iDreamPost
android-app
ios-app

పబ్లిక్ ఇంట్రెస్టా..? పబ్లిసిటీ స్టంటా?

  • Published Sep 29, 2020 | 6:22 AM Updated Updated Sep 29, 2020 | 6:22 AM
పబ్లిక్ ఇంట్రెస్టా..? పబ్లిసిటీ స్టంటా?

కాదేదీ పిల్ కి అనర్హం, ప్రతి పత్రికా కధనమూ పిల్ కి అర్హమే

పిల్ లన్నీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కావు, ప్రచారం కోసం వేసేవి ఎక్కువ అవుతున్నాయి : హై కోర్ట్

గండికోట నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని కోరుతూ జనసేన నేతనంటూ బొలిశెట్టి సత్యనారాయణ అనే వ్యక్తి హై కోర్ట్ లో పిల్ వేయడం జరిగింది. దీని విచారణ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కె. జగన్మోహన్ రెడ్డి నిర్వాసితులకు చట్టప్రకారం చెందాల్సిన పరిహారాన్ని 2011 లోనే ప్రభుత్వం పూర్తిగా చెల్లించిందని తర్వాతి కాలంలో పునరావాస కేంద్రాల వద్ద సిమెంట్ రోడ్ కోసం నిర్వాసితులు కోర్టులో పిల్ వేయగా చెల్లింపుల వివరాలన్నీ అప్పుడు కోర్టుకు సమర్పించామని తెలియచేస్తూ ఈ పిల్ తో పాటు ఇటీవల కాలంలో వేస్తున్న పిల్స్ లో 90 శాతం పబ్లిసిటీ కోసం వేస్తున్నవే అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కోర్టు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కాస్తా ప్రచార ప్రయోజన వ్యాజ్యాలుగా మారిపోతున్నాయని ఈ రోజు పిల్ దాఖలు చేసి మరుసటి రోజు పత్రికల్లో పెద్దవిగా రాయించుకొంటున్నారని కోర్టులున్నది ఇలాంటి వాటిని విచారించడానికి కాదని వ్యాఖ్యానించింది .

ఈ సందర్భంగా పిటిషనర్ తాము ప్రచారం కోసం పిల్ వేయలేదని బెంచ్ కి తెలపగా ఒక పత్రికలో ఈ పిల్ తాలూకూ వార్తలు స్వయంగా చూశామని విస్పష్టంగా తేల్చిచెప్పడంతో పిటిషనర్ మౌనం వహించాడు.

అయితే గతంలో ఆంధ్రజ్యోతి కథనం ఆధారంగా వేసిన ఓ పిల్ లో మాత్రం ఇందుకు విభిన్నంగా జరగటం విశేషం. జడ్జ్ ల ఫోన్లు ట్యాపింగ్ జరుగుతుంది అని ఏబీఎన్ లో వచ్చిన కథనం ఆధారంగా శ్రవణ్ కుమార్ అనే న్యాయవాది పిల్ వేయగా ఈ విషయంలో ప్రభుత్వంతో పాటు , ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు దాఖలు చేసిన కోర్టు ప్రభుత్వ వాదనను మాత్రం తోసిపుచ్చింది. ఆంధ్రజ్యోతి వార్తలు నిరాధారమని , ఏబీఎన్ ని కూడా విచారణలో భాగం చేసి వార్తకు ఆధారాలు చూపమని ఆదేశించమని ప్రభుత్వ న్యాయవాది కోరగా ఏబీఎన్ ని ప్రతివాదిగా చేర్చాల్సిన అవసరం ఇప్పుడు లేదని భవిష్యత్తులో అవసరమని అనిపిస్తే అప్పుడు చేరుస్తామని బెంచ్ వ్యాఖ్యానించింది .

నాడు ట్యాపింగ్ పై వేసినది , నేడు గండికోట పునరావాస అంశం పై వేసినది పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా వేసిన వాజ్యాలే అయినా రెండు వ్యాజ్యాల విచారణ విషయంలో కోర్టు దృక్పదంలో మార్పు వచ్చింది అనిపించక మానదు . ఈ మార్పు ఇటీవల వరుసగా పత్రిక కధనాల ఆధారంగా వేస్తున్న పిల్స్ ను కోర్టు నిశితంగా గమనిస్తున్నందునా , లేక ప్రభుత్వ కార్యకలాపాలకు వ్యతిరేకంగా కొన్ని వర్గాలు కోర్టుని వేదికగా చేసుకొని ఆటంకాలు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారన్న అభిప్రాయాలు గమనించా అన్నది వేచిచూడాలి ….