Idream media
Idream media
స్థానిక ఎన్నికల నిర్వహణలో దూకుడుగా వ్యవహరించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు ప్రివిలేజ్ కమిటీ రూపంలో ముప్పు ముంచుకొస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన నోటీసులపై ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి దృష్టి సారించనున్నారు. ఇప్పటికే విచారణకు అందుబాటులో ఉండాలని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను కోరినట్టు కాకాణి స్పష్టం చేశారు.
నిమ్మగడ్డపై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఇచ్చిన హక్కుల ఉల్లంఘన నోటీసును అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి సభాపతి తమ్మినేని సీతారాం పంపారు. గవర్నర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో తమను కించపరచేలా, ప్రతిష్ఠను దిగజార్చేలా ఎస్‌ఈసీ పేర్కొన్నారని, ఈ ఫిర్యాదులోని అంశాలపై సామాజిక మాధ్యమాలు తమ వ్యక్తిత్వాన్ని కించపరచేలా ప్రసారం చేశాయని స్పీకర్‌కు మంత్రులు ఫిర్యాదు చేశారు. ప్రివిలేజ్ కమిటీ భేటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.
విచారణకు సంబంధించి నోటీసులను అసెంబ్లీ సెక్రటరీ ద్వారా ఎస్ఈసీ నిమ్మగడ్డకు పంపుతామని కాకాణి గోవర్ధన్‌రెడ్డి తేల్చి చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండోసారి కూడా నోటీసులు ఇచ్చారని, ఈ నేపథ్యంలో చర్చించినట్టు తెలిపారు. గతంలో ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరిగింది. అసెంబ్లీలోని రూల్ నెం 212, 213 కింద ఎస్‌ఈసీని పిలింపించవచ్చని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను అధ్యయనం చేసినట్టు కాకాణి వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ఎస్ఈసీపై చర్యలు తీసుకునేందుకు ప్రివిలేజ్ కమిటీ పకడ్బందీ వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరులో నిమ్మగడ్డ పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో ప్రివిలేజ్ కమిటీ భేటీ ఉత్కంఠగా మారింది. ప్రివిలేజ్ కమిటీ చర్యలను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని కాకాణి గట్టిగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఆసక్తి సర్వత్రా ఏర్పడింది. మరోవైపు మంత్రుల ఫిర్యాదు, ప్రివిలేజ్ కమిటీ భేటీతో నిమ్మగడ్డ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలిసింది. మున్ముందు ఏం జరగనుందో వేచి చూడాలి.