iDreamPost
android-app
ios-app

స్టార్ల కలయికలో ప్రైమ్ ప్రయోగం

  • Published Sep 30, 2020 | 11:40 AM Updated Updated Sep 30, 2020 | 11:40 AM
స్టార్ల కలయికలో ప్రైమ్ ప్రయోగం

లాక్ డౌన్ వల్లనో లేక థియేటర్ల మనుగడ ఇప్పట్లో పుంజుకోదన్న అనుమానమో చెప్పలేం కానీ మొత్తానికి స్టార్ డైరెక్టర్లు యాక్టర్లు వెబ్ సిరీస్ ల వైపు గట్టి కన్నే వేస్తున్నారు. బడ్జెట్ విషయంలో ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు సినిమాలకు ధీటుగా ఖర్చు పెట్టేందుకు ముందుకు రావడం ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఇతర నిర్మాతలు తీసినవి వంద కోట్ల దాకా పెట్టుబడులు పెట్టి హక్కులు కొంటున్నప్పుడు అదేదో మనమే తీసుకుంటే పోలా అనే ఆలోచనా ధోరణి డిజిటల్ సంస్థల్లో పెరుగుతోంది. దానికి తగ్గట్టే ఒక్కొక్కరుగా అటువైపు అడుగులు వేస్తున్నారు. అక్టోబర్ 16న ప్రైమ్ ఈ విషయంలో పెద్ద సంచలనమే రేపబోతోంది. 

5 కథలను 5 దర్శకులతో తీయించి ఓ అంతాలజీ సిరీస్ ని విడుదల చేయబోతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే గౌతమ్ మీనన్ తీసిన మూవీలో పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ, ఎంఎస్ భాస్కర్ నటించారు. దీనికి ‘ఆవరుమ్ నానుమ్’ టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ తీసిన ‘రీ యూనియన్’ లో తఢాకా భామ ఆండ్రియా జెరిమియా, లీల సాంసన్ నటించారు. సుహాసిని మణిరత్నం డైరెక్ట్ చేసిన ‘కాఫీ’లో కమల్ కూతుళ్లు కమ్ హీరోయిన్లు శృతి హాసన్, అక్షర హాసన్ కీలక పాత్రలు పోషించారు. పేట ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు తీసిన ‘మిరాకిల్’లో బాబీ సింహా, ముత్తు కుమార్ మెయిన్ రోల్స్ చేశారు. సూర్యతో ఆకాశం నీ హద్దురా తీసిన సుధా కొంగర మూవీకి ‘ఇలామై ఇదో ఇదో’ పేరు నిర్ణయించారు. ఇందులో చిత్రలహరి-హలో ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ తో పాటు కాళిదాస్ నటించారు. 
ఇవి ఒక్కొక్కటి ఎంత లెన్త్ ఉంటాయనేది ఇంకా వెల్లడించలేదు. తెలుగులోనూ డబ్బింగ్ చేయబోతున్నారు కానీ  అదే రోజు విడుదల కాకపోవచ్చు. కొంత గ్యాప్ తర్వాత మన తెలుగు ప్రేక్షకులు చూడొచ్చు. ఇదే తరహాలో మణిరత్నం పర్యవేక్షణలో నెట్ ఫ్లిక్స్ కూడా  ఓ సిరీస్ ని నిర్మిస్తోంది. దీని ద్వారానే అరవింద్ స్వామి లాంటి హీరోలు దర్శకులుగా మారబోతున్నారు. ఈ ట్రెండ్ బాలీవుడ్ లో చాలా రోజుల నుంచి ఉంది. కానీ సౌత్ లో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతోంది. సుకుమార్ సైతం ఈ మోడల్ లో ఓ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. తేజ ఆల్రెడీ షూటింగ్ కూడా చేస్తున్నారు. ఆహా యాప్ రెగ్యులర్ గా ఇలాంటి స్క్రిప్ట్స్ ని ఫిల్టర్ చేసే పనిలో ఉంది. మొత్తానికి చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ వెబ్ సిరీస్ ల వైపు టర్న్ తీసుకోవడం మంచిదే. సృజనాత్మకతకు సంకెళ్లు వేయకుండా తమ బుర్రకు ఏదో ఒక రూపంలో పని కల్పిస్తూ బిజీగా ఉండటం అవసరమే. అందులోనూ క్రేజీ కాంబినేషన్స్ లో రూపొందితే ప్రేక్షకుల్లోనూ ఆసక్తి ఉంటుంది.