iDreamPost
android-app
ios-app

జ‌గ‌న్, కేసీఆర్ ఎటువైపు?

జ‌గ‌న్, కేసీఆర్ ఎటువైపు?

వ‌చ్చే ఏడాదికి రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగుస్తుంది. ఈలోపు.. రాష్ట్రపతి పదవికి ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. దీంతో రాష్ట్రపతి ఎన్నికపై వాడివేడి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ ఎన్నిక‌కు ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులైన ఎంపీలు ఎమ్మెల్యేల ఓట్లు అత్యంత కీలకం. అయితే.. ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ.. ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయి. దీంతో రాష్ట్రపతి ఎన్నికలో వీరి పాత్రే ఎక్కువ. ఫలితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ, ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ కాంగ్రెస్ కానీ.. రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెడితే.. ఎలక్టోలర్ కాలేజీల మద్దతు తప్పనిసరి.

రాష్ట్రప‌తి ఎన్నిక‌లో బీజేపీ బ‌లంగా ఉండాలంటే 2022లో ఐదు రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలు కీలకం కానున్నాయి. అక్కడ గెలిస్తేనే ఎలక్ట్రోల్ కాలేజ్‌లో బీజేపీ బలపడి తాము నిలబెట్టిన అభ్యర్థి రాష్ట్రపతిని చేసేందుకు మార్గం సులభతరం అవుతుంది. అదే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా వస్తే అప్పుడు మోడీ ముందున్న ఆప్షన్స్ ఏంటి…? ఇప్పటికే శరద్ పవార్ రాష్ట్రపతి పీటంపై కన్నేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ప్రాంతీయ పార్టీల అవ‌స‌రం చాలా ఉంటుంది.

ప్రస్తుతం కాంగ్రెస్ కు రాష్ట్రాల్లో బలం లేకుండా పోయింది. దీంతో ఈ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిని ఒంటరిగా ప్రకటించే అవకాశం లేదు. దీంతో యూపీఏ కూటమితో కలిసి పోటీకి దిగే అవకాశం ఉంది. ఇక బీజేపీ విషయానికి వస్తే.. యూపీ సహా కొన్ని రాష్ట్రాల్లో బలంగానే ఉన్నప్పటికీ.. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్లోనూ ఆశించిన విధంగా మాత్రం పుంజుకోలేక పోయింది. అదేవిధంగా కీలకమైన రాష్ట్రం పశ్చిమ బెంగాల్లోనూ బీజేపీ ఆశించిన విధంగా విజయం దక్కించుకోలేక పోయింది. దీంతో త్వరలోనే జరగనున్న మరో ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఆధారపడింది. ఒక వేళ ఆయారాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటే ఓకే. లేకపోతే.. మాత్రం బీజేపీ ఇతర ప్రాంతీయ పార్టీలపై ఆదారపడి రాష్ట్రపతి ఎన్నికలకు వెళ్లాలి.

ఈ నేపథ్యంలో ఏపీ తెలంగాణ సహా ఒడిసా తమిళనాడు రాష్ట్రాలు ఎటు మద్దతు తెలిపే అవకాశం ఉంది? అనేది ప్రధాన ప్రశ్న. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఎటు ఉంటాయి? ఏపీ సీఎం జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్లు ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతారు? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్.. బీజేపీతో వైరంతో ఉన్నారు. రాష్ట్రంలో పాగావేయాలని.. భావిస్తున్న బీజేపీ నేతలు.. కేసీఆర్ను విమర్శించడంతోపాటు కేంద్ర ప్రభుత్వంతమకు సరైన విధంగా సహకరించడం లేదని కేసీఆర్ భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో బీజేపీ ఒంటరిగా నిలిచినా.. ఈ దఫా ఆయన మద్దతు తెలపకపోవచ్చు. దీంతో ఎన్డీయే వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

ఏపీ సీఎం జగన్ గత రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు మద్దతు ప్రకటించారు. ఇప్పుడు కూడా కేంద్రంతో సంబంధాలు బాగానే ఉన్నాయి. అయితే.. ఇటీవ‌ల వ్యాక్సినేష‌న్ పై కేంద్ర విధానంలోని లోపాల‌ను ఎత్తి చూపుతూ ముఖ్య‌మంత్రుల‌కు అంద‌రికీ లేఖ‌లు రాశారు. అలాగే, నిధులు, ప్రత్యేక హోదా.. తదితర అంశాలపై కేంద్రంతో కొంత వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్, జ‌గ‌న్ రాష్ట్రపతి ఎన్నిక లో ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇస్తార‌నేది ఆసక్తిగా మారింది.