టైమ్స్ సంస్థ ప్రచురించిన ప్రపంచవ్యాప్తంగా తప్పక చూడాల్సిన వంద సినిమాల్లో చోటు దక్కించుకున్న నాయకుడు సినిమా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తరాలతో సంబంధం లేకుండా మూవీ లవర్స్ అయిన ప్రతి ఒక్కరు ఈ మూవీని కనీసం రెండు మూడు సార్లైనా చూసి ఉంటారు. సుప్రసిద్ధ గ్యాంగ్ స్టర్ వరదరాజన్ ముదలియార్ ని స్ఫూర్తిగా తీసుకుని మణిరత్నం చెక్కిన ఈ సెల్యులాయిడ్ వండర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక నెగటివ్ క్యారెక్టర్ ని పాజిటివ్ కోణంలో చూపించడమనే ట్రెండ్ దీన్నుంచే మొదలయిందనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకనుకుంటున్నారా. అసలు విషయానికి వద్దాం.
ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో మూడు సినిమాల విడుదలతో సందడి చేయబోతున్న నితిన్ తర్వాత పవర్ పేట అనే మల్టీ లాంగ్వేజ్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. రౌడీ ఫెలో రూపంలో డెబ్యూతోనే ఆకట్టుకున్న రచయిత కం దర్శకుడు కృష్ణ చైతన్య ఈ స్క్రిప్ట్ మీద చాలా కాలంగా వర్క్ చేస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన చల్ మోహనరంగా నిరాశ పరిచినప్పటికీ పవర్ పేట కథ నచ్చడంతో నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది బాహుబలి, కెజిఎఫ్ తరహాలో రెండు భాగాలుగా వస్తుంది. షూటింగ్ కూడా దానికి అనుగుణంగానే ప్లాన్ చేసుకున్నారు. రెండు భాగాల విడుదలకు మాత్రం కొంత గ్యాప్ ఉంటుంది.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం పవర్ పేట గుంటూరు బ్యాక్ డ్రాప్ లో రౌడీయిజం, మాఫియా ప్రధానాంశాలుగా సాగుతుందట. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో నితిన్ మాట్లాడుతూ తాను 20 నుంచి 60 ఏళ్ళ వయసుల్లో తన పాత్రలో కనిపిస్తానని చెప్పాడు. నాయకుడులో కూడా హీరో క్యారెక్టర్ వీరయ్య నాయుడు చిన్నతనం నుంచి టీనేజ్ దాకా మధ్యవయసు నుంచి ముసలివాడై చనిపోయేదాకా ఒక బయోపిక్ స్టైల్ లో సాగుతుంది. పవర్ పేట అదే కథ కాకపోయినా ఫార్మాట్ మాత్రం అలాగే ఉంటుందని ఇన్ సైడ్ టాక్. ఏదైతేనేం నితిన్ ఛాలెంజింగ్ అనిపించే సబ్జెక్టునే ఎంచుకున్నాడు. దీని విడుదల వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఉండే అవకాశం ఉంది