Idream media
Idream media
నవంబర్ 27 హైదరాబాద్ లోని శంషాబాద్ లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డిపై జరిగిన హత్యోదంతంపై యావత్ దేశం మొత్తం రగిలిపోతోంది. నలుగురు వ్యక్తులు కలసి అత్యంత పాశవికంగా యువతిని అత్యాచారం చేసి చంపడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. మానవ జాతి సిగ్గుపడేలా జరిగిన ఈఘటనతో హంతకులపై పెద్దఎత్తున ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి. మానవ మృగాల మాదిరిగా మగజాతి తల దించుకునేలా యువతి మరణించిన తర్వాత కూడా ఆమెపై అత్యాచారం చేశారని తెలిసి ప్రతీఒక్కరు కంటతడి పెడుతున్నారు. 2012లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనతో దేశం ఎలా అట్టడుకిపోయిందో మళ్లీ ఇప్పుడుప్రియాంక రెడ్డి ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. నిందితులను వెంటనే ఉరితీయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.
మరోవైపు యావత్ ప్రపంచాన్ని నివ్వరపరచిన ఈ ఘటన పై రాష్ట్ర మంత్రులు చేసిన వాఖ్యలు వివాదస్పదమవుతున్నాయి. ఆపద సమయంలో ప్రియాంక చెల్లికి కాకుండా 100 కు ఫోన్ చేయాల్సింది అంటూ హోంమంత్రి చేసిన వాఖ్యలను ప్రజలు విమర్శిస్తున్నారు. మంత్రి అయి ఉండి ఇలాంటి వాఖ్యలు చేయడం సిగ్గుచేటని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. మరోమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇంటికో పోలీసు వ్యక్తిని కాపాలా పెట్టాలా అంటూ చేసిన వాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. నేషనల్ మీడియాల్లోనూ ఈ ఘటనను ప్రముఖ జర్నలిస్టులు, మేధావులు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. తెలంగాణకు చెందిన పార్లమెంట్ సభ్యులపై ప్రశ్నలు గుప్పిస్తున్నారు. మీ రాష్ట్ర హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు ఎంతవరకూ సబబు.? మీ ముఖ్యమంత్రి కనీసం ఇప్పటివరకూ ఎందుకు మాట్లాడలేదంటూ నిలదీస్తున్నారు.
ఒకపక్క రాష్ట్రంలో జరిగిన ఈ దురదృష్ట ఘటన పట్ల యావత్ దేశం స్పందిస్తుంటే ,తెలంగాణ మంత్రులు ఇలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడటంతో ప్రజలు మరింత రగిలిపోతున్నారు. అసలు మీరు ప్రజలు రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రియాంక రెడ్డి హత్య ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు స్పందిచకపోవడం కూడా అనేక విమర్శలకు తావిస్తోంది. బాధితుల కుటుంబానికి ధైర్యం, చెప్పి నిందితుల పట్ల కాస్త కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా పెల్లుబికుతున్న ప్రజా డిమాండ్ ను పరిగణలోకి తీసుకుని వారిని ఉరితీయాలని కోరుతున్నారు. ప్రజాగ్రహాన్ని, ప్రజాగళాన్ని విని ఘటన పట్ల స్పందించాలని కోరుతున్నారు. రాష్ట్రంలో జరిగిన ఇంత పెద్ద ఘటనపై సీఎం స్పందించకపోవడం దుర్మార్గమంటున్నారు.
ప్రియాంక కుటుంబసభ్యులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. తెలంగాణ గవర్నర్ తమిళ సై కూడా బాధితురాలి కుటుంబసభ్యులను కలసి వారికి దైర్యం చెప్పారు. బ్రిటీషు కాలం నాటి ఈ చట్టాలను మారుస్తామని ఈ సందర్బంగా కిషన్ రెడ్డి కీలక వాఖ్యలు చేశారు.ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయ పరిష్కారం లభించే విధంగా చట్టాల్లో మార్పులు తీసుకురాబోతున్నట్టు ఆయన తెలిపారు.. మరోవైపు ప్రియాంకరెడ్డి హత్య ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు రావడంతో ముగ్గురు పోలీసుల పై అధికారులు వేటువేశారు. తమ కూతురు కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్తే అసభ్యకరంగా మాట్లాడారని, ఇది మా పరిధిలోకి రాదంటు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రియాంకరెడ్డి తల్లి చెప్పటంతో ముగ్గురు పోలీస్ ల పై వేటుపడింది. శంషాబాద్ ఎస్సై రవికుమార్,రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్ట్ హెడ్ కానిస్టేబుల్స్ వేణుగోపాల్,సత్యనారాయణల పై పోలీసు ఉన్నతాదికారులు చర్యలు తీసుకున్నారు..
ప్రియాంక రెడ్డి ఘటన జరిగిన రోజే వరంగల్ లో మరో యువతిపై అత్యాచారం, హత్య జరిగింది. ఒకేరోజు తెలంగాణలో ఇద్దరు యువతులపై అత్యాచారం, హత్యలు జరగడం చాలా బాధకరమైన ఘటనలు. ఇటీవల నిత్యం ఆడపిల్లల పై అత్యాచారాలు, హత్యలు జరుగుతుండటంతో పోలీస్ వ్యవస్థపైనా ప్రజలు మండిపడుతున్నారు. అసలు హోంమంత్రి ఉన్నా లేనట్టేనని, ఇంత జరుగుతున్న రాష్ట్రప్రభుత్వం ఏంచేస్తోందని, అసలు ఘటన జరిగిన తర్వాత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కిమ్మనకపోవడం దారుణమని ప్రజలు, విద్యార్ధులు విమర్శిస్తున్నారు.