iDreamPost
android-app
ios-app

కుప్పకూలిన కురువృద్ధుడి రాజకీయ జీవితం- మాజీ సీఎం బాదల్ కు తొలి, చివరి ఓటమి

  • Published Mar 11, 2022 | 9:06 AM Updated Updated Mar 11, 2022 | 9:17 AM
కుప్పకూలిన కురువృద్ధుడి రాజకీయ జీవితం- మాజీ సీఎం బాదల్ కు తొలి, చివరి ఓటమి

ఆయనో రాజకీయ కురువృద్ధుడు.. జీవితంలో అధికభాగం రాజకీయాల్లోనే గడిపారు. ఓటమి ఎరుగని ధీరుడిగా, పంజాబ్ రాజకీయాల్లో మేరు నగధీరుడిగా పేరుపొందారు. అకాలీదళ్ కు తిరుగులేని నేతగా, పదిసార్లు ఎమ్మెల్యేగా, నాలుగు దఫాల్లో రెండు దశాబ్దాల పాటు సీఎంగా రాష్ట్రాన్ని శాసించిన యోధుడు చివరికి సామాన్యుడి చీపురు ధాటికి తల వంచారు. జీవితంలో తొలిసారి ఓటమి రుచి చూశారు. 95 ఏళ్ల ముదిమి వయసులో.. 11వ సారి ఎమ్మెల్యే అవుదామన్న ఆయన ఆశలు ఆప్ గాలిలో కొట్టుకుపోయాయి. ఆయన రాజకీయ జీవితానికి ముగింపు పలికాయి. ఆయన మరెవరో కాదు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్. అంతేకాదు 1992 తర్వాత బాదల్ కుటుంబీకులు అసెంబ్లీలో లేకుండా పోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.

20 ఏళ్లకే రాజకీయాల్లోకి

పంజాబ్ ప్రజలకు చిరపరిచితుడైన ప్రకాష్ సింగ్ బాదల్ 20 ఏళ్ల యువకుడిగా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1927 డిసెంబరులో జన్మించిన ఆయన 1947లో స్వగ్రామమైన బాదల్ కు తొలిసారి సర్పంచుగా ఎన్నికయ్యారు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ సీఎం పీఠానికి చేరుకున్నారు. సర్పంచ్ అయిన నాలుగేళ్ల తర్వాత సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1957లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అప్పటినుంచీ చట్టసభలకు ఎన్నికవుతూనే ఉన్నారు. 65 ఏళ్లుగా చట్టసభ సభ్యుడిగా కొనసాగారు. 2017 ఎన్నికల్లోనూ సొంత నియోజకవర్గమైన లాంబి నుంచి ఎన్నికై ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయన ప్రస్తుత ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి 11వ సారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఆప్ గాలిని తట్టుకోలేక 10వేల ఓట్ల తేడాతో జీవితంలో తొలిసారి ఓటమి భారాన్ని మూటగట్టుకున్నారు.

నాలుగుసార్లు సీఎంగా

1970లో తొలిసారి ముఖ్యమంత్రి పదవి అధిష్టించిన బాదల్ ఏడాది కాలమే ఆ పదవిలో కొనసాగారు. అప్పట్లో అకాలీదళ్ కు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ మాతృసంస్థ జనసంఘ్ మద్దతు ఉపసంహరించడంతో బాదల్ ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వచ్చింది. 1977లో కొన్ని నెలలపాటు కేంద్రమంత్రిగా పనిచేశారు. కాగా 1997 నుంచి 2012 మధ్య జరిగిన మూడు ఎన్నికల్లో అకాలీదళ్ కూటమి విజయం సాధించడంతో బాదల్ ఆ ముడుసార్లూ సీఎం అయ్యారు. 2017 ఎన్నికల్లో అకాలీ-బీజేపీ కూటమి ఓటమి చెందడంతో సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

పంజాబ్ రాజకీయాల్లో చెరగని ముద్ర

స్వాతంత్ర్యానంతరం పంజాబ్ రాష్ట్ర రాజకీయాల్లో, ఆ రాష్ట్ర సామాజిక, రాజకీయ పరిణామాల్లో బాదల్ కీలకపాత్ర పోషించి చెరగని ముద్ర వేశారు. 1947 నుంచి 1966 మధ్య రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధిపత్యం చేలాయిస్తే 1967 తర్వాత అకాలీదళ్ ఆధిపత్యం ప్రదర్శించింది. 1970 నుంచి రాష్ట్రంలో అకాలీదళ్ గెలిచిన ప్రతిసారీ ప్రకాష్ సింగ్ బాదల్ సీఎం పదవి చేపట్టారు. 1980లలో ఖలిస్తాన్ ఉద్యమం, పలుమార్లు రాష్ట్రపతి పాలన విధించడంతో ప్రజాప్రభుత్వాలు ఏర్పడలేదు. పరిస్థితులు కుదుటపడిన అనంతరం 1992లో జరిగిన ఎన్నికలను అకాలీదళ్ బహిష్కరించడంతో 87 స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే 1997 నుంచి 2017 వరకు బీజేపీతో కూటమి కట్టి బాదల్ నేతృత్వంలో అకాలీదళ్ అధికారంలో కొనసాగింది.

వృద్ధాప్యంలోనూ చురుగ్గా..

వయసు మీద పడినా బాదల్ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఎన్డీయే కూటమి నుంచి అకాలీదళ్ ను బయటకు తీసుకొచ్చారు. ఆ చట్టాలకు నిరసనగానే 2015లో కేంద్రం తనకు ఇచ్చిన పద్మవిభూషణ్ పురస్కారాన్ని 2020లో వాపసు ఇచ్చేశారు. చివరికి వ్యవసాయ చట్టాల ప్రభావం, ఆప్ వైపు ప్రజలు మొగ్గు చూపడం వంటి కారణాలు బాదల్ ఓటమికి దారితీశాయి.

కుటుంబ పార్టీగా అపఖ్యాతి

అకాలీదళ్ పార్టీ, ఆ ప్రభుత్వాలు బాదల్ కుటుంబ సభ్యులతో నిండిపోయాయన్న ఆరోపణలు, అసంతృప్తి ఉన్నాయి. ప్రకాష్ సింగ్ బాదల్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ ఉప ముఖ్యమంత్రిగా, కజిన్ మన్ ప్రీత్ సింగ్ బాదల్ ఆర్థికశాఖ మంత్రిగా ఉండేవారు. ఇంకా పలువురు బాదల్ కుటుంబ సభ్యులు, బంధువులు పలు కీలక పదవుల్లో ఉండేవారు. కాగా ఈసారి ప్రకాష్ సింగ్ తో పాటు కుమారుడు, ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్, మన్ ప్రీత్ సింగ్ తదితరులందరూ ఓటమి పాలయ్యారు. బాదల్ కుటుంబీకులు అసెంబ్లీలో లేకుండా పోవడం మూడు దశాబ్దాల్లో ఇది తొలిసారి. అంతకుముందు 1992 ఎన్నికలను అకాలీదళ్ బహిష్కరించడంతో ఆనాటి అసెంబ్లీలో కూడా బాదల్ కుటుంబీలకు చోటు లభించలేదు.

ఇప్పటికే 95 ఏళ్ల వయసున్న బాదల్ రాజకీయాలు ఇక చేయలేరేమో. సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానానికి ఆ ఓటమి ముగింపు కావడం బాధాకరం.