ఫిబ్రవరి 18,1930న అమెరికా, ఆరిజోనా రాష్ట్రంలో ఫ్లాగ్ స్టాఫ్ నగరం సమీపంలోని ఎడారిలో ఉన్న లోవెల్ అబ్జర్వేటరీలో తను సౌరకుటుంబం అంచులో ఉన్న ఒకే ప్రాంతాన్ని అంతకు ముందు నెల ఆరు రోజుల వ్యవధిలో తీసిన రెండు ఫోటోలని బ్లింక్ మైక్రోస్కోప్ అనే పరికరంతో చూస్తున్న క్లైడ్ టోమ్ బాగ్ కి అకస్మాత్తుగా యురేకా అని కేక పెట్టాలనిపించింది. ఎన్నో సంవత్సరాలుగా చాలా మంది ఖగోళ శాస్త్రవేత్తలు సౌరకుటుంబం అంచుల్లో తొమ్మిదవ గ్రహం ఉంది అని నమ్మి, ఎక్కడ ఉండాలో లెక్కలు కట్టి, అప్పటికి అందుబాటులో ఉన్న శక్తివంతమైన టెలిస్కోపులు వాడి వెతుకుతుంటే కనిపించకుండా దాగుడుమూతలు ఆడిన ప్లానెట్ ఎక్స్ ఆ ఫోటోలలో దొరికింది.
రెండున్నర దశాబ్దాల అన్వేషణ
1781లో విలియం హెర్షల్ యురేనస్ గ్రహాన్ని కనిపెట్టిన తరువాత దాని గమనాన్ని పరిశీలించిన చాలా మంది కక్ష్యలో అది తిరిగే విధానం గమనించి దానిమీద ఏదైనా పెద్ద ఖగోళ వస్తువు తాలూకూ గురుత్వాకర్షణ ప్రభావం ఉందని భావించి, న్యూటన్ సూత్రాల ఆధారంగా లెక్కలు కట్టి వెతికితే 1846లో జాన్ గాలే, అర్బన్ లె వెరియెర్ అనే ఇద్దరు ఖగోళ శాస్త్రవేత్తలకి నెప్ట్యూన్ గ్రహం కనిపించింది. అయితే యురేనస్ గ్రహ గమనంలో మార్పులకు నెప్ట్యూన్ గ్రహం ఒకటే కాకుండా దానికవతల మరో గ్రహం ఉండాలని భావించిన చాలా మంది శాస్త్రవేత్తలు దానికి ప్లానెట్ ఎక్స్ అని పేరు పెట్టి టెలిస్కోపులతో వెతకడం మొదలు పెట్టారు.
అమెరికాకి చెందిన పెర్సీవల్ లోవెల్ అనే ఖగోళ శాస్త్రవేత్త ఆరిజోనా రాష్ట్రంలోని ఫ్లాగ్ స్టాఫ్ నగరం సమీపంలోని ఎడారిలో తన స్వంత కర్చుతో ఒక అబ్జర్వేటరీ ఏర్పాటు చేసి పరిశోధనలు చేసేవాడు. సౌరకుటుంబంలో కనిపించకుండా ఉన్న తొమ్మిదో గ్రహం కోసం జరుగుతున్న అన్వేషణ అతడిని ఆకర్షించింది. అప్పటికి అందుబాటులో ఉన్న శక్తివంతమైన టెలిస్కోపులు సమకూర్చుకుని విలియం పిక్కరింగ్ అనే మరో శాస్త్రవేత్తతో కలిసి చాలా పరిశీలనలు చేసి, డ్రాయింగులు గీసి, ఫోటోలు తీశాడు. అతడి అన్వేషణ ఫలిస్తుందేమో అనిపిస్తుండగా 1916లో అతను మరణించాడు.
లోవెల్ మరణం తర్వాత అతను నెలకొల్పిన ప్రయోగశాల మీద హక్కుల కోసం అతని భార్య కోర్టుకెక్కడంతో లోవెల్ అబ్జర్వేటరీ దాదాపు మూతపడే పరిస్థితికి వచ్చింది. న్యాయపరమైన చిక్కులు విడిపించుకొని 1929లో అబ్జర్వేటరీ మళ్ళీ ప్రయోగాలు మొదలు పెట్టినప్పుడు దాని డైరెక్టర్ ఇరవై మూడు సంవత్సరాల క్లైడ్ టోమ్ బాగ్ అప్పటికే చేసిన ఖగోళ పరిశీలనలు, వాటి తాలూకు డ్రాయింగులు చూసి అతనికి ప్లానెట్ ఎక్స్ ని కనిపెట్టే బాధ్యత అప్పగించాడు. అప్పటికే పెర్సీవల్ లోవెల్ రూపొందించిన డ్రాయింగుల ఆధారంగా తన పని మొదలు పెట్టాడు టోమ్ బాగ్.
రెండు మూడు రోజుల వ్యవధిలో ఒకే ప్రాంతాన్ని ఫోటోలు తీయడం, ఆ రెండు ఫోటోలని బ్లింక్ మైక్రోస్కోప్ అనే పరికరంతో పరిశీలించడం, రెండిటిలో ఏదైనా వ్యత్యాసం ఉందేమో చూడడం అతని పని. ఇలా చూస్తుండగా జనవరి 23,29 తేదీలలో తీసిన రెండు ఫోటోలు చూస్తుండగా ఒక చాలా చిన్న గోళం తన స్ధానాన్ని మార్చుకోవడం గమనించాడు టోమ్ బాగ్. అదే ప్లానెట్ ఎక్స్. ఆ తరువాత దాన్ని మరింత జాగ్రత్తగా పరిశీలించి ధృవపరుచుకున్నాడు.
పెర్సీవల్ లోవెల్ జన్మదినం, విలియం హెర్షల్ యురేనస్ గ్రహాన్ని కనిపెట్టిన రోజు అయిన మార్చి 13న ఈ ఆవిష్కరణని ప్రపంచం ముందుంచింది లోవెల్ అబ్జర్వేటరీ.
పేరు పెట్టిన స్కూలు విద్యార్థిని
తాము కనిపెట్టిన గ్రహానికి పేరు పెట్టే హక్కు లోవెల్ అబ్జర్వేటరీకి దక్కింది. ఏ పేరైతే బావుంటుందో చెప్పండి అని ప్రజలనే అడిగాడు లోవెల్ డైరెక్టర్. దాదాపు వెయ్యికి పైగా పేర్లు పంపించారు సైంటిస్టులూ, సాధారణ ప్రజలు. చివరికి మినర్వా, క్రోటన్స్, ప్లూటో అన్న మూడు పేర్లను షార్ట్ లిస్ట్ చేసి ఓటింగ్ పెడితే ఎక్కువ మంది ప్లూటోకి ఓటు వేశారు. ప్లూటో పేరు సూచించింది ఇంగ్లాండులోని ఆక్స్ ఫోర్డ్ ప్రాంతానికి చెందిన పదకొండు సంవత్సరాల వెనీషియా బుర్నీ అనే అమ్మాయి.
యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలకు గ్రీకు పురాణాలలోని దేవతల పేర్లు పెట్టారు కాబట్టి, చాలా కాలం కనిపించకుండా చీకటిలో ఉన్న గ్రహానికి చీకటిలోకం అధిపతి అయిన ప్లూటో పేరు బావుంటుందని లైబ్రేరియన్ అయిన తన తాతకి చెప్తే, ఆయన తన స్నేహితుడు ఖగోళవేత్త అయిన హెర్బర్ట్ హాల్ కి చెప్తే ఆయన అమెరికాలోని తన సహచరులకి టెలిగ్రాం పంపాడు. ఇందుగ్గానూ లోవెల్ అబ్జర్వేటరీ ఆ అమ్మాయికి అయిదు పౌండ్లు బహుమతి పంపింది.
డిస్నీ కేరక్టర్, కొత్త మూలకం
ప్లూటో అన్న పేరు బాగా నచ్చిన డిస్నీ కామిక్స్ సృష్టికర్త వాల్ట్ డిస్నీ తన కామిక్స్ లో ఒక కుక్క పాత్ర సృష్టించి దానికి ప్లూటో పేరు పెట్టాడు. లోగడ యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలను కనిపెట్టిన తర్వాత కొత్తగా కనుక్కొన్న మూలకాలకు యురేనియం, నెప్ట్యూనియం పేర్లు పెట్టినట్టు, గ్లెన్ సీబోర్గ్ అనే భౌతిక శాస్త్రవేత్త 1941లో తాను కనుగొన్న మూలకానికి ప్లుటోనియం అని పేరు పెట్టాడు.
హోదా తగ్గింపు
ప్లూటో గ్రహం కనిపెట్టిన కొంతకాలానికి ఇంచుమించు అంతే పరిమాణం ఉన్న ఎరిస్ అనే మరో గోళం కూడా కనిపించింది. దీన్ని పదవ గ్రహంగా తీసుకోవాలని కొందరు, దానికి గ్రహం లక్షణాలు లేవని మరికొందరు వాదించుకుని గ్రహం అని పిలవాలంటే ప్రధానంగా మూడు లక్షణాలు ఉండాలని తీర్మానించారు. ఖగోళ వస్తువు కక్ష్య ఇతర గ్రహాల కక్ష్యలో ప్రవేశించకూడదన్నది అందులో ఒకటి. ప్లూటో సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు నెప్ట్యూన్ గ్రహం తాలూకూ కక్ష్యని దాటుతుంది కాబట్టి ప్లూటో గ్రహం కాదని, ప్లూటో, దాని అయిదు ఉపగ్రహాలు, ఎరిస్ లని మరుగుజ్జు గ్రహాలు లేదా మైనర్ గ్రహాలు అని పిలవాలని సెప్టెంబర్ 2006లో అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల సంఘం తీర్మానించింది. అయితే చాలా మంది ఖగోళవేత్తలు దీంతో ఏకీభవించకుండా ప్లూటోని గ్రహంగానే లెక్క వేయాలని, ఈ తీర్మానం రద్దు కోసం పోరాడుతున్నారు.
15 కోట్ల కిలోమీటర్లు ఉన్న కక్ష్యలో ప్లూటో సూర్యుడి చుట్టూ ఒక ప్రదక్షిణం చేయాలంటే భూమి మీద కాలంలో చెప్పాలంటే 248 సంవత్సరాల సమయం పడుతుంది. ప్లూటోని కనుగొన్నాక అది ఇప్పటివరకు సూర్యుడి చుట్టూ ఒక ప్రదక్షిణం కూడా పూర్తి చేయలేదు. 2227 సంవత్సరంలో అది జరుగుతుంది.