iDreamPost
android-app
ios-app

రాష్ట్రపతి ఎన్నికే బీజేపీకి అసలు సవాల్

  • Published Jun 13, 2021 | 9:20 AM Updated Updated Jun 13, 2021 | 9:20 AM
రాష్ట్రపతి ఎన్నికే బీజేపీకి అసలు సవాల్

వచ్చే ఏడాది అంతా జాతీయ స్థాయిలో బీజేపీకి సవాళ్ల సీజనే. సార్వత్రిక ఎన్నికలు 2024లో జరగాల్సి ఉన్నప్పటికీ.. దానికి రెండేళ్ల ముందుగానే కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీకి అగ్నిపరీక్ష ఎదురవుతుంది. అదే రాష్ట్రపతి ఎన్నిక. దానికి ముందు ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉత్తరప్రదేశ్ తో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి ఉంది. డిసెంబరులో మరో మూడు రాష్ట్రాలు ఎన్నికలకు వెళ్లనున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇవన్నీ బీజేపీకి సెమీ ఫైనల్ లాంటివని భావిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో నెగ్గడం ఆ పార్టీకి అత్యవసరం. అక్కడ గెలవాలంటే.. దానికి ముందు ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చి ఎలెక్టోరల్ కాలేజ్ లో బలం పెంచుకోవాలి. దీన్ని దృష్టిలో ఉంచుకునే పార్టీ జాతీయ నాయకత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలెట్టింది.

బలం తగ్గితే ఎలా..

ప్రస్తుత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ పదవీకాలం వచ్చే ఏడాది పూర్తి అవుతుంది. దానికి ముందు జూలైలో కొత్త రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. గత ఎన్నికల్లో తన అభ్యర్థి కోవింద్ ను గెలిపించుకోగలిగిన బీజేపీ.. కొత్త రాష్ట్రపతిగా కూడా తమ పార్టీ అభ్యర్థినే గెలిపించుకోవాలని తహతహలాడుతోంది. రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు పార్లమెంటు సభ్యులు, 28 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ఏర్పాటవుతుంది. ఇప్పటికైతే ఎన్డీయే కూటమి, మరికొన్ని ప్రాంతీయ పార్టీల మద్దతుతో బీజేపీకి ఎలక్టోరల్ కాలేజీలో తగినంత సంఖ్యాబలం ఉంది. కానీ రాష్ట్రపతి ఎన్నికకు ముందు జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే కమలనాథులలో కలవరం రేపుతున్నాయి. ఆ ఎన్నికల్లో బలం తగ్గితే ఎలా అన్న ఆందోళన వెంటాడుతోంది.

కలవరం రేవుతున్న ఐదు రాష్ట్రాలు

వచ్చే ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగాల్సిన ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీని కలవరానికి గురి చేస్తున్నాయి. వీటిలో ఒక్క పంజాబ్ తప్ప మిగిలిన అన్నిచోట్లా బీజేపీ లేదా ఆ పార్టీ భాగస్వామిగా ఉన్న కూటములు అధికారంలో ఉన్నాయి. 403 అసెంబ్లీ స్థానాలతో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న యూపీలో బీజేపీ 306 మంది సభ్యులను కలిగి ఉంది. ఆ రాష్ట్రంలో రకరకాల కారణాలతో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపించింది. మిత్రపక్షంగా ఉన్న అప్నాదళ్ కూడా దూరమైంది. ఇవన్నీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపి బీజేపీ ఓడిపోయినా.. లేదా సంఖ్యాబలం బాగా తగ్గిపోయినా.. అది రాష్ట్రపతి ఎన్నికపై పడుతుంది. పంజాబులో ను అదే పరిస్థితి ఉంది. 2017 ఎన్నికల్లో ఆకాలీ దళ్, బీజేపీ కూటమి ఇక్కడ అధికారం కోల్పోయింది. కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఆకాలీ దళ్ కటీఫ్ చెప్పడంతో బీజేపీ మరింత బలహీనపడింది. ఆకాలీ దళ్, బీఎస్పీ పొత్తు కుదుర్చుకోవడం మరో సమస్యగా మారింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గడం సంగతి అలా ఉంచితే.. ఇప్పుడున్న సంఖ్యాబలాన్ని కాపాడుకుంటే చాలన్నట్లుంది.

ఇక ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ప్రస్తుత బలం కాపాడుకోవడం లేదా పెంచుకోవడం తప్పనిసరి. మొత్తం మీద ఈ ఐదు రాష్ట్రాల్లో సాధించే సీట్ల పైనే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భవిష్యత్తు ఆధారపడి ఉందనేది స్పష్టం. కాగా శరద్ పవార్ ను రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ప్రతిపాదించడానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రయత్నిస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ సవాళ్ళను అధిగమించి రాష్ట్రపతి ఎన్నికల్లో నెగ్గాలంటే.. ఐదు రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు సాధించడమొక్కటే బీజేపీ ముందున్న మార్గం. అలా జరగక్కపోతే.. ప్రతిపక్షాల అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిన అగత్యం ఏర్పడుతుంది. అందువల్లే బీజేపీ నాయకత్వం ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలపై పట్టు బిగించేందుకు మల్లగుల్లాలు పడుతోంది.

Also Read : కేంద్ర కేబినెట్ విస్త‌ర‌ణ‌ : ఏపీ నుంచి ప్రాతినిధ్యం ఉంటుందా?