iDreamPost
iDreamPost
కొన్ని విషయాల్లో మాకు ఏకాభిప్రాయం కుదరలేదు. అందుకే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరికపై చర్చలు ముందుకు సాగలేదు.. అని కాంగ్రెస్ యూపీ ఎన్నికల ఇంఛార్జి ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరతారంటూ గత ఏడాది వార్తలు వచ్చాయి. ఆయనతో పార్టీ అధిష్టానం పలుమార్లు చర్చలు కూడా జరిపింది. కానీ ఆ తర్వాత ఆ ప్రతిపాదన నిలిచిపోయింది. పీకే కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పై పలు వ్యతిరేక వ్యాఖ్యలు కూడా చేశారు. పీకే కాంగ్రెస్లోకి రావడాన్ని ప్రియాంక వ్యతిరేకించారన్న ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. దీనిపై ప్రియాంక తొలిసారి స్పందించి.. ఏం జరిగిందో వివరించారు.
నేను కారణం కాదు
బయటి వ్యక్తిని పార్టీలోకి రప్పించి ఒకేసారి ఉన్నత పదవి ఇవ్వాలన్న ప్రతిపాదనపై తాను విముఖత వ్యక్తం చేసినట్లు జరిగిన ప్రచారంలో వాస్తవంలేదని ప్రియాంక చెప్పారు. మీడియా ప్రశ్నలకు ఆమె సమాధానం ఇస్తూ గత ఏడాదే ప్రశాంత్ కాంగ్రెస్ లో చేరాల్సి ఉందన్నారు. కొన్ని కారణాల వల్ల అది జరగలేదని వివరించారు. కొన్ని అంశాల్లో మా మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని.. దాంతో ఆ ప్రతిపాదన నిలిచిపోయిందన్నారు.
2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహకర్తగా పనిచేసిన పీకే ఆనాడు ఇచ్చిన ప్రణాళికలనే కాంగ్రెస్ ఇప్పుడు అనుసరిస్తోంది. ప్రియాంకను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే యూపీలో కాంగ్రెస్ బలపడుతుందని అప్పట్లో పీకే సూచించారు. కానీ అప్పట్లో ప్రియాంక పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాలేదు. పార్టీ హై కమాండ్ కూడా ఆయన ప్రతిపాదనను ఆమోదించలేదు. షీలాదీక్షిత్ ను సీఎంగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లింది. దాంతో పీకే యూపీ నుంచి వైదొలగి పంజాబ్ కే పరిమితం అయ్యారు. గత ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బెంగాల్ లో తృణమూల్ విజయం తర్వాత జాతీయ స్థాయిలో బీజీపీయేతర పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నించిన ప్రశాంత్ కిషోర్ మొదట్లో కాంగ్రెస్ ను కలుపుకొని వెళ్లేందుకు చూశారు. ఆ సందర్బంగానే ఆయన కాంగ్రెస్లో చేరతారన్న ప్రచారం జరిగింది.అది జరగకపోగా పీకే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీని జాతీయ స్థాయిలో ఫోకస్ చేయడం ప్రారంభించారు.
నేనే సీఎం అభ్యర్థి అని చెప్పలేదు:ప్రియాంక
యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని తానేనని చెప్పలేదని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. యూత్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా తాను ఇరిటేషన్ తో కొన్ని వ్యాఖ్యలు చేశానంటూ వాటిని ఉపసంహరించుకున్నారు. యూపీ ఎన్నికల్లో ప్రతి చోటా తానే కనిపిస్తానన్న భావంతో తాను మాట్లాడానని.. దాని అర్థం తానే సీఎం అభ్యర్థి అని కాదని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ రాష్ట్రానికీ సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు.