iDreamPost
android-app
ios-app

శిరస్సు దొరికింది… నిందితులే దొరకాలి…

శిరస్సు దొరికింది… నిందితులే దొరకాలి…

విజయనగరం జిల్లా రామతీర్థంలోని కోదండ రాములవారి శిరస్సు దొరికింది. కోట్లాదిమంది ప్రజలను కలవరపాటుకు, ఆనేదనకు గురి చేసిన ఘటన జరిగిన మరునాడే పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చినట్లయింది. కేవలం 24 గంటల్లోనే ప్రభుత్వ వర్గాలు విచారణాధికారి, పోలీసులు మూకుమ్మడిగా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఎస్పీ, ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులు రామతీర్థంలోని ఆలయాన్ని సందర్శించి తక్షణమే దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు ఒక్కరోజు ముందుగా ఇలాంటి అవాంఛనీయ ఘటన జరగడం ఇబ్బందికరమే. కానీ ప్రభుత్వం ఆఘ మేఘాలమీద స్పందించింది. దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు డి.భ్రమరాంబను విచారణాధికారిగా నియమించింది. ఆమె నేతృత్వంలో దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. ఆ ఆగంతకులు ఆలయం సమీపంలోని కోనేట్లో రామయ్య శిరస్సును పడేసే అవకాశము ఉండొచ్చన్న అనుమానంతో అందులోని నీటిని మొత్తాన్ని బయటకు తోడించారు. ఈ క్రమంలోనే ఆ కోనేట్లో రామయ్య శిరస్సు పదిలంగా లభ్యమైంది. ఆవేదనతో ఎదురుచూసిన భక్తుల కళ్ళు చెమర్చాయి.

దీంతో ఈ ఘటనను రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిరచ్చ చేద్దామని భావించిన తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నారు. ఈ ఘటనను బేస్ చేసుకుని ప్రజల్లో ఉద్రిక్తతలు రేకెత్తించే లక్ష్యంతో తెలుగుదేశం పాదయాత్రకు సంకల్పించింది, కానీ పాద్దున్నే రామయ్య శిరస్సు లభ్యం కావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.

ఆకతాయిలా ? కుట్రకోటమా?

ముఖ్యమంత్రి పర్యటనకు ముందురోజే ఈ ఘటన జరగడం పట్ల ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణించింది. ఒక్కరోజులోనే రామయ్య శిరస్సును వెతికి పట్టింది. అయితే ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరు? ఆకతాయిలా? తాగుబోతులు గుట్టమీదకు వెళ్లి ఈ ఆనాగరిక చర్యకు పాల్పడ్డారా లేక కుట్రకోణం ఉందా అన్నది తేల్చాల్సి ఉన్నది. వాస్తవానికి రామతీర్థం గ్రామంలోని రామప్పామి ఆలయం వద్ద, ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలున్నాయి. అయితే గుట్టమీద ఉన్న కోదండ రాముని ఆలయం వద్ద ఎలాంటి సీసీ కెమెరాలు లేకపోవడంతో ఎవరు ఈ అకృత్యానికి పాల్పడ్డారన్నది ప్రశ్నార్థకంగా మారింది. గ్రామంలోకి కొత్తగా వచ్చిన వారు, ఈ రెండురోజులు గుట్టపైపుగా వెళ్లినవారు ఎవరైనా ఉన్నారా అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.