iDreamPost
iDreamPost
ఓ పక్క లక్షలాది మంది వైద్యులు, వేలాది మంది శాస్త్రవేత్తలు బృందాలుగా ఏర్పడి కరోనా నుంచి ప్రపంచాన్ని ఎలా కాపాడాలో నిద్రాహారాలు మాని కష్టపడుతున్నారు. కానీ ప్రాణభయంతో విలవిల్లాడుతున్న జనాన్ని దోచుకునేందుకు కొన్ని సమూహాలు ఎప్పటికప్పుడు సిద్ధమైపోతుంటాయి. వీటికి సంక్షోభమే పెట్టుబడి, ప్రజల భయమే లాభం. అటువంటిదే ఓ ఘటన అనంతపురం జిల్లాలో వెలుగులోకొచ్చింది. జపాన్‌లో తయారైన ‘వైరస్ షటౌట్’ అనే ట్యాగ్‌ని మెడలో వేసుకుంటే వైరస్ భారిన పడమని అక్కడి స్థానికులను నమ్మబలికారు. అసలే భయంతో ఉన్న జనం ఏ చిన్న నమ్మకం కలిగినా వాటిని ఆచరించేందుకు ముందుకొచ్చేస్తున్నారు. అదే రీతిలో వందలాది రూపాయలు వెచ్చించి ఈ ట్యాగ్‌లు కొని మెడలో వేసుకుని విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు.
స్కూలు పిల్లలు, ఉద్యోగులు మెడలో వేసుకుని ఐడెంటిటీ కార్డును పోలి ఉన్న ఈ కార్డులను అమ్మి మోసగాళ్ళు సొమ్ములు చేసేసుకున్నారు. అయితే విషయం బైటకు పొక్కాక శాస్త్రీయంగా ఆలోచించే కొందరు ఈ విషయంలో చొరవ చూపి సదరు ‘షటౌట్’ కార్డుల విషయంలో జనాన్ని మేల్కొలిపే పనిలో పడ్డారు. దీంతో కష్టార్జితం పెట్టి కొన్న వాళ్ళు వాటిని పక్కన పడేసి నాలిక్కర్చుకున్నారు. ఇక్కడ గుర్తించాల్సిందేంటంటే ప్రజల భయమే అక్రమార్కులకు పెట్టుబడి.
సీయం వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రజలు కరోనా భారిన పడకుండా అత్యుత్తమమైన చర్యలు చేపడుతోంది. కొత్తగా పుట్టుకొచ్చిన వ్యాధి కావడంతో ప్రపంచ వ్యాప్తంగా దీనిపై అనేక అనుమానాలు, అపోహలు ఉన్న మాట వాస్తవం అయితే అందుబాటులో ఉన్న పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ప్రజలకు మేలైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు. ప్రమాదాలు, ఇతర వ్యాధులతో పోలిస్తే కేవలం మూడు శాతం మరణాలు మాత్రమే నమోదవుతున్న కోవిడ్ 19 విషయంలో ప్రజలు లేనిపోని సందేహాలకు గురైతే అంతిమంగా ప్రభుత్వంపైనే ఒత్తిడి పడుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి.
నూటికి నూరు పాళ్ళు నమ్మాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం ప్రజలను మోసం చేసేందుకు సిద్ధంగా లేదు. అయితే ప్రభుత్వం సూచించిన నిబంధనలు, జాగ్రత్తలను మాత్రం ప్రజలు తప్పకుండా పాటించాలి. ఇదొక్కడే కరోనాను నియంత్రించగలుగుతుంది. అంతే గానీ తాయెత్తుకట్టుకుంటేనో, నిమ్మకాయ దగ్గర పెట్టుకుంటేనో, మరేదో మంత్రం వేస్తేనో కరోనా పోయేది కాదు. ఈ విషయంలో ప్రతి ఒక్కరు తాత్కాలిక ప్రయోజనాలను ఆశించకుండా తగు జాగ్రత్తలు పాటించడం తప్పని సరి.