ఉద్యమ కాలంలో అన్ని పార్టీలను ఒకతాటికిపైకి తెచ్చిన అధ్యాపకుడిని ఇప్పుడు ఎదురుగాలి వీస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్ ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తున్నారు. రాజనీతి శాస్త్ర బోధకుడు రాజకీయాల్లో రాణించలేకపోతున్నారు. ఏ పార్టీ పంచననో చేరడం ఇష్టం లేక సొంత పార్టీని స్థాపించుకున్న ప్రొఫెసర్ కోదండరాం ఇప్పటి దాకా తన శక్తి నిరూపించుకోలేకపోయారు. ఇప్పటి వరకూ పోటీ చేసిన ఎక్కడా విజయాన్ని సొంతం చేసుకోలేకపోయిన కోదండరాం మరోమారు తనను తను పరీక్షకు పెట్టుకున్నారు.
తెలంగాణ ఉద్యమకాలంలో జేఏసీ చైర్మన్ గా అన్ని పార్టీలకూ పెద్దదిక్కుగా వ్యవహరించిన ఆచార్యుడికి అగ్నిపరీక్ష ఎదురైంది. ఆయన స్థాపించిన తెలంగాణ జన సమితి ఇప్పటి దాకా ఉనికిని చాటుకోలేపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి బరిలోకి దిగిన కోదండరాం ఎన్నికల తరువాత నిస్తేజమయ్యారు. తాజాగా ఖమ్మం-నల్లగొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై కన్నేసిన ప్రొఫెసర్ ప్రతిపక్ష పార్టీల మద్దతును ఆశించారు. కానీ…. ఆయనకు చేదు అనుభవమే ఎదురైంది. అటు కాంగ్రెస్, ఇటు వామపక్షాలు ఆయనకు అండగా నిలబడేందుకు సిద్ధపడలేదు. దీంతో ఆయన ఒంటరి పోరాటం మొదలెట్టారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం నుంచి మద్దతు లభిస్తుందని ప్రొఫెసర్ కోదండరాం ఆశించారు. కానీ కాంగ్రెస్ పార్టీ కోదండరాంకు మద్దతు ప్రకటించే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వడంతో ఆయన ఆశ నిరాశ అయ్యింది. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లోనూ తెలంగాణ జన సమితి 24 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి నిలబెట్టింది. ఒక్క చోట కూడా డిపాజిట్ సాధించకలేకపోయింది. కొన్ని డివిజన్లలో అయితే రెండంకెల ఓట్లు కూడా సాధించలేకపోయిందంటే ఆ పార్టీ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికలు మొదలు స్థానిక సంస్థల వరకు ఎక్కడా బలాన్ని నిరూపించుకోలేకపోయిన తెలంగాణ జన సమితితో జట్టుకట్టడానికి ఇతర పార్టీలు కూడా ఆసక్తికనబరచడం లేదు.
నిజానికి అధికార పార్టీకి వ్యతిరేకంగా జరిగిన పలు ఆందోనల్లో ప్రొఫెసర్ కోదండరాం లెఫ్ట్ పార్టీలతో కలిసి పనిచేశారు. కానీ… ఖమ్మం-నల్లగొండ-వరంగల్ జిల్లాలో పట్టున్న లెఫ్ట్ పార్టీలే ఇప్పుడు ఆయనకు మద్దతు ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఒక దశలో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మె్ల్సీ స్థానానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును, ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానానికి ప్రొఫెసర్ కోదండరామ్ ను లెఫ్ట్ పార్టీలు బరిలోకి దింపుతాయనే ప్రచారం జరిగింది. కానీ లెఫ్ట్ పార్టీలు ఈ ఆలోచన నుంచి వెనక్కి తగ్గాయి. లెఫ్ట్ పార్టీల తరుపున సీనియర్ జర్నలిస్టు జయసారథి రెడ్డిని బరిలోకి దింపడానికి సిద్ధమయ్యాయి. దీంతో కోదండరాం ఒంటరి పోరాటానికి సిద్ధమయ్యారు. మరి ఈ సారైనా కోదండరాం తన శక్తిని నిరూపించుకోగలుగుతారో లేదో చూడాలి.