iDreamPost
android-app
ios-app

పోలవరం బిల్లుల చెల్లింపు – శాపంగా మారిన చంద్రబాబు సర్కారు నాడు చేసిన తప్పు

  • Published Jun 05, 2021 | 2:40 AM Updated Updated Jun 05, 2021 | 2:40 AM
పోలవరం బిల్లుల చెల్లింపు – శాపంగా మారిన చంద్రబాబు సర్కారు నాడు చేసిన తప్పు

రెండేళ్ల క్రితం అధికారంలో ఉన్న నాటి చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదం ఇప్పుడు ప్రభుత్వానికి గుదిబండగా మారుతోంది. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా నిర్దేశించిన తర్వాత కూడా నిర్మాణ బాధ్యతను నెత్తినెట్టుకున్న చంద్రబాబు కారణంగా కేంద్రం పలు కొర్రీలు వేస్తోంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం విషయంలో అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. వాటిని అధిగమించడానికి జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయని ఊపిరిపీల్చుకునే లోపు తాజాగా మరో సమస్య వచ్చి పడింది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మెయిన్ డ్యామ్, స్పిల్ వే, ప్రధాన కాలువలు, పవర్ స్టేషన్ కూడా అంతర్భాగమే. అయితే ప్రస్తుతం కేంద్రం నుంచి రావాల్సిన నిర్మాణ నిధుల బకాయిల విషయంలో కొన్ని బిల్లులు వెనక్కి పంపించడం విశేషంగా మారింది. కేంద్రం నుంచి ఇటీవల రూ. 333 కోట్లు ఏపీ ప్రభుత్వానికి జమ చేశారు. ఇంకా రూ. 1303 కోట్లు రావాల్సి ఉంది. కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టుని, ఏపీ ప్రభుత్వం తన నిధులు ఖర్చు చేస్తే వాటిని నాబార్డ్ నుంచి రీయంబెర్స్ చేసేలా అప్పట్లో చంద్రబాబు కేంద్రంతో రాజీపడిన పుణ్యానికి ఇప్పుడు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కేంద్రమే నిధులు వెచ్చించాల్సి ఉండగా, ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసి, బిల్లుల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి దాపురించింది

కేంద్రం నుంచి ఇంకా ఏపీకి రావాల్సిన నిధుల్లో రూ. 532.80 కోట్లు చెల్లించడానికి ఆస్కారం లేదని కేంద్రం చెబుతోంది. బిల్లులను కూడా తిరస్కరించినట్టు చెబుతున్నారు. అందులో కుడికాలువ నిర్మాణం కోసం వెచ్చించిన రూ. 57.18 కోట్లు, ఎడమ కాలువ నిర్మాణంలో ఖర్చు చేసిన రూ 169.1 కోట్లు కూడా ఉన్నాయి. 2013-14 నాటి అంచనాల ప్రకారం బిల్లుల చెల్లింపు సాధ్యం కాదని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. బిల్లులను తిరస్కరించడంతో పాటుగా కాలువల నిర్మాణానికి ఇక నిధులు కేటాయించే అవకాశం లేదన్నట్టుగా కేంద్రం చెబుతోంది. పోలవరం కాలువల నిర్మాంలో ఎడమకాలువ ఇంకా వంద శాతం పూర్తికాలేదు. కుడికాలువ కూడా ఆదరాబాదరగా పట్టిసీమ పేరుతో చంద్రబాబు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దాంతో కాలువలు పూర్తయినట్టుగానే కేంద్రం భావిస్తోంది. పైగా కాలువల నిర్మాణం కోసం కేటాయించిన నిధులను కూడా అప్పటి ప్రభుత్వం పక్కదారి పట్టించడంతో ఇప్పుడు వాటి భవితవ్యం గందరగోళంగా మారుతోంది.

పోలవరం కోసరమే స్పెషల్ ప్యాకేజి అంగీకరించాను అని చెప్పుకున్న చంద్రబాబు పోలవరం కొత్త అంచనాలు 52 వేల కోట్లకు కానీ,కొత్త రేట్ల మీద కానీ ఎలాంటి హామీ లేకుండానే ప్యాకేజీని అంగీకరించి రాష్ట్రాన్ని సీజేసిన ద్రోహం పోలవరానికి శాపంలా మారింది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం సవరించాల్సి ఉండగా కేంద్రం ససేమీరా అంటోంది. ఏపీ ప్రభుత్వం నుంచి పలుమార్లు ముఖ్యమంత్రి జగన్, ఆర్థిక, నీటిపారుదల శాఖల మంత్రులు కూడా కేంద్ర పెద్దలను విన్నవించినా స్పందన రావడం లేదు. విద్యుత్ కేంద్రం మట్టి పనులకు సంబంధించిన రూ. 50 కోట్లు కూడా చెల్లించేది లేదని చెబుతోంది మొత్తంగా సకాలంలో పూర్తి చేయాల్సిన పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచాల్సి ఉన్నప్పటికీ కేంద్రం నుంచి స్పందన రాకపోవడం, ఇప్పుడు బిల్లులు కూడా వెనక్కి పంపుతున్న తరుణంలో ప్రాజెక్టు పరిస్థితి ఏమిటన్నది చర్చకు దారితీస్తోంది.

పోలవరం నిర్మాణం ఐదేళ్ళలో పూర్తి చేయాల్సి ఉంది. కానీ దానిని చంద్రబాబు నిర్లక్ష్యం చేశారు. చివరి రెండేళ్ళలో కొంత కదలిక, అదనపు ప్రచారమే తప్ప అసలు పనులు మాత్రం ముందుకు సాగించడంలో విఫలమయ్యారు. ఫలితంగా కాలయాపనతో వ్యయం పెరిగింది. దానిని సవరించడానికి కేంద్రం అంగీకరించడం లేదు. అయినప్పటికీ పోలవరం పనుల విషయంలో పట్టుదలతో జగన్ చేస్తున్న ప్రయత్నాలు, మేఘా కంపెనీ చొరవతో ప్రస్తుతం స్పిల్ వే సిద్ధమయ్యింది. కాఫర్ డ్యామ్ ని పూర్తిగా మూసివేసి నీటిమళ్లింపు చేస్తున్నారు. ఇక మెయిన్ డ్యామ్ నిర్మాణం, కాలువలు పూర్తి చేయడం, పవన్ స్టేషన్ సిద్ధం చేయడం వంటి పనులున్నాయి. దానికి అనుగుణంగా కేంద్రం స్పందించడం అవసరంగా కనిపిస్తోంది.