iDreamPost
android-app
ios-app

రష్యా ప్రతిపక్ష నేతపై విష ప్రయోగం

రష్యా ప్రతిపక్ష నేతపై విష ప్రయోగం

ర‌ష్యా ప్ర‌తిప‌క్ష నేత అలెక్సీ న‌వాల్నిపై విష‌ప్ర‌యోగం జరిగింది. టోమ్స్క్ నుంచి మాస్కో వ‌స్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుందని సమాచారం. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో అలెక్సీ న‌వాల్ని అకస్మాత్తుగా స్పృహ తప్పడంతో విమానాన్ని ఓమ్స్క్‌ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండ్ చేసి ఆయన్ను హాస్పిటల్ కి తరలించారు.

ఆయన గత కొంతకాలంగా ర‌ష్యాలో అవినీతి వ్య‌తిరేక ఉద్య‌మాన్ని న‌వాల్నీ నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ఇటీవల కాలంలో మ‌రో రెండు ప‌ర్యాయాలు అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు రాజ్యాంగాన్ని సవరించారు. కాగా రష్యా రాజ్యాంగ సవరణ విషయంలో అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ పెద్ద ఎత్తున అవినీతి కార్యకలాపాలకు పాలపడ్డారని ప్రతిపక్ష నేత అలెక్సీ న‌వాల్ని ఆరోపించారు. కాగా ఇంతలోనే ఆయనపై విష ప్రయోగం జరగడం రష్యా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అయితే అలెక్సీ న‌వాల్ని కేవలం టీ మాత్రమే తాగారని, టీలోనే విషం కలిపి ఉండొచ్చని నవాల్ని మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేసి ఉండొచ్చని కూడా మరికొందరు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిజాలను వెలికితీసేందుకు దర్యాప్తు చేస్తున్నారు..