Idream media
Idream media
దుబ్బాక ఉప ఎన్నిక చిత్రాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రచారంలో ఎవరూ ఊహించనంత హీట్ పెరిగింది. ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీ ప్రముఖులందరూ రంగంలోకి దిగి దుబ్బాక కాక పెంచుతున్న తరుణంలో మొట్ట మొదటి సారిగా సీఎం కేసీఆర్ ఆ ఎన్నికకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఎన్నికలో టీఆర్‌ఎస్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని.. విజయం తమదేనని స్పష్టం చేశారు. ఈ ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌కు పెద్ద లెక్కేకాదన్నారు. గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో దుబ్బాకలో రాజకీయ ఘర్షణలు పెరగడం..బీజేపీ అభ్యర్థి బంధువు ఇంట్లో డబ్బు పట్టుబడిన వ్యవహారం రాజకీయంగా వేడిని పుట్టించడంపై కొందరు ప్రశ్నించగా సీఎం సమాధానమిచ్చారు. దుబ్బాకలో మంచి మెజారిటీతో గెలుస్తామని, ఈ చిల్లర తతంగాలు నడుస్తూనే ఉంటాయని తీసి పాడేశారు. అయితే ఇదిలా ఉండగా రాజకీయ విశ్లేషకులు మాత్రం దుబ్బాకలో గెలుపు టఫ్‌గానే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిష్ఠాత్మకంగా టీఆర్ ఎస్
దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు సునాయాసమేనంటూ మెజార్టీ పైనే దృష్టిపెట్టినట్లు టీఆర్‌ఎస్ చెబుతోంది. ఇందుకనుగుణంగా మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ దుబ్బాకలో టీఆర్‌ఎస్ పార్టీ భారీ మెజార్టీ సాధిస్తుందని పలు సందర్భాల్లో ప్రకటించారు.. హరీష్ రావు ఉప ఎన్నికను తన బుజాలకేత్తుకోని ముఖ్యమంత్రికి గెలుపు రూపంలో మరో బహుమతి ఇవ్వాలని..తనపై ముఖ్యమంత్రికి ఉన్న నమ్మకాన్ని మరో సారి నిరూపించుకోవాలని హరీష్ రావు విసృతంగా ప్రచారం చేస్తున్నారు..గత నెల రోజుల నుంచి నిత్యం కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ..ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. తన ప్రసంగాలతో టీఆర్ఎస్ శ్రేణులకు భరోసా కల్పిస్తున్నారు.
దూకుడు తగ్గిన కాంగ్రెస్
మొదట్లో దుబ్బాక ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకున్నా.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ నాయకత్వంలో దూకుడు తగ్గినట్లు కనిపిస్తుంది. మండలాల వారీగా ఇన్ చార్జిలను నియమించినప్పటికి..నాయకత్వంలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరి మండలానికి వారు పరిమితం అవుతున్నారు తప్ప ఉమ్మడిగా ప్రచారం నిర్వహించటంలో వెనుకబడిపోతున్నారు. దీంతో పార్టీ కార్యకర్తలు అందోళనలో ఉన్నట్లు తెలుస్తుంది..స్థానిక నాయకత్వానికి కాంగ్రెస్ జాతీయ కమిటీకి మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి చేసిన పనులు, ఆయన మృతితో సానుభూతి కలిసొస్తుందని ఆయన తనయుడు శ్రీనివాస్ రెడ్డి కి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న శ్రీనివాస్ రెడ్డి ముత్యం రెడ్డి అనుచరులను, సానుభూతి పరులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
దూకుడుగానే బీజేపీ..
దుబ్బాక లో బీజేమీ మాత్రం దూకుడుగానే వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితిలో దుబ్బాక గెలిచి తమ ఉనికి మరోసారి చాటుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీకి కేంద్ర నాయకత్వం..డీకే అరుణ, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మొన్న జరిగిన వివాదాల నేపథ్యంలో రంగంలోకి దిగిన కిషన్ రెడ్డి వంటి నేతల ప్రభావంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సహం పెరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కూడా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్న తొలి ఉప ఎన్నిక కావడంతో గెలుపుపై సీరియస్‌గా దృష్టి పెట్టారు..గెలుపు కోసం కలిసివచ్చే అన్ని అవకాశాలను రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు..ప్రభుత్వ లోపాలపై ప్రజల్లో నిలదీస్తున్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును చుట్టిముట్టిన వివాదాలను టీఆర్ఎస్ రాజకీయాల్లో భాగంగానే అని చాటి చెప్పే ప్రయత్నంగా గట్టిగా చేస్తున్నారు. దీనికి తోడు రఘునందన్ రావు ఎప్పటి నుంచో నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. ఇది తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరుగా దుబ్బాక ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరు గెలిచినా రెండు, మూడు శాతం ఓట్ల తేడాతోనే అనే ప్రచారం జరుగుతోంది. అభ్యర్థులు మాత్రం గెలుపుపై ఎవరికి వారే ధీమాతో ఉన్నారు. మరి విజయం ఎవరిని వరిస్తుందో నవంబర్ 3న జరిగే బ్యాలెట్ బాక్స్ ల్లో నిక్షిప్తం కానుంది.