iDreamPost
iDreamPost
వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ మైలురాయి. ఆయన యాత్రకు ముందు, ఆ తర్వాత అన్నట్టుగా రాష్ట్ర రాజకీయాలను చూడవచ్చు. అదే సమయంలో వైఎస్సార్ తీరులో కూడా పాదయాత్ర సమూల మార్పుని తీసుకొచ్చిందన్నది సన్నిహితుల అభిప్రాయం. వైఎస్సార్ గురించి బాగా తెలిసిన వారు కూడా చాలా సందర్భాల్లో ఈ మాటను బాహాటంగానే వెల్లడించారు. పాదయాత్ర అంటే కేవలం ప్రచారం కోసమే కాదు..ఆయా నేతలను ప్రజల దగ్గరకి చేర్చడంలోనూ, ప్రజల ఇతిబాధలను నాయకులు అవగాహన చేసుకోవడంలోనూ ఎంతగానో తోడ్పడుతుంది. వైఎస్ జగన్ అనుభవం కూడా అదే చెబుతుంది.
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం అవలంభించిన విధానాల పుణ్యాన రాష్ట్రం అవస్థలు పాలవుతోందని విపక్ష హోదాలో జగన్ నిత్యం విమర్శిస్తూనే వచ్చారు విధానపరమైన సూచనలు చేస్తూనే వచ్చారు. కానీ వాటిని పెడచెవిన పెట్టిన టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అసెంబ్లీలో కూడా ప్రజల ముంగిట తేల్చుకుంటానని కాలు కదిపి నేటికి నాలుగేళ్లు. జగన్ పాదయాత్ర అనేక విధాలుగా ప్రత్యేకమైనది. అన్నింటికీ మించి ఏపీ లో నలుమూలలా స్థితిగతులు జగన్ అర్థం చేసుకోవడానికి తోడ్పడిన యాత్ర అది.అదే సమయంలో జగన్ అంటే ఏంటో జనాలకు బాగా తెలిసి వచ్చిన సందర్భం అది. ఆటుపోట్లు ఎదురయినా, ఆటంకాలు ఎన్ని ఎదురయినా వెనుదిరగకుండా ముందుకు సాగిన జగన్ పట్టుదలను ప్రజల గ్రహించేందుకు పాదయత్ర ఎంతగానో తోడ్పడింది. అందుకే 2017 నవంబర్ 6న మొదలయిన ఆ యాత్ర గురించి ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది.
ఇడుపులపాయలో దివంగత వైయస్సార్ సమాధివద్ద నుంచి యాత్ర మొదలయ్యింది. రాష్ట్రంలో 13 జిల్లాలను దాటుకుంటూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర యాత్ర చేయడం ఓ రికార్డు. మరో చరిత్ర. యాత్ర సందర్భంగా 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. జనం నుంచి గ్రహించిన అంశాలతో జగన్ ప్రజల ముందుకెళ్లడానికి తోడ్పడిన సభలవి.
క్షేత్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడుతున్న కష్టాలను ఆయన కళ్లారా చూశారు. వాటికి పరిష్కారం కోసం తానేమి చేయాలో తెలుసుకున్నారు. ఏమి చేయాలనుకుంటున్నారో జనాలకు తెలిపారు. జనం నాడి గుర్తించి జననేతగా ఎదిగేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే అధికారం అనే మాటను గ్రహించి విశ్వసనీయతతో పాలన సాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎండల తీవ్రతను, భారీ వర్షాలను, వణికించే చలిని ఇలా అన్ని కాలాల్లోనూ పాదయాత్ర చేశారు. అదే రీతిలో అప్పుల సమస్య, కరోనా కష్టాలు సహా అనేక సమస్యల మధ్య పాలన సాగిస్తున్నారు. సమస్యలున్నా యాత్ర చేసినట్టే ఆటంకాలున్నా పాలనను గాడిలో పెట్టడమే కర్తవ్యంగా సాగుతున్నారు.
ప్రతికూల వాతావరణంలోనూ సడలనీయక పాదయాత్ర సాగింది. అదే రీతిలో పాలన నడుస్తోంది. అభివృద్ధికి కొత్త అర్థాలు చెప్పే రీతిలో విద్యా, వైద్య రంగాలను చక్కదిద్దే ప్రయత్నం సాగుతోంది. నాడు-నేడు అన్నట్టుగా ప్రజల ముందు ఫలితాలు సాక్షాత్కరిస్తున్నాయి. ఇక పాలన ప్రజల ముంగిటకు తీసుకెళ్లే సచివాలయ వ్యవస్థ, గుమ్మం ముందున నిలబెట్టే వాలంటరీ వ్యవస్థ జగన్ మార్క్ మార్పులకు నిదర్శనాలుగా ఉన్నాయి. సంక్షేమానికి లోటు లేకుండా, అభివృద్ధి మార్గాలు వేస్తూ అందరికీ సమపాళ్లలో ఫలితాలు అందించేందుకు అవినీతి లేని పారదర్శకత పాలనలో చూపడం జగన్ తీరుని తేటతెల్లం చేస్తోంది. పాదయాత్రలో ఆనాటి ప్రభుత్వం మీద చేసిన విమర్శలకు సమాధానంగా ఇల్లు లేని పేదలు లేకుండా చేయాలనే పట్టుదల దర్పణం పడుతోంది. జనాలతో సాగుతూ, జనం మధ్య నడుస్తూ, జనం మధ్య నిలిచిన జగన్ ఇప్పుడు జనం కోసమే అనేక వ్యవస్థలను ఎదుర్కొంటూ అడుగులేస్తున్న తీరు ప్రజలు అర్థం చేసుకునేలా చేస్తోంది.
ఇప్పటికే పాదయాత్ర ఫలితం సాధారణ ఎన్నికల్లో చూశాం. జగన్ పాలనా తీరు మూలంగా వరుసగా స్థానిక ఎన్నికలు, ఉప ఎన్నికల్లో డిస్టెంక్షన్ లో పాస్ అవుతున్నట్టుగా ప్రజలు మార్కులేస్తున్న వైనం గమనిస్తున్నాం. రాబోయే కాలంలో కూడా జగన్ మరింత ప్రజా శ్రేయస్సుకి అనుగుణంగా పాలనా విధానం చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్నింటికీ ఈ పాదయాత్ర ఓ దిక్సూచిగా ఉంటుందని చెప్పవచ్చు. ఆనాడు తన దృష్టికి వచ్చిన సమస్యలకు సమాధానమే ఆయన పథకాలను భావించవచ్చు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అందరికీ సంక్షేమం అందించేందుకు తీసుకున్న చొరవ ఆయనకు పాదయాత్ర నేర్పిన పాఠంగా అనుకోవచ్చు. మ్యానిఫెస్టో విడుదల చేయడమే గాకుండా దానిని అమలుచేసి చూపాలనే ఆయన సంకల్పానికి పాదయాత్ర లో చెప్పిన మాటలే మూలం కావచ్చు. ఏమయినా జగన్ లో కూడా మార్పులు తీసుకొచ్చి. అటు పార్టీ శ్రేణులకు, ఇటు సామాన్య జనాలకు దగ్గరగా మార్చిన యాత్ర ఓ అనుభవం మాత్రమే కాదని ఆయన ఆచరణ చెబుతోంది. ఓ పాఠం, భవిష్యత్తు ఏపీకి మార్గదర్శనంగా నిలుస్తోందని భావించవచ్చు.
Also Read : Praja Sankalpa Padayatra – జగన్ తొలి అడుగుకు నాలుగేళ్లు.. సంక్షేమ రూపు రేఖలే మారిపోయాయి!