iDreamPost
android-app
ios-app

తండ్రి కలల సాధనలో జగన్ కీలక అడుగులు, పీపీఏ నుంచి సానుకూల స్పందన

  • Published Dec 21, 2020 | 8:29 AM Updated Updated Dec 21, 2020 | 8:29 AM
తండ్రి కలల సాధనలో జగన్ కీలక అడుగులు, పీపీఏ నుంచి సానుకూల స్పందన

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలక అడుగులు పడుతున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలల ప్రాజెక్టు కార్యరూపం దాల్చే దిశలో సాగుతోంది. దానికి జగన్ చిత్తశుద్ధి, కాంట్రాక్ట్ సంస్థ మేఘా కంపెనీ ప్రయత్నాలు కలిసి ఫలితాన్నిస్తున్నాయని చెప్పవచ్చు. తాజాగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పర్యటనలో కూడా పనుల తీరు మీద సంతృప్తి వ్యక్తమయ్యింది. జగన్ ప్రభుత్వ తీరు మీద విశ్వాసం వ్యక్తమయ్యింది.

పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ తన పర్యటనలో భాగంగా పోలవరంలో నిర్మాణంలో ఉన్న స్పిల్ వే పనులను పరిశీలించారు. హెడ్ వర్క్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఇతర కార్యకలాపాలను ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా పనుల తీరు మీద పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. పురోగతి పట్ల సానుకూలంగా స్పందించారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వ వైఖరికి ఆయన పూర్తిగా అండగా నిలిచే దిశలో వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పోలవరం పూర్తి కోసం పునరావాస ప్యాకేజీ ప్రధానాంశంగా ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఇటీవల అదే అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళుతోంది. గత నెలలో జరిగిన పీపీఏ సమావేశంలో కూడా ప్రస్తావించింది. పునరావాసానికి పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తే ప్రాజెక్ట్ పనులు మరింత చురుగ్గా సాగుతాయని చెబుతోంది.

సరిగ్గా అదే రీతిలో పీపీఏ సీఈవో వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. దాంతో పీపీఏ నుంచి ఏపీ ప్రభుత్వ వైఖరితో వంద శాతం ఏకీభావం కుదిరినట్టు కనిపిస్తోంది. ప్రాజెక్ట్ నిధులు కేటాయింపులో ఇది ఉపయోగపడుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. తమ బృందం నాలుగు రోజుల పాటు పోలవరం హెడ్ వర్క్స్, కాలువ పనులు, ఆర్ అండ్ ఆర్ అమలు సహా అన్ని అంశాలు పరిశీలిస్తామని సీఈవో తెలిపారు. అదే సమయంలో భూసేకరణ, పునరావాసం కీలకం అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తరుపున పోలవరం అథారిటీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాత దానికి సంబంధించిన వ్యవహారం కొలిక్కి రావచ్చని భావిస్తున్నారు.

వాస్తవానికి చంద్రబాబు హయంలో పనుల తీరు మీద పీపీఏ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన అనుభవాలున్నాయి. కానీ ప్రస్తుతం దానికి భిన్నం. అదే సమయంలో 2013-14 నాటి లెక్కల ప్రకారం ప్రాజెక్ట్ ఖర్చు కేటాయిస్తామని కేంద్రం షరతుకి అంగీకరించి చంద్రబాబు పోలవరం బాధ్యత నెత్తినపెట్టుకున్నారు. కానీ నేటికీ పునరావాసానికి కనీసంగా రూ. 26వేల కోట్లు అవసరమైన నేపథ్యంలో ఆ నిధుల కోసం జగన్ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల అమిత్ షా సమావేశంలోనూ, అంతకుముందు వివిధ సందర్భాల్లోనూ సీఎం జగన్ వీటిని ప్రస్తావించారు. ఇక మంత్రులు బుగ్గన, అనిల్ కుమార్ యాదవ్ కూడా ఢిల్లీలో కేంద్ర పెద్దలతో మంతనాలు జరిపారు. మొత్తంగా తాజాగా పీపీఏ సీఈవో ప్రకటన ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలకు పెద్ద ఊరటగా భావించాలి.