iDreamPost
iDreamPost
నాకు కరోనా వచ్చింది. గత వారం రోజులగా నాతో కాంటాక్టులో ఉన్న వారంతా దయచేసి వైద్యపరీక్షలు చేయించుకోండి.. గత కొద్దిరోజులుగా కోవిడ్ భారిన పడ్డ ప్రతి ప్రముఖులు చెబుతున్న మాటలివి. తాము వైరస్ భారిన పడ్డామని, తమకు టచ్‌లో ఉన్న వాళ్ళంతా ధైర్యంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోండని మీడియా ముందుకు వచ్చి వారంతా చెబుతున్నది మన కోసమే అని సామాన్యులు గుర్తెరగాలి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో వైరస్ ఎవరికైనా సోకవచ్చు. కానీ వచ్చిన తరువాత వైద్య పరీక్షలు చేయించుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవడమే ఇక్కడ కీలకం. ఎటువంటి నిర్లక్ష్యం వహించినప్పటికి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇప్పటి వరకు పలువురు రోగులను చూస్తే అర్ధమవుతోంది. వైరస్ భారిన పడడం వ్యక్తుల తప్పు ఎంత మాత్రం కాదు. దానిని దాస్తేనే తప్పవుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఆ దిశగా ప్రజల్లో చైతన్యం కల్పించేందుకే రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు మీడియా ముందుకు వచ్చి స్వయంగా ఆయా విషయాలను వారితో పంచుకుంటున్నారు.
ఈ విషయం గుర్తించకుండా వైరస్ భారిన పడ్డవారు అనవసరంగా రహస్యంగా ఉండాలనుకోవడం తమతో పాటు, తమ కుటుంబంలోని వారికి, తమ తోటి వారికి కూడా ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. ప్రభుత్వం వైద్య పరీక్షలు, చికిత్సలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. చిన్నచిన్న పొరపాట్లు ఎక్కడైనా ఉంటాయి. ఇవే పొరపాట్లను బూతద్ధంలో చూసి భయపడడం ముందు మానేయాలి. వైరస్ భారిన పడ్డట్లుగా ఏ మాత్రం అనుమానం వచ్చినా సంబంధిత ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వెళ్ళి వైద్య పరీక్ష చేయించుకుంటే తరువాత అవసరమైన చికిత్సను వారే ప్రారంభిస్తారు.
ఈ విషయంలో ఎటువంటి అపోహలకు తావు లేదు. కేంద్ర మంత్రి అమిత్‌షా, సినీ ప్రముఖులు అమితాబచ్చన్, రాజమౌళి కంటే మనమేమీ అతీతులం కాదు. వైరస్ ఎవ్వరికైనా రావొచ్చు. కానీ వచ్చిన తరువాత దానికి తగ్గ వైద్య పరీక్షలు, చికిత్సలను ప్రభుత్వం ద్వారా పొందినవాడే ఇప్పుడు హీరో.. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.