iDreamPost
android-app
ios-app

OTTలతో లాభమెంత నష్టమెంత

  • Published Nov 01, 2020 | 12:41 PM Updated Updated Nov 01, 2020 | 12:41 PM
OTTలతో లాభమెంత నష్టమెంత

ఏడు నెలలు గడిచిపోయాయి. ఇంకో అరవై రోజుల్లో 2020 పూర్తవుతుంది. ఓటిటిలు రాజ్యమేలుతున్నాయి. థియేటర్లు తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకోనే లేదు. నవంబర్ కూడా త్యాగం చేయాల్సి వచ్చేలా ఉంది. వేచి ఉండలేని వాళ్ళు డిజిటల్ రిలీజులకు జై కొట్టారు. ఉన్నవాళ్లు సంక్రాంతి మీద ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడీ ఓటిటిల వల్ల లాభాలు నష్టాలు ఎవరికి ఎంత వచ్చాయి అనేది చూసుకుంటే విస్తుపోయే నిజాలు కనిపిస్తాయి. ఇప్పటిదాకా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ తదితర భాషలు కలుపుకుని సుమారు ముప్పైకి పైగానే డైరెక్ట్ గా సదరు యాప్స్ లో స్ట్రీమింగ్ రూపంలో రిలీజయ్యాయి. వీటి వల్ల నిర్మాతలకు ఎలాంటి నష్టం జరగలేదు.

కానీ ఇక్కడ మరో కోణం ఉంది. నాని వి మాములుగా అయితే హీనపక్షం 25 కోట్ల బిజినెస్ చేసేది. నిశ్శబ్దం ఎంతలేదన్నా 15 కోట్ల దాకా అమ్ముడుపోయేది. పెంగ్విన్ ఒక 5 కోట్లు, ఉమామహేశ్వరఉగ్రరూపస్య ఒక 3 కోట్లు, కలర్ ఫోటో ఒక 2 కోట్లు, ఒరేయ్ బుజ్జిగా ఒక 6 కోట్లు ఇలా వాటి వాటి స్థాయికి మార్కెట్ కి తగ్గట్టు థియేట్రికల్ బిజినెస్ జరుపుకునేవి. ఇదంతా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల ఛానల్స్ ద్వారా రాకపోకలు సాగించాల్సిన కోట్లాది రూపాయల మొత్తం. కానీ ఓటిటిలో రావడం వల్ల వీళ్ళ అకౌంట్లలో జరిపిన లావాదేవీలు సున్నా. వీళ్ళే కాదు ఈ వ్యవస్థ మీద ఆధారపడిన లక్షలాది కుటుంబాలు తమ ఆదాయాన్ని కోల్పోయారు.

కానీ ఈ సినిమా ప్రొడ్యూసర్లకు అధిక శాతం పెట్టుబడి వెనక్కు రావడమే కాక లాభాలు కూడా వచ్చాయి. హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఇంట్లో చూసే వెసులుబాటు కాబట్టి జనం అన్నీ చూశారు. వ్యూస్ మిలియన్లలో వచ్చాయి. స్ట్రీమింగ్ సంస్థలు పెట్టుకున్న టార్గెట్ దాదాపుగా రీచ్ అయ్యాయి. యాప్ లో చూసిన ప్రతిఒక్కరు థియేటర్లో చూసి ఉండేవారన్న గ్యారెంటీ లేదు. అందుకే రీచ్ విపరీతంగా పెరిగిపోయింది. దీని వల్ల ప్రైమ్ లాంటి సంస్థలు, సినిమాలు అమ్ముకున్న నిర్మాతలు బాగా లాభపడ్డారు. ఎటొచ్చి థియేటర్ల వర్గాలు మాత్రం ఆదాయం లేక రివర్స్ లో నిర్వహణ ఖర్చుల రూపంలో అదనపు భారాన్ని మోయాల్సి వచ్చింది. అందుకే ఈ ఓటిటి విప్లవం ఒకరికి అమృతం మరొకరికి గరళం పంచిన తీరుగా మిగిలిపోయింది