iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన విధానాన్ని కొనసాగిస్తోంది. బెనిఫిట్ షో ల పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడడాన్ని అడ్డుకుంటోంది. ఇప్పటికే అఖండ, పుష్ప సినిమాల విషయంలో కొనసాగించిన పంథానే భీమ్లానాయక్ కి కూడా వర్తింపజేయాలని నిర్ణయం తీసుకుంది. దాంతో సామాన్య ప్రేక్షకుల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసి, మొదటి వారంలోనే లాభాలు గుంజాలనే అత్యాశకు పోతున్న వారి ఆశలు అడియశలవుతున్నాయి. ప్రేక్షకులను మెప్పించి, రిటర్న్ ఆడియెన్స్ ని కూడా సాధించిన సినిమాలకే అవకాశం ఉంటుందని ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలు చాటుతున్నాయి.
మరో రీమేక్ సినిమాతో పవన్ కళ్యణ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకు వారం రోజుల పాటు అదనపు షోలు వేసుకునేందుకు తెలంగాణా ప్రభుత్వం అనుమతినిచ్చింది. రోజూ 5 షోలు వేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. సహజంగా 5 షోలకు అనుమతి తీసుకుని ఎగ్జిబిటర్లు ఆరు షోలు నడిపేందుకు ప్రయత్నిస్తారనడంలో సందేహం లేదు. కానీ ఏపీ ప్రభుత్వం నిర్ణీత సమయంలో వేసే నాలుగు షోలు మినహా అదనంగా షోలు వేయడానికి లేదని తేల్చేసింది. తద్వారా బెనిఫిట్ షో ల పేరుతో ఫ్యాన్స్ నుంచి భారీగా వసూళ్ళకు పాల్పడాలని చేసిన ప్రయత్నాలకు బ్రేకులు పడ్డాయి.
బెనిఫిట్ షోల తో పాటుగా సినిమా టికెట్ ధరల విషయమై ఇటీవల ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ విమర్శించారు. పైగా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీసుకున్ణ నిర్ణయాలంటూ సర్కారు స్పష్టం చేస్తున్నప్పటికీ అది తనకోసమేన్నట్టుగా పవన్ భావించారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం టాలీవుడ్ పెద్దలతో చర్చించి టికెట్ల విషయంలో కొంత ఉపశమనం కల్పించే దిశలో అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో విడుదలవుతున్న భీమ్లానాయక్ సినిమాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తన పద్ధతిని కొనసాగిస్తూ అదనపు షోలు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. నిబంధనలు పాటించాలని ఆదేశించింది.