృత్వం వహిస్తారంటూ చెబుతున్న బీజేపీ నేతలు.. ఆయనే తమ కూటమి సీఎం అభ్యర్థి అని మాత్రం ఎక్కడా ప్రస్తావించడం లేదు. మొత్తం 30 స్థానాలున్న పుదుచ్చేరి శాసనసభకు ఎన్‌డీఏ కూటమిలోని ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ 16, బీజేపీ 9, అన్నాడీఎంకే 5 స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చాక ఎవరు ముఖ్యమంత్రి అన్నది తమ పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని బీజేపీ స్థానిక నేతలు ప్రకటించారు. అదే విధంగా రెండుమార్లు పుదుచ్చేరి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం కూటమి నేత రంగస్వామి అని ప్రకటించారే తప్ప, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన్ని పేర్కొనలేదు. దీంతో బీజేపీ వైఖరి పట్ల ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

దీనికి తోడు తమ పార్టీకి చెందిన పారిశ్రామికవేత్త భువనేశ్వరన్‌ సహా పలువురు రంగస్వామి మద్దతుదారులపై ఐటీ దాడులు జరగడాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇదంతా కేంద్రం జోక్యంతోనే జరుగుతోందని వారు అనుమానిస్తున్నారు. ఐటీ దాడులతో తమకు పరోక్ష హెచ్చరికలు పంపుతున్నారని రంగస్వామి అనుయాయులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రంగస్వామి బీజేపీ, అన్నాడీఎంకే అభ్యర్థులకు మద్దతుగా ఎలాంటి ప్రచారం చేయకపోవడం గమనార్హం. గురువారం కేంద్ర హోమంత్రి అమిత్‌షా పుదుచ్చేరిలో పర్యటించినా రంగస్వామిని మాత్రం కలుసుకోలేదు. అదేవిధంగా ఆయన బీజేపీ అభ్యర్థులు పోటీచేస్తున్న లాస్‌పేట, కాలాపట్టు నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం నిర్వహించారు. దీంతో రంగస్వామి సైతం బీజేపీ, అన్నాడీఎంకే అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఎటు దారితీస్తుందో వేచి చూడాలి.