iDreamPost
android-app
ios-app

‘ఓటర్‌’కి ఏం కావాలి బా..

  • Published Nov 11, 2020 | 10:57 AM Updated Updated Nov 11, 2020 | 10:57 AM
‘ఓటర్‌’కి ఏం కావాలి బా..

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు గంటగంటకు మారిపోతున్నాయి. టీవీల్లో చూపించి లైవ్‌ అప్‌డేట్‌లు బీపీ పెంచేస్తున్నాయి కిట్టయ్యకు.. సరిగ్గా ఆ సమయంలో వచ్చాడు మణి.

వచ్చీరావడంతోనే బావా.. బావా.. అసలు ఓటర్‌కి ఏం కావాలంటావ్‌..? అంటూ ప్రశ్నలడగడం మొదలెట్టాడు. ఓరేయ్‌ మణీ కాస్త ఆగరా ఇక్కడ బీజేపీ, టీఆర్‌ఎస్‌లలో ఎవరు గెలుస్తారో తెలియక టెన్షన్‌లో ఉన్నాన్రా.. ఫలితాలు తేలిపోయాక మాట్లాడుకుందా.. ఆగరా..అంటూ మణిని బతిమాలుకున్నాడు కిట్టయ్య..

కిట్టయ్య బావ పరిస్థితి చూసి ఇంకేమీ అడక్కుండా ఉగ్గబట్టుక్కూర్చున్నాడు మణి.

తీరా రెండు ఈవీయంలు పనిచేయకపోవడంతో అధికారిక ఫలితం తేలడం లేదని అప్‌డేట్‌ వచ్చింది. దీంతో టెన్షన్‌ ఇంకా పెరిగిపోతున్నప్పటికీ.. టెన్షన్‌ తగ్గించుకునేందుకు ఏం చేయాలో తెలియక.. ఒరేయ్‌ మణీ ఇందాక ఏదో అడిగావ్‌ ఏంట్రా అది అంటూ కదిపాడు కిట్టయ్య..

అదే బావా.. నాకు సమాధానం చెప్పేసి ఉంటే.. ఫలితాలు ఈ పాటికే వచ్చేసేవి. ఇందాక నన్ను పట్టించుకోలేదు కాబట్టి రెండు ఈవీయంలు పనిచేయలేదు. అంటూ ఉడికించే ప్రయత్నం చేసాడు మణి.

అది సరేలేరా.. ఇందాకేదో అడిగావ్‌ ఏంటది అంటూ మళ్ళీ రెట్టించాడు కిట్టయ్య.

అదే బావా అసలు ఓటర్‌కి ఏం కావాలంటావ్‌.. అదే ఏం కోరుకుంటాడంటావ్‌.. అంటూ ఆగాడు మణి.

‘‘ఉగాది పచ్చడి’’రా అంటూ ఠక్కున చెప్పేసాడు కిట్టయ్య.

అదేంటి బావా ఓటేసేందుకు ఉగాది పచ్చడి కోరుకుంటాడా? పాపం ఇది తెలియక టీఆర్‌ఎస్‌ వాళ్ళు మొట్టమొదటి సారిగా ఉప ఎన్నికల్లో ఓడిపోయారు బావోయ్‌.. అంటూ ఆశ్చర్యంగా ముఖం పెట్టాడు మణి.

ఉగాది పచ్చడి అంటే తెలుగు సంవత్సరాదికి చేసుకునే ఉగాది పచ్చడి కాదురా మణీ.. కొంచెం తీపి, కొంచెం వగరు, కొంచెం పులుపు, కొంచె కారం.. ఇలా అన్ని రుచులను మేళవించిన పాలననే కోరుకుంటార్రా అంటూ తాను చెప్పిన ఉగాది పచ్చడి రహస్యాన్ని విప్పేసాడు కిట్టయ్య.

అంటే బావా టీఆర్‌ఎస్‌ ఈ తరహాలో పాలన చేయడం లేదంటావా.. అన్నాడు మణి.

అందుకే కదరా దుబ్బాక జనం ఈ రేంజ్‌లో తీర్పు చెప్పారు అన్నాడు కిట్టయ్య.

అర్ధం కాలేదు బావా.. కొంచెం వివరంగా చెప్పు.. అంటూ ఆసక్తిగా కుర్చీ ముందుకు జరుపుకున్నాడు మణి.

ఒరేయ్‌.. బాబూ.. నెవ్వెక్కడెక్కడో తిరిగొస్తుంటావ్‌.. ఆరడుగుల భౌతికదూరం పాటించరోయ్‌ అంటూ వేళాకోళమాడాడు కిట్టయ్య.

అది సరేలే బావా విషయం చెప్పు ముందు అంటూ ముందుకొచ్చాడు మణి.

ఓరేయ్‌ మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన పరంథామయ్యగార్ని కలిసినప్పుడు ఓ మాట చెప్పాడురా.. ‘‘ఓరేయ్‌ అబ్బీ మూడొందల అరవైఅయిదు రోజులు ఓటరుకు అందుబాటులో ఉండాలి.. వాళ్ళకు కోపం వచ్చి ముఖంమీద ఊస్తే తుడిచేసుకోవాలి.. వాళ్ళను ప్రసన్నం చేసుకోవాలి.. ఎన్నికల లాంఛనాలన్నీ అప్పగించాలి.. తీరా బూత్‌లోకి వెళ్ళాక వాళ్ళెవరికి వెయ్యాలనుకుంటారో.. వాళ్ళకే వేస్తార్రా..’’ అంటూ చెప్పుకొచ్చాడ్రా పెద్దాయన. అంటూ కొద్దిసేపు ఆగాడు కిట్టయ్య.

బావా.. నువ్వు చెప్పింది ఇంకా నాకు అర్ధం కాలే బావా.. అన్నాడు మణి.

ఒరేయ్‌ బాబూ.. ఇంత క్లియర్‌గా చెప్పినా ఇంకా అర్ధం కాలేదా.. పరంథామయ్యగారు చెప్పినట్టు చేస్తే ఓటరు కనికరిస్తాడు, లేకపోతే అంతేరా.. అన్నీ నా నోటితోనే చెప్పిస్తావు నువ్వూ.. నీ తెలివితేటలూ.. అంటూ టీవీ కట్టేసి తువ్వాలు భుజం మీదేసుకుని పొలం బయలుదేరాడు కిట్టయ్య.