iDreamPost
android-app
ios-app

అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుల మీద చర్యలకు కమిటీ సిఫార్సు

  • Published Sep 21, 2021 | 9:33 AM Updated Updated Sep 21, 2021 | 9:33 AM
అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుల మీద చర్యలకు కమిటీ సిఫార్సు

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇక్కట్లలో పడ్డారు. ఏపీ అసెంబ్లీలో సభను పక్కదారి పట్టించారంటూ వారిపై వచ్చిన అభియోగాలను ప్రివిలైజ్ కమిటీ నిర్ధారించింది. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. 2024 వరకూ వారిద్దరికీ మైక్ ఇవ్వరాదని కమిటీ స్పీకర్ తమ్మినేని సీతారాం కు సిఫార్సు చేసింది. దాంతో ఇప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో కమిటీ సిఫార్సుల ప్రకారం అసెంబ్లీ స్పీకర్ చర్యలు తీసుకుంటారా..? లేదా శిక్ష తగ్గిస్తారా..? అనేచర్చ మొదలయ్యింది.

ప్రివిలైజ్ కమిటీ సమావేశంలో వారిపై చర్యలకు ఏకపక్షంగా నిర్ణయం జరిగిందని కమిటీ చైర్మన్ కాకాణి గోవర్థన్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఇక నిమ్మగడ్డ రమేష్ కి సంబంధించిన విషయంలో కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా తదుపరి సమావేశంలో ఆయన స్పందనను బట్టి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. త్వరలోనే సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రివిలైజ్ కమిటీలో చర్చించి చర్యలను కూడా స్పీకర్ కి ప్రతిపాదించామన్నారు. ఇక మాజీ విప్ కూన రవికుమార్ పై వచ్చిన ఫిర్యాదులపై కూడా తదుపరి సమావేశంలో నిర్ణయం ఉంటుందని అన్నారు.

Also Read : టార్గెట్ కుప్పం అసెంబ్లీ.. టీడీపీలో టెన్షన్ టెన్షన్…!

అచ్చెన్నాయుడు , నిమ్మల రామానాయుడు ఇద్దరూ సభలో ఇచ్చిన సమాచారం సభ్యులను పక్కదారి పట్టించేలా ఉందని కమిటీ నిర్ధారించింది. మద్యం షాపుల విషయంలో అచ్చెన్నాయుడు ఇచ్చిన సమాచారం విషయంలో ఆయనపై చీఫ్‌ విప్ శ్రీకాంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వాస్తవానికి అచ్చెన్నాయుడు మీద తొలుత స్పీకర్ మీద చేసిన వ్యాఖ్యల గురించి చర్చ జరిగింది. అందులో ఆయన స్వయంగా సమావేశానికి హాజరయ్యి క్షమాపణ చెప్పడంతో వివాదం ముగిసింది. మద్యం షాపుల విషయంలో మాత్రం ఇచ్చిన సమాచారంపై చర్యలు తప్పకపోవడంతో అచ్చెన్నాయుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఇక పెన్షన్ల విషయంలో కూడా నిమ్మల రామానాయుడు సభలో ప్రస్తావించిన అంశాలు అబద్ధాలుగా నిర్ధారించారు. దాంతో ఆయనపై కూడా చర్యలకు ఉపక్రమించేలా సభా హక్కుల కమిటీ చేసిన తీర్మానం టీడీపీ నేతలకు కలవరపరుస్తోంది. త్వరలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం కాబోతున్న వేళ వారిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంతో స్పీకర్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. అయితే సభలో అబద్ధాలు ప్రస్తావించడం ద్వారా ప్రివిలైజ్ కమిటీ ముందు ఈ ఇద్దరు సీనియర్లు దోషులుగా నిలవాల్సి రావడం ప్రతిపక్ష టీడీపీకి కొత్త తలనొప్పిగా మారింది.

Also Read : చంద్రబాబు వాకిట్లో పవనన్న పార్టీ, పశ్చిమలో ప్రస్ఫుటమైన తీరు