Idream media
Idream media
రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోష్, మోపీదేవి వెంకటరమణలు పార్లమెంట్‌లో అడుగుపెట్టే దిశగా అడుగులు ప్రారంభించారు. గత నెల 19వ తేదీన జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పిల్లి, మోపీదేవి ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శాసన మండలిలో సభ్యులుగా ఉంటూ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న వీరిద్దరు తమ పదవులకు రాజీనామా చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే వారు ఎప్పుడు రాజీనామా చేస్తారన్న సస్సెన్స్‌కు తెరదించుతూ ఈ రోజు పిల్లి సుభాష్ చంద్రబోష్ శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితం తన రాజీనామా లేఖను
శాసన మండలి కార్యదర్శికి అందజేశారు.
ఎమ్మెల్పీ పదవికి రాజీనామా చేయడంతో వెంటనే మంత్రి పదవికి కూడా పిల్లి సుభాష్ చంద్రబోష్ రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు ఆయన సీఎం వైఎస్ జగన్‌తో సమావేశం కానున్నారు. పిల్లి బాటలోనే మోపీదేవి వెంకట రమణ కూడా నడవనున్నారు. ఈ రోజు లేదా రేపు శాసన మండలి పదవికి, ఆపై మంత్రి పదవికి మోపీదేవి రాజీనామా చేయనున్నారు.
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోష్ మీడియాతో తన మనసులోని మాటను పంచుకున్నారు. పార్లమెంటుకు వెళ్లాలన్న తన చిరకాల కోరిక నెరవేరుతోందని ఆనందం వ్యక్తం చేశారు. ఏడాది కాలం పాటు నిర్వర్తించిన మంత్రి పదవి బాధ్యలు సంతృప్తినిచ్చాయని చెప్పారు. బాధ్యతల నిర్వహణలో సీఎం వైఎస్ జగన్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని కొనియాడారు. పార్టీ ప్రజా ప్రతినిధులు ఎవరైనా సరే పార్టీకి విధేయులుగా ఉండాల్సిందేనన్నారు.
2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా రేపల్లె, తూర్పు గోదావరి జిల్లా మండపేటల నుంచి పోటీ చేసిన మోపీదేవి వెంటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోష్‌లు ఓటమిపాలయ్యారు. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి కష్టనష్టాల్లో తనతో ఉన్న వారిద్దరికీ సీఎం జగన్ సముచిత స్థానం కల్పించారు. ఎమ్మెల్సీలుగా చేసి మంత్రిపదవులును కట్టబెట్టారు. అయితే ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు మండలి రద్దుకు దారితీశాయి. ఈ క్రమంలో మోపీదేవి, పిల్లి సుభాష్ చంద్రబోష్‌లు తమ పదవులు కోల్పోనున్నారు. పార్టీకి వీర విధేయులైన వారిద్దరినీ సీఎం వైఎస్ జగన్ రాజ్యసభకు పంపారు. ఏపీ నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ సీట్లలో రెండు వీరద్దరికీ కేటాయించారు. మిగిలిన రెండు సీట్లు పార్టీకి ఆది నుంచి అండగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త అయోధ్యా రామిరెడ్డి, రిలయన్స్ సంస్థ ఉద్యోగి, ముకేష్ అంబాని సన్నిహితుడైన పరిమళ్ నత్వానికి పార్టీ తరఫునే కేటాయించారు.