iDreamPost
android-app
ios-app

‘దగ్గరి’ దారి కోసమేనా ఈ ప్రయత్నం

  • Published Sep 11, 2020 | 12:33 PM Updated Updated Sep 11, 2020 | 12:33 PM
‘దగ్గరి’ దారి కోసమేనా ఈ ప్రయత్నం

విజయానికి దగ్గర దార్లుండవు అన్నది పెద్దలు చెప్పే మాట. కానీ రాజకీయాల్లో విజయం సాధించేందుకు దగ్గరి దార్లను మాత్రమే కొందరు నమ్ముకుంటుంటారు. వీరి ప్రయత్నం విజయవంతం అవ్వొచ్చు, అవ్వకపోవచ్చు. అయితే అదే ఇంకొందరికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఫలితం రాకపోతే నాయకులు చరిత్రలో కలిసిపోతారు.

ప్రజల్లో అమోఘమైన ప్రతిష్టను పోగుచేసుకుంటున్న ప్రభుత్వంపై బురదజల్లడం ద్వారా తక్కువ సమయంలోనే తమను తాము నిరూపించుకోవచ్చనే ప్రయత్నాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అధికమయ్యాయన్న వాదనలు విన్పిస్తున్నాయి. అందుకు తగ్గ వాతావరణం కూడా కన్పిస్తోంది. తొమ్మిదేళ్ళ పాటు అన్నిరకాల ఎదురు దెబ్బలకు ఎదురొడ్డి, మూడున్నర వేల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర ద్వారా ప్రజల మనస్సుల్లో చెరగని ముద్రవేసుకున్నాడు ఏపీ సీయం వైఎస్‌ జగన్‌.

ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపర్చుకుంటూ పదవినెక్కిన నాటి నుంచే సంక్షేమ పథకాలతో హోరెత్తిస్తున్నారు. దీంతో ఎంతో అనుభవజ్ఞులమని చెప్పుకున్నవాళ్ళకు గానీ, సినీ గ్లామర్‌ ఉన్నోళ్ళుగానీ, జాతీయ పార్టీ అండ ఉన్నాగానీ.. జగన్‌ ఉధృతిని తట్టుకు నిలబడి జనంలోకి చొచ్చుకు వెళ్ళగలిగే పరిస్థితులు ప్రత్యర్ధి పార్టీలకు కన్పించడం లేదు. దీంతో కొంగొత్తదారులు వెతుక్కునే పనిలో వారంతా తలమునకలై ఉన్నారన్నది అధికార పక్షం నాయకులు చెబుతున్న మాట.

నిర్మాణాత్మక ప్రతిపక్షంగగా వ్యవహరించే సత్తాను ఇప్పుడున్న ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు నిరూపించుకోలేకపోయిందన్నది వారి భావన. అధినాయకుల తీరుతో క్షేత్రస్తాయి కేడర్‌ కాడొదిలేసిన పార్టీ ఒకటైతే, ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నా, గ్రౌండ్‌లెవల్‌లో నిర్మాణం కాని పార్టీ మరోకటి. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు ఆయా పార్టీలు దగ్గర దారుల కోసం అన్వేషణలో ఉన్నాయన్న నిశ్చితమైన అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో భాగంగానే ప్రకృతి విపత్తులు, ఆకతాయిలు, మతిస్థిమితం లేని వాళ్ళు చేసే చర్యలకు కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అన్నట్టుగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. అతి సున్నితమైన అంశాలను కూడా తమ ‘రాజకీయం’కోసం వాడుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు నీతి వాఖ్యలు వల్లెవేస్తున్న కొందరు నాయకులు అధికారంలో ఉండగా వెలగబెట్టిన ఘన కార్యాలు ఇంకా బెజవాడ రోడ్లపై అక్కడక్కడా శిధిలాలుగా కన్పిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ తాను మాత్రం ఫలానా ధర్మాన్ని కాపాడేందుకు కంకణం కట్టుకున్న వాళ్ళకు మల్లె మైకందుకుంటుండడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.

ఏదైనా దుర్ఘటన జరగడం ఎప్పుడైనా దురదృష్టకరమే. అది మత ప్రాతిపదిక అయినా, కుల ప్రాతిపదిక అయినా, మరింకో ప్రమాదమైనా దాన్ని అందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిందే. కానీ ఇటువంటి దురదృష్టకర ఘటనలు జరిగాక అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది, బాధితులను ఆదుకునేందుకు తీసుకుంటున్న చర్యలు, లేదా సంబంధిత నిందితుల పట్ల చేపడుతున్న చట్టరీత్యా చర్యలు తదితర వాటన్నింటినీ పరిశీలించి ప్రతిస్పందిస్తే ప్రజల్లో మంచి భావన ఏర్పడుతుంది. అంతే గానీ ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ నిరసనలు, ఆందోళనలకు పిలుపునిస్తే.. అమాయకజనం దాన్నందుకుని రోడ్డెక్కితే ఇప్పుడున్న కరోనా మహ్మరి మరింతగా విజృంభిస్తే అప్పుడెవరు బాధ్యత వహిస్తారో? సదరు నాయకులే తేల్చిచెప్పాలి.

‘‘ఎక్కడైనా అధికారంలో ఉన్నోళ్ళిచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రతిపక్షాలు రోడ్డెక్కి పోరాటాలకు సిద్ధపడతాయి. కానీ ఏపీలో మాత్రం ప్రకృతి విపత్తులు, ఆకతాయి చర్యలకు కూడా ప్రభుత్వాన్నే బాధ్యులుగా చేసి పోరాటాల పేరుతో రోడ్డెక్కుతున్నాయని రాష్ట్ర కాపుకార్పొరేషన్‌ ఛైర్మన్‌ జక్కంపూడి రాజా అన్నారు.. ఇది వింటున్న ప్రజలకు కూడా అవును కదూ.. అనుకోకుండా ఉంటారా?