Idream media
Idream media
మున్సిపల్ ఎన్నికల్లో రీ నామినేషన్ల వ్యవహారం హైకోర్టుకు చేరింది. మున్సిపల్ ఎన్నికల్లో చిత్తూరు జిల్లా తిరుపతి కార్పొరేషన్, పుంగనూరు మున్సిపాలిటీ, వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి మున్సిపాలిటీ, ఎర్రగుంట్ల నగర పంచాయతీలలో మొత్తం 14 వార్డుల రీనామినేషన్లకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయి. నాలుగు పిటిషన్లు దాఖలవగా.. వాటన్నింటినీ రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం విచారణకు స్వీకరించింది. నామినేషన్లు దాఖలు చేయాల్సిన సమయంలో వేయని వారికి మళ్లీ అవకాశం ఎలా కల్పిస్తారని పిటిషనర్లు తమ పిటిషన్లలో ప్రశ్నించారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసి, ప్రస్తుతం ఉపసంహరణ జరుగుతున్న సమయంలో మళ్లీ నామినేషన్ల దాఖలుకు ఎలా అవకాశం ఇస్తారంటూ ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేశారు.
గత మార్చిలో నామినేషన్ల దాఖలు, పరిశీలన తర్వాత మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు నామినేషన్ల ఉపసంహరణ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు సోమవారం నుంచి రేపు మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. మంగళవారం సాయంత్రం అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. రీ నామినేషన్లు దాఖలు చేసే వారికి.. ఈ రోజు సాయంత్రం వరకు ఎస్‌ఈసీ గడువు ఇచ్చింది. రేపు మధ్యాహ్నం లోపు పరిశీలన, ఉపసంహరణకు సమయం ఇచ్చింది. దీన్నే పిటిషనర్లు సవాల్ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో హైకోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయనే ఆసక్తి నెలకొంది.
ఈ రోజు సాయంత్రంతో రీ నామినేషన్ల దాఖలుకు గడువు ముగుస్తున్న నేపథ్యంలో.. ఏపీ హైకోర్టు లంచ్‌మోషన్ పిటిషన్లపై విచారణ పూర్తి చేసి వెంటనే ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నాయి. రేపటితో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తికానుండడంతోపాటు తుది అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించనున్న నేపథ్యంలో హైకోర్టులో విచారణ వాయిదా పడే అవకాశం కనిపించడంలేదు. హైకోర్టు తీర్పు ఎస్‌ఈసీకి అనుకూలంగా వస్తే.. పిటిషనర్లు సుప్రిం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. తన నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేస్తే.. ఎస్‌ఈసీ సుప్రిం కోర్టును ఆశ్రయిస్తారా..? అంటే నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆ దిశగా దాదాపు ఆలోచించకపోవచ్చు. హైకోర్టులో ఏం జరగబోతోంది మరి కొద్ది గంటల్లో తేలిపోతుంది.