iDreamPost
android-app
ios-app

Police Notice – నోటి మాటలే కదా అనుకుంటే చిక్కులు తప్పవు తమ్ముళ్ళూ!

Police Notice – నోటి మాటలే కదా అనుకుంటే చిక్కులు తప్పవు తమ్ముళ్ళూ!

ఆంధ్ర ప్రదేశ్ పోలీసుల పనితీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. అదేదో సినిమాలో ఇప్పటిదాకా ఒక లెక్క ఇకమీదట ఒక లెక్క అన్నట్టు గతంలో పరిస్థితులు ఎలా ఉండేవి అనేది పక్కన పెడితే, ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి సంఘటనలు జరిగినా వాటి మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న ఎవరినీ ఉపేక్షించడం లేదు పోలీసులు. ఈ విషయంలో గతంలో ఒక సారి టీడీపీకి షాక్ తగిలింది. అయినా సరే ఊరుకోకుండా అలాగే నిరాధారమైన ఆరోపణలు చేస్తుండడంతో తాజాగా మరో షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ కి సంబంధం లేని డ్రగ్స్ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యంగా అధికార పార్టీకి అంటగట్టాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మొదలు ఆ పార్టీలో కార్యకర్త దాకా అందరూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వ్యాప్తంగా కష్టపడ్డారు. సాధారణంగా తనిఖీలలో దొరికే గంజాయి పట్టివేతను కూడా డ్రగ్స్ భూతానికి ముడిపెట్టి టిడిపి అధికార సోషల్ మీడియా ఖాతాలో నుంచి పెద్ద ఎత్తున పోస్టులు పెట్టి షేరింగ్ చేయించారు.

కాకినాడ తీరంలో ఏదో బోటు తగలబెడితే అదేదో డ్రగ్స్ ఉండడం వలన అకారణంగా తలబెట్టారు అంటూ ప్రచారం చేస్తే పోలీస్ బాస్ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు, పలు పత్రికల యాజమాన్యాలకు లీగల్ నోటీసులు పంపించారు. అది కాక ఏపీలో గంజాయి సాగులో వైసీపీ నేతల హస్తం ఉందని, ఓ పెద్ద మాఫియా ఏపీలో నడుస్తోందని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగుతున్న గంజాయి స్మగ్లింగ్ పై, డ్రగ్స్ దందా పై ఆయన తనదైన శైలిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో ఈ క్రమంలోనే ధూళిపాళ్ళ నరేంద్రకు కాకినాడ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలని నోటీసులలో పేర్కొన్నారు. విచారణకు హాజరై ఆధారాలు ఇవ్వాలని, ధూళిపాళ్ళ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసుల ద్వారా కోరారు.

ఆయన ఒక్కడికే కాక చంద్రబాబు, లోకేష్, కింజారపు రామ్మోహన్ నాయుడు, ధూళిపాళ్ళ నరేంద్ర, బోండా ఉమ, కొమ్మారెడ్డి పట్టాభి, బుద్ధ వెంకన్నలతోపాటు, పలు మీడియా సంస్థల అధినేతలు, ఎండిలు, ఎడిటర్లకు కూడా లీగల్ నోటీసులు జారీ చేశారు. ఇక తాజాగా మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఇంటికి నిన్న రాత్రి సమయంలో వెళ్ళిన విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీసులు విశాఖలో గంజాయి, మత్తు పదార్థాల రవాణాపై మీడియా సమావేశంలో ఆనంద్ బాబు మాట్లాడిన అంశాలకు ఆధారాలు అడిగారు. రాత్రి సమయంలో రావడం ఏంటి అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ ఉదయం వెళ్లి నోటీసులు ఇచ్చారు. మొత్తం మీద టీడీపీ నేతలు ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే గతంలో లాగా ఏది పడితే అది ఆధారాలు లేకుండా మాట్లాడితే ప్రభుత్వం, పోలీసులు ఊరుకునే అవకాశమే లేదు. టిడిపి నేతలు సహా టీడీపీ అనుకూల మీడియా కూడా ఏది పడితే అది రాసి మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోకుంటే చిక్కుల్లో పడక తప్పదు.

Also Read : Kidnap Case – ముంచుకొస్తున్న ముప్పు.. అఖిల ప్రియకు దారేది..?