iDreamPost
iDreamPost
ఏపీ రాజకీయాల్లో పాలక వైసీపీ పలువురు నేతలు చూస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నాయకత్వం మట్ల నమ్మకం కోల్పోతున్న నేతలంతా మళ్లీ అధికారం వైపు వలసలకు సిద్ధం అవుతున్నారు. జనసేన నేతలు కూడా అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఈ జాబితాలో గతంలో తెలుగుదేశం అధికారంలో ఉండగా ఆపార్టీ పంచన చేరిన నేతలు కొందరయితే, మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరుపున బరిలో దిగి ఓటమి పాలయిన వారు మరికొందరున్నారు. వీరిలో ఇప్పటికే కొందరికి వైసీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంకా కొందరు వెయిటింగ్ లిస్టులో ఉన్నట్టు కనిపిస్తోంది
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ పంచన చేరిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ కి జగన్ నుంచి క్లియరెన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఆయన త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు. మాలమహానాడు నాయకుడిగా పలు కార్యక్రమాలు నిర్వహించిన శివాజీకి చంద్రబాబు హయంలో గుర్తింపు దక్కింది. కానీ ఆయన మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశించినప్పటికీ సీటు దక్కలేదు. ఈ పరిస్థితుల్లో విపక్ష టీడీపీలో కొనసాగడం కంటే వైసీపీలో చేరి తన చైర్మన్ పదవి కాపాడుకోవాలనే లక్ష్యంతో ఆయన ఉన్నట్టు కనిపిస్తోంది.
ఇక మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరుపున పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నేలపూడి స్టాలిన్ , జనసేన తరుపున పెందుర్తి నుంచి బరిలో దిగిన మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య వంటి వారు తమ పార్టీలకు రాజీనామా చేశారు. వైసీపీ తలుపులు తెరిస్తే దూకేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలతో మంతనాలు జరుపుతున్నారు. వారితో పాటుగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పితాని సత్యన్నారాయణ, విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, యలమంచలి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వంటి వారు కూడా కండువా మార్చేయడానికి ఎదురుచూస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. వీరిద్దరూ మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
ఆయా నియోజకవర్గాలలో వైసీపీ నేతల నుంచి కొంత వ్యతిరేకత ఉండడంతో ఈ లిస్టులో ఇంకా పలువురి పేర్లు ఉన్నప్పటికీ చేరికలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగి ఓటమి పాలయిన వరుపుల రాజా ఆపార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని ఉత్సాహపడినప్పటికీ, వైసీపీ అధిష్టానం నో చెప్పేసింది. స్థానికంగా ఉన్న పరిస్థితులతోనే అలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. దాంతో ప్రస్తుతం ఎదురుచూస్తున్న నేతలకు కూడా పార్టీలో పరిస్థితిని చక్కదిద్దిన తర్వాత అవసరాన్ని బట్టి పలువురికి పచ్చజెండా ఊపడానికి జగన్ రంగం సిద్ధం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. వైసీపీలో ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వం ఉన్న నేపథ్యంలో కొత్త నీరు చేరికతో ఆపార్టీ వ్యవహారాల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో చూడాలి.