Idream media
Idream media
గడువు సమీపిస్తున్న రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లకు ఎలక్షన్ కమిషన్ సంసిద్ధంగా ఉంది. కరోనా పరిస్థితులను ఎదుర్కొంటూనే సమయానుకూలంగా ఎన్నికలు జరిపేందుకు సిద్ధమవుతోంది. ఆయా రాష్ట్రాలలోని అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలే కాదు.. కార్పొరేషన్ ఎన్నికలకు కూడా అడుగులు పడుతున్నాయి. కరోనా కాలంలోనూ రాజకీయ వేడి పెరిగేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం సమావేశం కూడా నిర్వహించింది. దీంతో గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి తొలి అడుగు పడినట్లు అయింది. ఈ మేరకు సన్నాహాక కార్యక్రమాలు చేపట్టాలని జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం అధికారులను ఆదేశించింది. ఎన్నికల జాబితా రూపకల్పన, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, సిబ్బందిని సమకూర్చుకోవడం వంటి ప్రక్రియలను ప్రారంభించాలని సూచించింది.
ప్రభుత్వం ఆ వెసులుబాటును ఉపయోగించుకోనుందా..?
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం 2016, ఫిబ్రవరి 2న జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. అదే నెల 11న కొత్త పాలకమండలి కొలువుదీరింది. దీని ప్రకారం.. ప్రస్తుత పాలకమండలి గడువు ఫిబ్రవరి 10, 2021తో ముగియనుంది. జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం పాలకమండలి గడువు ముగిసే మూడు నెలల ముందు ఎన్నికలు నిర్వహించుకునే అవకాశం ఉంది. చట్టంలోని ఈ వెసులుబాటు ఆధారంగానే ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు టీఆర్ఎస్ శ్రేణుల ద్వారా తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘము కూడా ఆ మేరకు సిద్ధమవుతోంది.
ఆయా పనులకు రెండు నెలల సమయం
సవరించిన చట్టం ప్రకారం నామినేషన్ల దాఖలు నుంచి పోలింగ్ వరకు ఎన్నికల నిర్వహణ ప్రక్రియను 16 రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉంది. అంతకు ముందే ఎన్నికలకు సంబంధించి చేపట్టాల్సిన సన్నాహక చర్యలు చాలానే ఉంటాయి. ఓటర్ల జాబితా రూపకల్పన, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, సిబ్బందికి శిక్షణ, బీసీ ఓటర్ల సర్వే, రిజర్వేషన్ల ఖరారు వంటి కార్యక్రమాలు ఉంటాయి. ఫిర్యాదులు.. అభ్యంతరాల స్వీకరణతో కలిపి రిజర్వేషన్ల ఖరారుకే 35 నుంచి 40 రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద రెండు నెలల సమయం సన్నాహాక కార్యక్రమాలకు అవసరం ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారులు ఈ పనులన్నీ చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. అవన్నీ పూర్తయ్యేందుకు డిసెంబర్ కావొచ్చని అంటున్నారు. ఈ లెక్కన జనవరిలోనే ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.