iDreamPost
iDreamPost
అభిమానులకు, కార్యకర్తలకు ఆయన ఆత్మబంధువు. తెలిసిన వారికి, సన్నిహితులకు సత్తిబాబు. కానీ రాష్ట్ర ప్రజలకు ఆయన బొత్స సత్యనారాయణగా చిరపరిచితుడు. సామాన్య కార్యకర్త నుంచి మంత్రి.. పీసీసీ అధ్యక్షుడి స్థాయికి ఎదిగిన ఆయన ఒక దశలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి సైతం పోటీలో ఉన్నారు. మాటల తూటాలతో.. ప్రశ్నల వర్షంతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసే నేతగా పేరుపొందిన ఆయన.. తనను, పార్టీని నమ్ముకున్న వారిని ఆదుకోవడంలోనూ అంతే చురుగ్గా వ్యవహరిస్తారు. స్థానిక రాజకీయాలపై అపారమైన పట్టు, అవగాహన ఉన్న బొత్స.. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి జిల్లాలో ఆధిపత్యం దక్కేలా వ్యూహాలు రచించడంలో దిట్ట. విజయనగరం పార్లమెంటు జిల్లా పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ పార్టీల గెలుపు ఓటములనూ ప్రభావితం చేయగల సత్తా ఉన్న నేతగా బొత్స పేరుపడ్డారు.
పెన్మత్స వారి శిష్యరికంలో…
1958 జూలై 9న విజయనగరంలో జన్మించిన బొత్స స్థానిక ఎమ్మార్ కళాశాలలో డిగ్రీ చదివారు. కళాశాల యూనియన్ లీడర్ గా ఉంటూనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే అప్పటి సతివాడ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత పెన్మత్స సాంబశివరాజు వెనుక తిరుగుతూ పార్టీ కార్యకలాపాలను గమనించేవారు. ఆయన శిష్యరికంలోనే రాజకీయ ఓనమాలు దిద్దారు. విజయనగరం పక్కనే ఉన్న గాజులరేగ పీఏసీఎస్ అధ్యక్షుడిగా తొలి ప్రయత్నంలోనే ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం ద్వారా క్రియాశీల రాజకీయాల్లో తొలి అడుగు వేశారు. అప్పటి నుంచి కాంగ్రెసులో అంచెలంచెలుగా ఎదిగారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) చైర్మన్ గా రెండుసార్లు పనిచేశారు.
ఒకేసారి పార్లమెంటుకు
డీసీసీబీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నప్పుడే బొత్సకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లభించింది. 1999లో జరిగిన ఎన్నికల్లో అప్పటి బొబ్బిలి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ ఆయన్ను నిలబెట్టింది. ఆ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి హవా కొనసాగడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని 42 పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 5 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. గెలిచిన ఐదుగురిలో బొత్స ఒకరు కావడం విశేషం. అలా ఢిల్లీ బాట పట్టిన ఆయన పార్టీ అధిష్టానం దృష్టిలో పడ్డారు. పెద్ద నాయకులతో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఆ క్రమంలోనే నాటి పీసీసీ అధ్యక్షుడు వై.ఎస్.రాజశేఖరరెడ్డి తో అనుబంధం ఏర్పడింది. వైఎస్ నిర్వహించిన ప్రజాప్రస్థానం యాత్ర తర్వాత జరిగిన ఎన్నికల్లో వైఎస్ గాలి వీచింది. ఆ ఎన్నికల్లోనే బొత్స తొలిసారి చీపురుపల్లి నుంచి అసెంబ్లీ బరిలోకి దిగి ఎమ్మెల్యే అయ్యారు. నాటి వైఎస్ కేబినెట్లో మంత్రిగానూ నియమితులయ్యారు. పరిశ్రమల శాఖ బాధ్యతలు చేపట్టారు.
Also Read : దేశ రాజకీయాలను ప్రజ్వలించిన తార జ్యోతిబసు
ఆరోపణలను ఎదురొడ్డి విజయాలు
పరిశ్రమల మంత్రి హోదాలో రాష్ట్రానికి ఓక్స్ వ్యాగన్ కార్ల కంపెనీని రప్పించే ఒప్పందంలో బొత్స అవినీతికి పాల్పడ్డారని ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ బొత్సపై బురద చల్లేందుకు ప్రయత్నించింది. అయితే వాటిని ధైర్యంగా, ధీటుగా ఎదుర్కొన్న ఆయన విచారణ కమిటీ నుంచి క్లీన్ చిట్ పొందారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో మళ్లీ గెలిచి వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో గృహ నిర్మాణం, పంచాయతీరాజ్, రవాణా వంటి కీలక శాఖలు నిర్వహించారు.
ముఖ్యమంత్రి రేసులో..
వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ డీలా పడిపోయింది. కాంగ్రెస్ నుంచి బయటపడి వైఎస్ జగన్ సొంత పార్టీ ఏర్పాటు చేయడం, తెలంగాణ ఉద్యమం పతాకస్థాయికి చేరడంతో కాంగ్రెస్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు అధిష్టానం ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. సీఎం, పీసీసీ అధ్యక్షులను మార్చాలని నిర్ణయించింది. అప్పటి సీఎం రోశయ్య స్థానంలో ఎవరిని పెట్టాలన్న ఆలోచన మొదలైనప్పుడు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న బొత్స పేరు పరిశీలనకు వచ్చింది. మరోవైపు స్పీకరుగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి పేరును మరికొందరు సూచించారు. వీరిద్దరి మధ్య పోటీ నెలకొన్న తరుణంలో ఎక్కువమంది కిరణ్ కుమార్ వైపు మొగ్గడంతో బొత్సకు ఆ పదవి తృటిలో చేజారింది. అయితే కొద్దినెలల్లోనే డి.శ్రీనివాస్ స్థానంలో 2011 జూన్లో బొత్సను అధిష్ఠానం పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది.
ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడం, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోగా బొత్స కూడా చీపురుపల్లిలో ఓటమి చవిచూడక తప్పలేదు. దాంతో 2015లో వైఎస్సార్సీపీలో చేరిన ఆయన విజయనగరం జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా మారారు. 2019 ఎన్నికల్లో జగన్ గాలికి తోడు బొత్స రాజకీయ వ్యూహాలు కలిసి జిల్లాలో టీడీపీని ఊడ్చిపెట్టేశాయి. జగన్ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రి అయిన బొత్స పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా మారిపోయారు. ముఖ్యంగా ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలకు ధీటుగా కౌంటర్లు ఇస్తూ పార్టీ వాయిస్ గా మారారు.
Also Read : ధర్మాన జోరు.. కార్యకర్తల హుషారు