iDreamPost
iDreamPost
భారతదేశ రాజకీయాలలో స్వామీజీలది మొదటి నుంచి పెద్ద పాత్రనే. జనతాపార్టీ నుంచి బయటకొచ్చిన పూర్వ జనసంఘీయులు స్థాపించిన భారతీయ జనతాపార్టీ రామజన్మభూమి రధయాత్రలతో పెద్ద ఎత్తున స్వామీజీలను తమ వైపు ఆకర్షించింది. అలా మొదలైన స్వామీజీల రాజకీయ ప్రయాణం 2017లో “గోరఖ పూర్” మఠానికి చెందిన యోగి ఆదిత్యా నాథ్ బీజేపీ తరుపున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కావటంతో పతాక స్థాయికి చేరింది.
స్వామీజీనా లేక రాజకీయ నేతనా ?
యోగి ఆదిత్యానాథ్ స్పూర్తితో తన రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకునేందుకు కాకినాడకు చెందిన స్వామి పరిపూర్ణానంద బీజేపీలో చేరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనధికారికంగా ప్రచారం పొంది బీజేపీ గెలవటం తాను ముఖ్యమంత్రి కావటం తరువాయి అన్నట్లు బహిరంగ సభలలో ప్రసంగాలు చేశారు.
“మీ పక్షాన నేనుంటాను,మీ మీద చేయిపడితే మొట్టమొదటి బలిదానం నాదే అవుతుంది ” కొదమసింహాల్లా పోరాడాలని ఉద్రేకంగా మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలకు పరిపూర్ణానంద ఉత్సహాన్ని ఇచ్చారు. ఆ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒకే ఒక సీట్ (రాజా సింగ్) సాధించటంతో పరిపూర్ణానంద తిరిగి కాకినాడకు చేరుకొని తమ శ్రీ పీఠం కు పరిమితమయ్యారు.
ఎవరు ఈ పరిపూర్ణానంద?
2013 వరకు పరిపూర్ణానంద పేరు గోదావరి జిల్లాల బయట పెద్దగా తెలియదు. కేరళకు చెందిన దంపతులకు నెల్లూరులో పుట్టిన పరిపూర్ణానంద గురుకులాల్లో సంస్కృత విద్య, రిషికేశ్ లో వేద పఠనం చేసినట్లు స్వామి పరిపూర్ణానంద చెప్పారు.1999లో కాకినాడ పట్టణంలో శ్రీ పీఠం ఏర్పాటు దగ్గర నుంచి ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ప్రవచనాలను , సాధారణ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించే పరిపూర్ణానంద 2003లో జరిగిన గోదావరి పుష్కరాలలో ఏకంగా నాలుగు నుంచి ఐదు లక్షలమందికి శ్రీ పీఠం తరపున అన్నదానం చేసే స్థాయికి పీఠాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసుకున్నారు, నాలుగేళ్ల లోనే ఈ పీఠం దినదిన అభివృద్ధి సాధించింది.
రాజకీయ యాత్ర …
2014 లోక్ సభ ,ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తుతో పోటీకి దిగగా జనసేన తరుపున పవన్ కళ్యాణ్ ఆ కూటమికి మద్దతు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పాలనలో జరిగిన కుంభకోణాలతో పాటు మతమార్పిడుల మీద బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.
సరిగ్గా ఆ సమయంలో మతమార్పిడులకు వ్యతిరేకంగా పరిపూర్ణానంద ఒక రాష్ట్ర వ్యాప్త యాత్రను చేపట్టారు.ఆ యాత్రలో ఆయన బహిరంగంగా రాజకీయాలు మాట్లాడకపోయినా ఆ యాత్ర మొత్తం టీడీపీ-బీజేపీ నేతల ఆధ్వర్యంలోనే నడిచింది. స్వామీజీ కూడా కాంగ్రెస్, వైసిపిల మీద పరోక్ష వ్యాఖ్యలతో ప్రసంగాలు చేశారు.
తెలంగాణా మీద దృష్టి …
ఆవిధంగా మొదలైన పరిపూర్ణానంద రాజకీయ ప్రసంగాలు 2017 నాటికి నేరుగా బీజేపీ నేతగా మారిపోయారు.ఒక టీవీ డిబేట్లో కత్తి మహేష్ చేసిన వాఖ్యలకు నిరసన పేరుతో మరో యాత్రకు సిద్దపడగా ప్రభుత్వం ఆ యాత్రకు అనుమతి ఇవ్వలేదు. అయినా స్వామీజీ యాత్రకు సిద్దపడటంతో ఆరు నెలలు నగర బహిష్కరణ విధించారు. ఈ యాత్ర కన్నా ముందే పోలీసులు కత్తి మహేష్ కు కూడా నగర బహిష్కరణ విధించారు అయినా కానీ పరిపూర్ణానంద యాత్రకు సిద్దపడటం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అని అధికార తెరాస నేతలు ఆరోపించారు.
2018 ఎన్నికలు …
2018 తెలంగాణా ఎన్నికల్లో పరిపూర్ణానంద స్వామీజీ నేరుగా బీజేపీలో చేరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం పొందారు. తన సహజ శైలిలో రెచ్చకొట్టే ప్రసంగాలు చాలా చేసేరు. 2014లో మద్దతు ఇచ్చిన చంద్రబాబు మీద కూడా విమర్శలు చేశారు. తెలంగాణా “ఇద్దరు చంద్రుల చేతుల్లో నలిగిపోయింది” 20 ఏళ్ళ నుంచి అభివృద్ధికి నోచుకోవటం లేదని, ఉత్తరప్రదేశ్లో మాదిరి తెలంగాణలో కూడా కమలం వికసిస్తుంది అన్నారు..
ఈ ప్రసంగాలు చూసిన వారికి 2016 చివరి నుంచి హిందూ మాత పరిరక్షణ పేరుతో చేసిన యాత్రలు,ప్రసంగాలు మొత్తం రాజకీయ ఉద్దేశ్యాలతో కూడినవే అని నిర్ధారణకు వచ్చారు .
జగన్ తిరుమల డిక్లరేషన్ మీద ఎందుకు రాద్ధాంతం..
హిందూయేతరులు తిరుమల వేంకటేశ్వరుని దర్శనం చేసుకోవటానికి తమకు విశ్వాసం ఉందని తెలియపరిచేలా సంతకం చేసే సాంప్రదాయం అనేక సంవత్సరాలుగా ఉన్నా 1990లో అది చట్టం గా మారింది. నాటి చట్టం ప్రకారం కుటుంబ పెద్ద ఒక్కసారి తమకు విశ్వాసం ఉన్నట్లు ప్రకటిస్తే వారి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా విశ్వాసాన్ని ప్రకటించవలసి అవసరం లేదు.
ముఖ్యమంత్రి హోదాలో అనేకసార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన వైఎస్ఆర్ కొడుకుగా ఆయనతో పాటు జగన మోహన్ రెడ్డి అనేకసార్లు తిరుమల దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో గత సంవత్సరం వస్త్రాలు కూడా సమర్పించారు. అయినా కానీ జగన్ తనకు హిందూ మతంపట్ల విశ్వాసం ఉందని మరో సారి డిక్లరేషన్ ఇవ్వాలని టీడీపీ, బీజేపీ నేతలు డిమాండ్ చేయటం కేవలం రాజకీయం.
డిక్లరేషన్ కొనసాగించమని అడిగే పద్దతి ఇదేనా?
టీటీడీ చైర్మన్ హిందూయేతరులు డిక్లరేషన్ ఇవ్వటం అనేది ప్రముఖుల విషయంలోనే జరుగుతుంది కానీ సామాన్యులకు డిక్లరేషన్ లేదని, దీని వలన పెద్దగా ఉపయోగం లేదన్న కోణంలో డిక్లరేషన్ అవసరం లేదు అన్నారు. దీని కొనసాగింపుగా మంత్రి కొడాలి నాని ఈ విషయం మీద చంద్రబాబు చేసిన ఆరోపణలను ఖండిస్తూ పరుషాపదాలు వాడారు.. ఈ మొత్తం వ్యవహారాన్ని వెంకటేశ్వర స్వామి మీద మరియు హిందూ వ్యతిరేక వాఖ్యలుగా చిత్రీకరించటానికి అటు టీడీపీతో పాటు బీజేపీ నేతలు తీవ్రప్రయత్నం చేస్తుండగా వారికి పరిపూర్ణానంద తోడయ్యారు.
నాయకుల మరణాల మీద పరిపూర్ణానంద తీవ్ర వాఖ్యలు…
హిందూ మతాన్ని,దేవుళ్లను అవమానిస్తే ఇందిరా గాంధీ ,వైఎస్ఆర్ లాగ దుర్మరణాలు(వాస్తవానికి చాలా తీవ్ర పదజాలం వాడారు) అంటూ శాపనార్ధాలు పెట్టారు.
ఇందిరా మరణం మీద అప్పటి మరియు ఇప్పటి ప్రతిపక్ష నేతలు కూడా ఇలాంటి వాఖ్యలను చేయలేదు. సిక్కు బాడీగార్డులను తన రక్షణ నుంచి తప్పిస్తే అది మొత్తం సిక్కు మతాన్ని అవమానించినట్లే అని తనకు ప్రాణహాని ఉందన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ను పక్కన పెట్టేశారు. తన పదునైన ప్రసంగాలతో పార్లమెంటులో ఇందిరా గాంధీ పైన మీద విమర్శలు చేసిన వాజ్ పాయ్ లాంటి నేత కూడా వ్యక్తిగతంగా ఇందిరను గౌరవించారు. బంగ్లాదేశ్ తో యుద్ధం తరువాత దుర్గామాత అంటూ అభినందించారు..
జీవితంలో కాంగ్రెస్ పార్టీకి,2009లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డికి కానీ ఓటు వేయని వారిని కూడా ఆయన మరణం కలిచివేసింది. ప్రజా సంక్షేమానికి ,నీటి పారుదల రంగానికి ఆయన చేసిన సేవలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. హత్య చేయబడ్డవారు లేక ప్రమాదాలలో చనిపోయిన వారు పాపలు చేశారు అని పరిపూర్ణానంద లాంటి వారు అనటం ఖండనీయం. ఎందరు స్వామీజీలు ,బీజేపీ మరియు ఇతర పార్టీ నేతలు హత్య లేక ప్రమాదాలలో చనిపోలేదు?వారందరి గురించి పరిపూర్ణానంద ఇదే అభిప్రాయాన్ని చెప్తారా?
అంతేందుకు , దేవాదాయ శాఖ మంత్రిగా పని చేసినవారికి రాజకీయంగా మరో అవకాశం రాదు అని ఒక సెంటిమెంట్ ఉంది. అది నిజం అన్నట్లు దేవాదాయ శాఖ మంత్రిగా చేసినవారు తుదుపరి ఎన్నికల్లో ఓడిపోయారు. గత ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన బీజేపీ నేత మాణిక్యాలరావు మొన్నటి ఎన్నికల్లో పోటీచేస్తే డిపాజిట్ కూడా రాలేదు,అనారోగ్యంతో ఈ మధ్యే చనిపోయారు. ఆయనకు తాడేపల్లి గూడెంలో మంచి పేరే ఉంది..
స్వామీజీలు ధర్మాగ్రహాల పేరుతో రాజకీయ విమర్శలు చేస్తూ ఎన్ని సూక్తులు చెప్పిన లాభం లేదు… స్వీయ ధర్మాన్ని పాటించాలి. కొడాలి నాని ,అసలు పేరు వెంకటేశ్వర రావు చేసిన విమర్శలకు నొచ్చుకుంటే ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పొచ్చు . అంతే కానీ నానికన్నా ఘాటుగా పాతరేస్తాం, నరికేస్తాం అంటే ఇంకా స్వామీజీలు , ప్రవచనాలు ఎందుకు?. తెలంగాణాను వదిలి ఆంధ్రా రాజకీయాలలోకి వచ్చేయండి.
విశ్వాసం ప్రకటించిన జగన్..
ప్రతిపక్షాలు డిక్లరేషన్ ఇవ్వమని అడగటం కేవలం జగన్ మతవిశ్వాసాల గురించి మరోసారి చర్చను తెరమీదికి తీసుకురావటానికే . నుదుట తిరునామం పెట్టి తలపాగా కట్టి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మోకాళ్ళ మీద మొక్కిన తరువాత కూడా కొందరు డిక్లరేషనే ముఖ్యం అంటూ వాదించటం పట్ల సామాన్య భక్తులు ఆశ్చర్య పోతున్నారు… అందరికి కనిపించిన తిరునామం కంటే ఒక్క అధికారి మాత్రమే చూసే సంతకము ముఖ్యం అనటం కేవలం రాజకీయం…