iDreamPost
android-app
ios-app

ఎస్పీ ఆరోగ్యంపై పీఎంఓ నుంచి ఫోన్

ఎస్పీ ఆరోగ్యంపై పీఎంఓ నుంచి ఫోన్

గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం క‌రోనా నుంచి జ‌యించి క్షేమంగా తిరిగి రావాలని దేశం మొత్తం కోరుకుంటోంది. ఇటీవల ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. బాలు ప్రస్తుతం చెన్నై ఎం.జి.ఎం హెల్త్ కేర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ప్రధాని కార్యాలయ అధికారులు బాలు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసినట్టు తెలుస్తోంది. బాలు చికిత్సకు సంబంధించిన వివరాల గురించి ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడారట. అలాగే ప్రభుత్వం తరఫున తమిళనాడు సీఎం పళని స్వామి కూడా ఎప్పటికప్పుడు బాలు చికిత్సకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటున్నారట.

బాలు ఆరోగ్యం గురించి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇప్పటికే ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడారు. మెరుగైన చికిత్సం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కాగా, తన తండ్రి ఆరోగ్యం కాస్త మెరుగు పడిందని, ఇదివరకటితో పోలిస్తే ప్రస్తుతం శ్వాస సులభంగా తీసుకుంటున్నారని బాలు కుమారుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు.

అభిమానుల ఆశీస్సులే దీవెన‌లుగా..

బాలు గానామృతంలో ఎంద‌రో త‌డిసి ముద్ద‌య్యారు. మ‌రెంద‌రో మైమ‌రిచిపోయారు. అందుకే ఆయ‌న కోసం దేశం మొత్తం ప్రార్థ‌న‌లు చేస్తోంది. క్షేమంగా కోలుకుని తిరిగి త‌మ పాట‌ల‌ పూదోట‌లో విక‌సించాల‌ని అభిలాషిస్తున్నారు. వారంద‌రి కోరిక‌, ప్రార్థ‌న‌ల ఫ‌లితంగా ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంగా కోలుకుంటున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అదే నిజం కావాల‌ని మ‌న‌మూ కోరుకుందాం.