Idream media
Idream media
నలభై ఏళ్ల రాజకీయ అనుభవం నాది.. అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పదే పదే చెప్పే స్టేట్ మెంట్. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన తొలి ఎన్నికల ప్రచారంలో బాబు ప్రధాన ఆయుధం అదే. ఆ ఎన్నికలలో అది ఫలించింది కూడా.
తన అనుభవంతో కొత్త రాష్ట్రానికి ఏదో చేస్తారని నమ్మిన ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. ఐదేళ్ల కాలంలో ఏ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. అమరావతిని రాజధానిగా ప్రకటించి గ్రాఫిక్స్ లో జిమ్మిక్కులు చూపించారు. వాస్తవ పరిస్థితికి ఆ గ్రాఫిక్స్ చాలా దూరంగా ఉన్నాయి. ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరం లేదని భావించిన ప్రజలు తర్వాతి ఎన్నికల్లో జగన్ కు పట్టం కట్టారు. ఏపీ సీఎం అయ్యాక జెట్ స్పీడులో సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తున్న జగన్ 30 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు.. ఇళ్లు కట్టి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయింది. లక్షలాది మంది తమ సొంతింటి కల నెరవేరబోతోందని సంతోషంలో మునిగినప్పుడల్లా చంద్రబాబునాయుడు టీడీపీ నేతలతో కేసులు వేయించి అడ్డగిస్తున్నట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
మరి ఈ పేదల సంతోషం బాబుకు అక్కర్లేదా..?
ఇక అసలు విషయంలోకి వస్తే… టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబునాయుడు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 175 నియోజకవర్గాల ఇన్ చార్జిలతో మాట్లాడారు. ఇళ్ళ కోసం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు. టీడీపీ పేదల కోసం నిర్మిస్తున్న టిడ్కో గృహాలను నిరుపేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. “నా ఇల్లు నా సొంతం”, “నా స్థలం నాకు ఇవ్వాలి” అంటూ రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు.
ప్రజాందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించాలని చెప్పిన చంద్రబాబు, లబ్ధిదారులైన పేద కుటుంబాలకు టిడిపి నేతలు అండగా ఉండి పోరాటం సాగించాలని సూచించారు. పేదల పక్షాన ఉండి పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం మంచిదే. మరి అలాంటి పేద కుటుంబాలకు చెందిన 30 లక్షల మంది గురించిన ఆలోచన చంద్రబాబుకు లేదా..? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇక్కడ కూడా ఎందరో పేదలు ఇళ్ల స్థలాలు తమ చేతికి అందుతున్నాయని సంబర పడ్డారు. కోర్టులో కేసులు వేయకపోతే ఇప్పటికే లబ్ధిదారుల పేరు మీద ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ జరిగేది. వెంటనే ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన చర్యలు కూడా ప్రారంభమయ్యేవి.
తన హయాంలో పేదలకు కేటాయించిన ఇళ్ల కోసం ఇంతలా ఆందోళన చేస్తున్న చంద్రబాబునాయుడు మరి ఇప్పుడెందుకు స్పందించడం లేదు. తన అనుభవాన్ని రాజకీయంగా ఉపయోగపడే కార్యక్రమాలపైనే ఆయన పెడుతున్నారా..? లేదా పేదలలో కూడా తేడాను చూపుతున్నారా..? టిడ్కో ఇళ్లను ఇస్తే టీడీపీకే మంచి పేరు వస్తుందన్న అక్కసుతో వైసీపీ సర్కార్ వ్యవహరిస్తుందని ఇదే సమావేశంలో విమర్శించిన చంద్రబాబు.. ఆ 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అందిస్తే జగన్ కు ఇక ఏపీలో తిరుగు ఉండదనే కేసులతో అడ్డుకుంటున్నారని భావించాలా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.