iDreamPost
android-app
ios-app

అప్పుడు-ఇప్పుడు సజ్జన్నారే

అప్పుడు-ఇప్పుడు సజ్జన్నారే

గత నెల 27న షాద్ నగర్, చటాన్ పల్లి టోల్‌ గేట్ దగ్గర పశువైద్యురాలు ప్రియాంక రెడ్డిపై అత్యాచారం,హత్య ఆ పై దహనం కేసులో నిందితులు మహమ్మద్ ఆరీఫ్, చెన్నకేశవులు,నవీన్,శివ లను ఈ రోజు సుమారు 3-30సమయంలో పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. పోలీసుల కథనం మేరకు సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేస్తుండగా ఆయుధాలు లాక్కుని పారిపోవడానికి ప్రయత్నించినందున ఎన్ కౌంటర్ జరిగిందని చెపుతున్నారు.‌

ప్రియాంక హత్య తర్వాత మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు,సమాజం నుండి వెల్లువెత్తిన నిరసనలతో పోలీసులపై తీవ్రమైన ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో‌ ఈ ఎన్ కౌంటర్ ప్రాముఖ్యత సంతరించుకుంది.

గతంలో వరంగల్ లోని హనుమకొండలోని ఇంజనీరింగ్ విద్యార్థులు స్వాప్నిక,ప్రణీతలపై యాసిడ్ దాడి జరిగిన ఘటనలో నిందితులైన శ్రీనివాసరావు,హరికృష్ణ,సంజయ్ లను కూడా పోలీసులపై ఆయుధాలతో తిరగబడగా పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.

ఈ రోజు ఎన్ కౌంటర్ జరిపిన పోలీసుల బృందానికి నాయకత్వం వహిస్తున్న సైబరాబాద్ పోలీస్ కమీషనర్ ,అప్పటి వరంగల్ ఎస్పీగా పనిచేస్తున్నదీ వీసీ సజ్జన్నార్ కావడం గమనార్హం.

2008 వ సంవత్సరంలో పది సంవత్సరాల బాలిక‌ మనీషా కిడ్నాప్,హత్య కేసులో కూడా నిందితులు‌జగన్,రత్నాకర్ లను కూడా పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.

గత నెల 30 న జ్యుడీషియల్ కస్టడీకి తరలించిన ప్రియాంక హత్య కేసు నిందితులను ఈ నెల 4న పోలీసు కస్టడీకి తీసుకున్నారు. నిన్నటి రోజు మొత్తం చర్లపల్లి జైలులోనే విచారించిన పోలీసులు ఈ రోజు ఘటనా స్థలానికి తీసుకురాగా ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది.