ఈ రోజు మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పల రాజులను మంత్రులుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. వారికి శాఖలు కూడా కేటాయించింది.
ఆది నుంచి చర్చ జరుగుతున్నట్లుగా మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు ప్రమోషన్ దక్కింది. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలను సీఎం జగన్ అప్పగించారు. ఇప్పటి వరకు ధర్మాన పర్యవేక్షిస్తున్న రోడ్లు, భవనాల శాఖను బీసీ శాఖ మంత్రి శంకర నారాయణకు, శంకర నారాయణ శాఖను నూతన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు కేటాయించారు. ఇక మత్య్సకార సామాజికవర్గానికి చెందిన మోపీదేవీ వెంకట రమణ నిన్నటి వరకూ పర్యవేక్షించిన మత్స్యశాఖ, మార్కెటింగ్ శాఖలను ఆయన స్థానంలో నూతనంగా నియమించిన సీదిరి అప్పలరాజుకు కేటాయించారు.
మొత్తం మీద సీఎం జగన్ శాఖల కేటాయింపులో పెద్దగా మార్పులు చేయనప్పటికీ వేణు, శంకరనారాయణకు కేటాయించిన శాఖల్లో మాత్రం చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ధర్మాన కృష్ణదాస్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి.. పిల్లి సుభాష్ చూసినశాఖలనే ఆయనకు అప్పగిస్తారని అందరూ అంచనా వేశారు. అలాగే జరిగింది. కృష్ణదాస్ శాఖలను వేణుకు ఇస్తారని భావించారు. అయితే ధర్మాన శాఖలను శంకరనారాయణకు, శంకర నారాయణ శాఖలను వేణుకు సీఎం జగన్ కట్టబెట్టారు.